చెక్‌డ్యామ్‌లో పడి యువకుడి మృతి | Sakshi
Sakshi News home page

చెక్‌డ్యామ్‌లో పడి యువకుడి మృతి

Published Mon, Nov 20 2023 2:02 AM

-

శ్రీశైలం: క్షేత్రపరిధి హెలిప్యాడ్‌ సమీపంలోని చెక్‌ డ్యామ్‌లో ప్రమాదవశాత్తూ పడి ఓ యువకుడు మృతి చెందాడు. వన్‌టౌన్‌ ఎస్‌ఐ లక్ష్మణరావు తెలిపిన వివరాల మేరకు.. స్థానికంగా నివాసముంటున్న వెంకటనాయుడు కుమారుడు కొక్కెర నాగరాజు (17)కు మతిస్థిమితం సరిగా లేదు. ఈ నెల 17వ తేదీన ఇంటి నుంచి బయటకు వెళ్లిన యువకుడు తిరిగి రాలేదు. కుటుంబీకులు క్షేత్ర పరిధిలో అంతటా వెతికినా ఆచూకీ లభించలేదు. ఆదివారం ఉదయం హెలిప్యాడ్‌ సమీపంలోని చెక్‌డ్యామ్‌ మృతదేహం కనిపించడంతో స్థానికులు పోలీసులకు సమాచారం అందించారు. విషయం తెలుసుకున్న వెంకటనాయుడు అక్కడికి చేరుకుని తమ కుమారుడు నాగరాజుగా గుర్తించాడు. మృతదేహాన్ని పోస్ట్‌మార్టం నిమిత్తం పోలీసులు ప్రాజెక్ట్‌ కాలనీ వైద్యశాలకు తరలించారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్‌ఐ తెలిపారు.

లారీ ఢీకొని వ్యక్తి మృతి

ఆదోనిఅర్బన్‌: పట్టణంలోని ఆలూరు రోడ్డు పంజరాపోల్‌ మలుపు వద్ద లారీ ఢీకొనడంతో దివాకర్‌నగర్‌కు చెందిన కురువ నీలకంఠ(28) అక్కడికక్కడే మృతిచెందాడు. ఈఘటన ఆదివారం మధ్యాహ్నం చోటు చేసుకుంది. మృతుడి కుటుంబ సభ్యులు, ట్రాఫిక్‌ పోలీసులు తెలిపిన వివరాలు ఇలా ఉన్నాయి. కురువ నీలకంఠ బేల్దారి పని చేసుకుంటూ జీవనం సాగించేవాడు. ఆయనకు భార్య పద్మ, ఒక నెల కుమార్తె ఉన్నారు. పట్టణంలోని ఆర్‌ఆర్‌ కాలనీలో బంధువుల ఇంటికి బైక్‌పై వెళ్తుండగా ఎదురుగా వస్తున్న లారీ ఢీకొనడంతో నీలకంఠ అక్కడికక్కడే మృతిచెందాడు. కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నట్లు ట్రాఫిక్‌ పోలీసులు తెలిపారు.

హంద్రీ–నీవా కాలువలో మృతదేహం లభ్యం

పత్తికొండ రూరల్‌: పత్తికొండ–హోసూరు రోడ్డులోని హంద్రీ–నీవా కాలువ వద్ద ఆదివారం మహిళ మృతదేహం అభ్యమైంది. గుర్తించిన సమీప పొలాల రైతులు పోలీసులకు సమాచారం అందజేశారు. మృతదేహం ఆదోని నియోజకవర్గం చిన్నపెండేకల్‌ గ్రామానికి చెందిన గొల్ల ఆదిలక్ష్మి(60)దిగా పోలీసులు గుర్తించారు. మూడు రోజుల నుంచి కనిపించకపోవడంతో ఆమె కుటుంబ సభ్యులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. ప్రమాదవశాత్తు కాలుజారి కాలువలో పడినట్లుగా పోలీసులు గుర్తించారు. నీటి ప్రవాహంలో కొట్టుకొచ్చిన మృతదేహాన్ని వెలికితీసి పోస్టుమార్టం నిమిత్తం ప్రభుత్వాసుపత్రికి తరలించారు. కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నామని ఎస్‌ఐ తెలిపారు.

విద్యార్థి అదృశ్యం

పాములపాడు: జూటూరు గ్రామానికి చెందిన విద్యార్థి విష్ణువర్దన్‌ రెండు రోజులుగా కనిపించడం లేదు. ఎస్‌ఐ అశోక్‌ తెలిపిన వివరాల మేరకు మండల కేంద్రంలోని వివేకానంద స్కూలులో 5వ తరగతి చదువుచున్నాడన్నారు. ఈ నెల 18వ తేదీ మధ్యాహ్నం 3 గంటల నుంచి కనిపించుటలేదని విద్యార్థి తండ్రి బోయ నాగార్జున పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఈ మేరకు మిస్సింగ్‌ కేసు నమోదు చేసినట్లు ఎస్‌ఐ తెలిపారు. కాగా ఓ గుర్తు తెలియని యువకుడు పాఠశాల వద్దకు వచ్చి విష్ణువర్దన్‌ను వెంట తీసుకెళ్లినట్లు సమాచారం. ఈ నెల 16వ తేదీ విష్ణువర్దన్‌ సోదరి వివాహ నిశ్చితార్థ వేడుక జరిగింది. ఆ రోజు గుర్తు తెలియని వ్యక్తి కారులో జూటూరు గ్రామానికి వచ్చినట్లు సీసీ కెమెరాలో రికార్డు అయ్యింది. అదే పోలికలతో ఉన్న యువకుడు విష్ణువర్దన్‌ స్కూలు వద్దకు వచ్చి ఇతర విద్యార్థులతో విష్ణు ఎవరని అడిగి మరీ పిలిపించుకొని అక్కడి నుంచి ఏవో మా టలు చెప్పి వెంట తీసుకెళ్లినట్లు తెలుస్తోంది.

Advertisement
Advertisement