రిజిస్ట్రేషన్‌ చేయడం లేదని వెంచర్‌లో నిరసన | Sakshi
Sakshi News home page

రిజిస్ట్రేషన్‌ చేయడం లేదని వెంచర్‌లో నిరసన

Published Mon, Aug 28 2023 12:56 AM

వెంచర్‌ వద్ద నిరసన తెలియజేస్తున్న బాధితులు  - Sakshi

మూడురోజులుగా అక్కడే

తిష్టవేసిన బాధితులు

వంటావార్పు, రాత్రి అక్కడే బస

వెల్దండ: మండలంలోని కొట్ర సమీపంలో కొత్తగా ఏర్పాటు చేసిన వెంచర్‌లో ప్లాట్లను కొనుగోలు చేసిన బాధితులు యజమానులు వాటిని వారికి రిజిస్ట్రేషన్‌ చేయటం లేదని నిరసన తెలియజేశారు. వెంచర్‌లో టెంట్‌ వేసుకొని 20 మంది బాధితులు అక్కడే మూడు రోజులుగా వంటావార్పు చేసిన ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. బాధితులు తెలిపిన వివరాల ప్రకారం.. మండలంలోని కొట్ర శివారులో కొట్ర చౌరస్తా నుంచి జేపీనగర్‌ వెళ్లే దారిలో ‘అక్షర’ వెంచర్‌ను ఏర్పాటు చేశారు. గ్రామంలోని సర్వే నంబర్లు 396, 397లలో డీటీసీపీ అనుమతులను పొందారు. ఇందుకు సంబంధించి వెంచర్‌ను పలువురు భాగస్వాములు కలిసి ఏర్పాటుచేసి, వారికి తోచినట్లుగా వాటిని అమ్మకాలు చేస్తూ వచ్చారు. చివరి నిమిషంలో ఓ భాగస్వామి డబ్బులను తన సొంత అవసరాలకు వాడుకోవటంతో సమస్య తలెత్తిందని బాధితులు చెబుతున్నారు. డబ్బులు పూర్తిగా కట్టినట్టుగా వారి వద్ద రశీదులు ఉన్నా, రిజిస్ట్రేషన్లు చేయమని అడిగితే కాలం వెల్లదీస్తూ రావటంతో విసిగిపోయి వెంచర్‌ వద్ద టెంట్‌ ఏర్పాటు చేసుకొని వంటావార్పు చేసుకుంటూ అక్కడే నిద్రాహారాలు చేస్తూ నిరసన తెలుపుతున్నారు. విషయాన్ని బయటకు పొక్కకుండా అందులోని కొందరు యజమానులు నచ్చజెప్పినా వినిపించుకోలేదు. చివరకు శనివారం డివిజన్‌ పరిధిలోని ఓ పోలీస్‌ అధికారి బాధిఽతులలో ఒకరికి ఫోన్‌చేసి సమస్యను నేను పరిష్కరిస్తానని చెప్పటంతో బాధితులు నిరసనను విరమింపచేశారు. వచ్చేనెల 5వ తేదీలోపు సమస్యను పరిష్కరిస్తానని ఆ అధికారి హామీ ఇవ్వగా, సమస్య పరిష్కారం కాని పక్షంలో నిరసన కార్యక్రమాలను ఉధృతం చేస్తామని బాధితులు చెబుతున్నారు.

Advertisement
Advertisement