అనారోగ్య సమస్యతో వివాహిత బలవన్మరణం

3 Dec, 2023 11:03 IST|Sakshi

మిడ్జిల్‌: మండలంలోని చిల్వేర్‌కు చెందిన వివాహిత నందిని(31) శుక్రవారం రాత్రి ఇంట్లో ఉరేసుకుని ఆత్మహత్యకు పాల్పడినట్లు ఎస్‌ఐ శివనాగేశ్వర్‌నాయుడు శనివారం తెలిపారు. ఈమె రెండేళ్ల నుంచి అనారోగ్య సమస్యలతో బాధపడుతుండగా, ఎన్ని ఆస్పత్రులకు చూయించుకున్న ప్రయోజనం లేకపోవడంతో శుక్రవారం రాత్రి ఇంట్లో ఫ్యాన్‌కు ఉరేసుకుంది. బంధువుల ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసినట్లు ఎస్‌ఐ తెలిపారు. మృతురాలికి భర్త, ఇద్దరు పిల్లలు ఉన్నట్లు గ్రామస్తులు పేర్కొన్నారు.

కుటుంబ కలహాలతో వ్యక్తి..
అమరచింత:
కుటుంబ కలహాలతో బోయ వెంకటన్న (52) తన ఇంట్లో ఫ్యాన్‌కు ఉరివేసుకుని శనివారం ఆత్మహత్య చేసుకున్న ఘటన మండలంలోని నాగల్‌కడ్మూర్‌లో చోటుచేసుకుంది. అమరచింత పట్టణానికి చెందిన బోయ వెంకటన్న 15ఏళ్ల కిందట మండలంలోని నాగల్‌కడ్మూర్‌లో భార్య పిల్లలతో నివసిస్తున్నాడు.

కూలీపనులతో పాటు పండ్ల వ్యాపారం చేస్తూ జీవనం సాగించేవాడని గ్రామస్తులు తెలిపారు. గురువారం అసెంబ్లీ ఎన్నికల సమయంలో అమరచింతకు వచ్చి ఓటేసి వెళ్లిన ఆంజనేయులు శనివారం ఆత్మహత్యకు పాల్పడ్డాడు. ఇందుకు కుటుంబకలహాలే కారణం కావచ్చని గ్రామస్తులు తెలిపారు.

చికిత్స పొందుతూ వ్యక్తి మృతి
ధరూరు:
మద్యానికి బానిసైన ఓ వ్యక్తి పురుగుల మందు తాగి చికిత్స పొందుతూ మృతి చెందాడు. వివరాలిలా ఉన్నాయి. మండలంలోని ఎములోనిపల్లికి చెందిన ఆంజనేయులు మద్యానికి బానిసై తిరిగే వాడని పోలీసులు తెలిపారు.

గత నెల 23న పురుగుల మందు తాగాడు. ఆయనను అదే రోజు గద్వాల ఏరియా ఆస్పత్రికి తరలించగా.. పరిస్థితి విషమించడంతో కర్నూలుకు తరలించారు. చికిత్స పొందుతూ శనివారం మృతి చెందాడు. మృతుని భార్య ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసినట్లు ఎస్‌ఐ శివానందంగౌడ్‌ తెలిపారు.

బైక్‌ను ఢీకొన్న కారు... ముగ్గురికి తీవ్రగాయాలు
భూత్పూర్‌:
మున్సిపాలిటీలోని గోప్లాపూర్‌ వద్ద శనివారం బైక్‌ను కారు ఢీకొట్టిన ప్రమాదంలో ముగ్గురికి తీవ్రగాయాలైనట్లు హెడ్‌ కానిస్టేబుల్‌ రాంచంద్రయ్య తెలిపారు. మండలంలోని మద్దిగట్లకు చెందిన శివకుమార్‌తో పాటు అతని స్నేహితులు జీ.మహేష్‌, గడ్డమీది మహేష్‌ బైక్‌పై భూత్పూర్‌ నుంచి కొత్త మొల్గర వైపు వెళ్తుండగా, ఎదురుగా వస్తున్న కారు ఢీకొటింది.

దీంతో శివకుమార్‌, జి.మహేష్‌, గడ్డమీది మహేష్‌లకు తీవ్రగాయాలు కాగా అంబులెన్స్‌లో జిల్లా ఆస్పత్రికి తరలించారు. శివకుమార్‌ తండ్రి కొండయ్య ఫిర్యాదు మేరకు కారు డ్రైవర్‌ రాజు ప్రకాష్‌పై కేసు నమోదు చేసినట్లు హెడ్‌కానిస్టేబుల్‌ తెలిపారు.

ఇది చదవండి: కొండాపూర్‌ సర్పంచ్‌ ఆకస్మిక మృతి

మరిన్ని వార్తలు