కొండాపూర్‌ సర్పంచ్‌ ఆకస్మిక మృతి

3 Dec, 2023 10:57 IST|Sakshi
శ్రీనివాస్‌ (ఫైల్‌)

గండేడ్‌: మండలంలోని కొండాపూర్‌ సర్పంచ్‌ చాకలి శ్రీనివాస్‌ శుక్రవారం రాత్రి మృతి చెందారు. రాజకీయాల్లో చురుకుగా ఉండే శ్రీనివాస్‌.. అసెంబ్లీ ఎన్నికల్లో బీఆర్‌ఎస్‌ తరఫున ముమ్మర ప్రచారం నిర్వహించారు. గురువారం ఓటు వేద్దామనే సమయానికి స్వల్ప అస్వస్థతకు గురికావడంతో ఓటు వేయకుండానే మహబూబ్‌నగర్‌లోని తన ఇంటికి వెళ్లిపోయారు.

అతడి పరిస్థితిని గమనించిన కుటుంబ సభ్యులు చికిత్స నిమిత్తం ఓ ప్రైవేటు ఆస్పత్రికి తరలించగా.. పరిస్థితి విషమించి మృతి చెందారు. అతను గతంలో రెండు సార్లు ఎంపీటీసీగా పనిచేశారు. మృతుడికి ఇద్దరు కూతుళ్లు ఉన్నారు. భార్య పుష్పలత స్టాఫ్‌నర్సుగా పనిచేస్తుంది.

గ్రామంలో విషాదం
సర్పంచ్‌ శ్రీనివాస్‌ మృతితో కొండాపూర్‌లో విషాదఛాయలు అలుముకున్నాయి. గ్రామంలో అందరితో కలుపుగోలుగా ఉంటూ.. మూడు సార్లు ప్రజాప్రతినిధిగా ఎన్నికయిన శ్రీనివాస్‌కు అందరితో సన్నిహిత సంబంధాలు ఉన్నాయి. ఆయన మృతిని గ్రామస్తులు జీర్ణించుకోలేకపోతున్నారు. అంత్యక్రియల్లో పరిగి ఎమ్మెల్యే మహేష్‌రెడ్డి పాల్గొని నివాళులర్పించారు.

మాజీ ఎమ్మెల్యే రామ్మోహన్‌రెడ్డి, ఎంపీపీ మాధవి, జెడ్పీటీసీ శ్రీనివాస్‌రెడ్డి, వైస్‌ఎంపీపీ ఈశ్వరయ్యగౌడ్‌, జితేందర్‌రెడ్డి, నారాయణ, పెంట్యానాయక్‌, సర్పంచ్‌ పుల్లారెడ్డి, సునీత, మాజీ ఎంపీపీ శాంతి, మాజీ వైస్‌ఎంపీపీ రాధారెడ్డి సంతాపం వ్యక్తం చేశారు.

బస్సు ఢీకొని వ్యక్తి దుర్మరణం
నాగర్‌కర్నూల్‌ క్రైం:
ఆర్టీసీ బస్సు ఢీకొని ఓ వ్యక్తి మృతిచెందిన ఘటన బిజినేపల్లి మండలం పాలెం గ్రామంలో శనివారం చోటు చేసుకుంది. ఎస్‌ఐ రాములు యాదవ్‌ కథనం మేరకు.. ఖానాపూర్‌కు చెందిన రాములు (59) పాలెంలోని వేంకటేశ్వరస్వామి ఆలయాన్ని దర్శించుకొని తిరిగి గ్రామానికి వెళ్లేందుకు రోడ్డు దాటుతుండగా బస్సు ఢీకొనడంతో అక్కడికక్కడే మృతిచెందాడు.

స్థానికుల సమాచారం మేరకు పోలీసులు ఘటన స్థలాన్ని పరిశీలించి మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం జనరల్‌ ఆస్పత్రి మార్చురీకి తరలించారు. కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్‌ఐ వివరించారు.

ఇది చదవండి: రిటైర్డ్‌ ఉపాధ్యాయుడిపై దాడి.. చివరికి రక్షణగా ఇద్దరు కానిస్టేబుల్స్‌

మరిన్ని వార్తలు