మానవత్వమే అతడి పాలిట మృత్యువై..

23 Dec, 2023 08:04 IST|Sakshi
నవాజ్‌, అశోక్‌ (ఫైల్‌)

ఒకరిని కాపాడేందుకు వెళ్లి మరొకరు మృతి!

రెండు కుటుంబాల్లో విషాదం నింపిన రోడ్డు ప్రమాదం..

మహబూబ్‌నగర్‌: మానవత్వమే అతడి పాలిట మృత్యువైంది. రోడ్డు ప్రమాదంలో తీవ్రంగా గాయపడి ప్రాణాలతో కొట్టుమిట్టాడుతున్న యువకుడితో పాటు అతడిని కాపాడేందుకు వెళ్లిన మరో వ్యక్తిని గుర్తుతెలియని వాహనం ఢీకొట్టడంతో దుర్మరణం చెందారు. రోడ్డు ప్రమాదం ఇద్దరి జీవితాలను ఛిద్రం చేయడమే గాక.. వారి కుటుంబసభ్యుల ఆశలను సమాధి చేసింది. ఈ విషాదకర ఘటన నాగర్‌కర్నూల్‌ జిల్లా కల్వకుర్తి మండలం మార్చాల సమీపంలో గురువారం అర్ధరాత్రి చోటు చేసుకుంది.

ప్రత్యక్ష సాక్షి నర్సింహులు, ఎస్‌ఐ రమేష్‌ వివరాల మేరకు.. కల్వకుర్తి పట్టణంలోని ఇందిరానగర్‌ కాలనీకి చెందిన నవాజ్‌ (25) టైలరింగ్‌ చేస్తూ జీవనం సాగిస్తున్నాడు. అతడికి 11 నెలల కిందట వివాహం కాగా.. 10 రోజుల క్రితం కూతురు జన్మించింది. తన కుమార్తెను చూసేందుకు గురువారం మధ్యాహ్నం బైక్‌పై తన అత్తగారి ఊరైన జడ్చర్ల పట్టణానికి వెళ్లాడు. అక్కడి నుంచి రాత్రి కల్వకుర్తికి బయల్దేరగా.. మండలంలోని మార్చాల సమీపంలో గుర్తు తెలియని వాహనం ఢీకొట్టింది. ప్రమాదంలో అతడికి తీవ్రగాయాలయ్యాయి.

అదే సమయంలో హాలియా నుంచి కొత్తకోట మండలం కనిమెట్టకు వెళ్తున్న ఓ కంపెనీ పాల వ్యాన్‌ హెల్పర్‌ అశోక్‌ (30) ప్రాణాలతో కొట్టుమిట్టాడుతున్న నవాజ్‌ను గమనించి కాపాడే ప్రయత్నం చేస్తుండగా.. కల్వకుర్తి వైపు వేగంగా వెళ్తున్న మరో గుర్తు తెలియని వాహనం ఢీకొట్టింది. ప్రమాదంలో నవాజ్‌తో పాటు అశోక్‌కు తీవ్రగాయాలై దుర్మరణం చెందారు. అశోక్‌ది వనపర్తి జిల్లా కొత్తకోట మండలం కనిమెట్ట గ్రామం. పాల వ్యాన్‌ డ్రైవర్‌ నర్సింహులు పోలీసులకు సమాచారం ఇవ్వడంతో ఘటనా స్థలానికి చేరుకొని ఇద్దరి మృతదేహాలను కల్వకుర్తి మార్చురీకి తరలించారు. కాగా.. స్థానిక ప్రభుత్వ ఆస్పత్రి మార్చురీ వద్ద ఇరువురి కుటుంబసభ్యుల రోధనలు మిన్నంటాయి. పాలవ్యాన్‌ డ్రైవర్‌ నర్సింహులు ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు జరుపుతున్నట్లు ఎస్‌ఐ రమేష్‌ తెలిపారు.

కనిమెట్టలో విషాదఛాయలు..
కొత్తకోట మండలంలోని కనిమెట్టకు చెందిన చీర్ల నాగమ్మ, వెంకటయ్య దంపతుల కుమారుడు అశోక్‌ కొంత కాలంగా గ్రామ సమీపంలోని ఓ డెయిరీ మిల్క్‌ ఫ్యాక్టరీకి చెందిన లారీ క్లీనర్‌గా పనిచేస్తున్నాడు. కల్వకుర్తి మండలం మార్చాల వద్ద చోటుచేసుకున్న రోడ్డు ప్రమాదంలో అశోక్‌ దుర్మరణం చెందడంతో గ్రామంలో విషాదఛాయలు అలుముకున్నాయి.
ఇవి కూడా చ‌ద‌వండి: బైక్‌ను వెనక నుంచి ఢీకొట్టిన లారీ.. యువకుల దుర్మరణం!

>
మరిన్ని వార్తలు