‘హరితహారం’లో అవినీతి, అక్రమాలు | Sakshi
Sakshi News home page

‘హరితహారం’లో అవినీతి, అక్రమాలు

Published Sat, Dec 23 2023 12:42 AM

హాజరైన కౌన్సిలర్లు  - Sakshi

మహబూబ్‌నగర్‌ మున్సిపాలిటీ: పట్టణ పరిధిలో నాలుగేళ్లుగా చేపట్టిన ‘హరితహారం’ పనుల్లో అవినీతి, అక్రమాలు చోటు చేసుకున్నాయని, వెంటనే విజిలెన్స్‌ విచారణకు ఆదేశించాలని బీజేపీ, కాంగ్రెస్‌ కౌన్సిలర్లు డిమాండ్‌ చేశారు. శుక్రవారం మహబూబ్‌నగర్‌ మున్సిపల్‌ కౌన్సిల్‌ సమావేశ మందిరంలో సర్వసభ్య సమావేశం వాడీవేడిగా జరిగింది. ఈ పథకం పేరుతో ఇప్పటివరకు రూ.18 కోట్లు వెచ్చించారని, మున్సిపల్‌ బడ్జెట్‌లో పదిశాతం కంటే మించి ఎలా పెడారని 14వ వార్డు కౌన్సిలరు అంజయ్య (బీజేపీ ఫ్లోర్‌ లీడర్‌), 3వ వార్డు కౌన్సిలరు రామాంజనేయులు, 21, 37, 39వ వార్డు కౌన్సిలర్లు ఆనంద్‌గౌడ్‌, స్వప్న, రమాదేవి ప్రశ్నించారు. ఇవే పనులకు ‘ముడా’ నుంచి రూ.8 కోట్లు ఖర్చు చేయడం ఎంతవరకు సమంజసమన్నారు. బైపాస్‌లో మొక్కల పెంపకానికి ఏకంగా రూ.1.5 కోట్లు ఖర్చు చేశారని, ఒకే వ్యక్తికి టెండరు ఎలా ఇచ్చారన్నారు. సదరు కాంట్రాక్టరు నాటిన మొక్కల ధరను ఎక్కువ చేసి లెక్కలు చూపుతున్నారని ఆరోపించారు. పట్టణంలో వివిధ అభివృద్ధి పనులకు సంబంధించి ప్రైవేట్‌ కన్సల్టెన్సీ సంస్థతో డీపీఆర్‌ తయారు చేయాల్సిన అవసరం లేదన్నారు. దీనికి రూ.60లక్షలు ఎందుకు వెచ్చించాలన్నారు. తమ వార్డుల్లో తరచూ తాగునీటి పైపులైన్లు లీకేజీ అవుతున్నాయని, నాసిరకం పరికరాలు ఉపయోగించడంతోనే ఈ సమస్య తలెత్తుతోందని కౌన్సిలర్లు షబ్బీర్‌ అలీ, సాదతుల్లా, స్వప్న, రమాదేవి సభ దృష్టికి తెచ్చారు. ఇక ముందు అలా జరగకుండా చూడాలన్నారు. పట్టణంలో చాలా చోట్ల వీధిలైట్లు సరిగా వెలగడం లేదని, వెంటనే బాగు చేయించాలని కౌన్సిలర్లందరూ ముక్తకంఠంతో కోరారు. అలాగే కుక్కల బెడద ఎక్కువగా ఉందని, వాటిని పట్టుకుని సంరక్షణ కేంద్రానికి తరలించాలన్నారు. అలాగే ప్రతినెలా సమావేశం నిర్వహించాలని, అప్పుడే ఎప్పటి సమస్యలు అప్పుడు పరిష్కారానికి నోచుకుంటాయన్నారు. రూ.100కోట్లతో చేపట్టిన కొన్ని పనులు మధ్యలోనే ఆగిపోయాయని, మరికొన్ని అసలు చేపట్టలేదని వాపోయారు. రాష్ట్ర ప్రభుత్వం మారడంతో కాంట్రాక్టర్లు తమకు బిల్లులు వస్తాయో.. రావోనని ఆందోళన చెందుతున్నారన్నారు. ఎలాగైనా ఈ నిధులు వచ్చేలా చూడాలన్నారు. ఇక క్రిస్టియన్‌పల్లి సమీపంలో మొత్తం 10.25 ఎకరాల స్థలాన్ని రెసిడెన్షియల్‌ నుంచి కమర్షియల్‌గా మార్చడానికి సభ్యులు అభ్యంతరం తెలిపారు. రెండేళ్లయినా తమ వార్డులో రూ.ఆరు లక్షలతో మహిళా సంఘ భవనం నిర్మించడానికి ఎందుకు చర్యలు తీసుకోవడం లేదని 43వ వార్డు కౌన్సిలర్‌ గోవింద్‌ ప్రశ్నించారు. కాగా సభ్యులు ప్రస్తావించిన సమస్యలను సాధ్యమైనంత వరకు పరిష్కరిస్తామని మున్సిపల్‌ చైర్మన్‌ కేసీ నర్సింహులు, కమిషనర్‌ డి.ప్రదీప్‌కుమార్‌ హామీ ఇచ్చారు. సమావేశానికి ముఖ్య అతిథిగా విచ్చేసిన స్థానిక సంస్థల అదనపు కలెక్టర్‌ శివేంద్ర ప్రతాప్‌ మాట్లాడుతూ ఆయా సమస్యలను రాష్ట్ర ప్రభుత్వం దృష్టికి తీసుకెళతామన్నారు. వివిధ అభివృద్ధి పనులకు సంబంధించి నిధులు వచ్చేలా కృషి చేస్తామన్నారు. సమావేశంలో వైస్‌ చైర్మన్‌ తాటి గణేష్‌కుమార్‌, ఏఎంసీ పవన్‌కుమార్‌, ఎంఈ బస్వరాజ్‌, ఏసీపీ జ్యోత్స ్న, టీపీఓ లక్ష్మీపతి తదితరులు పాల్గొన్నారు.

విజిలెన్స్‌ విచారణకు బీజేపీ, కాంగ్రెస్‌ కౌన్సిలర్ల డిమాండ్‌

వాడీవేడిగా పాలమూరు మున్సిపల్‌ కౌన్సిల్‌ సమావేశం

1/1

Advertisement
Advertisement