ఆటో బోల్తా.. నలుగురి పరిస్థితి విషమం

1 Jan, 2024 09:07 IST|Sakshi
గాయపడిన కూలీలు,గుంతలో పడిన ఆటోను బయటకు తీస్తున్న స్థానికులు

అచ్చంపేట రూరల్‌: అతివేగంగా వెళ్తున్న ఆటో అదుపు తప్పి బోల్తా పడిన సంఘటనలో 10 మంది కూలీలు తీవ్రంగా గాయపడ్డారు. అందులో నలుగురి పరిస్థితి విషమంగా ఉంది. స్థానికులు తెలిపిన వివరాలు ఇలా ఉన్నాయి. మండలంలోని రంగాపూర్‌కు చెందిన కూలీలు శివారు ప్రాంతంలోని మిరపతోట వద్దకు ఆదివారం ఉదయం కూలీకి వెళ్లారు.

పనులు ముగించుకుని తిరిగి గ్రామానికి ఆటోలో వస్తుండగా.. మార్గమధ్యంలో ఆటో అదుపు తప్పి రోడ్డు పక్కన ఉన్న గుంతలోకి దూసుకెళ్లి బోల్తా పడింది. 10 మంది కూలీలకు కాళ్లు, చేతులకు తీవ్ర గాయాలయ్యాయి.

రూప్లి, చిన్ని, భామిని, రాజికి కాళ్లు, చేతులు విరిగి తీవ్ర గాయాలయ్యాయి. క్షతగాత్రులను అచ్చంపేట ఆస్పత్రికి తరలించారు. వైద్యులు తీవ్రంగా గాయపడిన నలుగురిని హైదరాబాద్‌కు రెఫర్‌ చేశారు. డ్రైవర్‌ రాంలాల్‌ నిర్లక్ష్యంగా ఆటోను నడపడంతోనే ప్రమాదం జరిగిందని స్థానికులు చెప్పారు.

ఏదుట్ల సమీపంలో ఆటో, బస్సు ఢీ
గోపాల్‌పేట: ఏదుట్ల సమీపంలో బస్సు, ఆటో ఢీకొనడంతో ఆశావర్కర్‌ కాలు పూర్తిగా విరిగిపోయింది. రాజాపూర్‌కి చెందిన ఊర్కొండ రాణి కోడేరు మండలంలోని రాజాపూర్‌లో ఆశావర్కర్‌గా పనిచేస్తోంది. ఆదివారం వనపర్తికి వెళ్లి సాయంత్రం రాజాపూర్‌కు ఆటోలో తిరుగు ప్రయాణమైంది.

ఏదుట్ల లోపలికి ఆటో వెళ్తుండగా.. నాగర్‌కర్నూల్‌ నుంచి వనపర్తి వెళ్తున్న ఆర్టీసీ బస్సు ఆటోను పక్క నుంచి ఢీకొట్టింది. రాణి కాలు కొంత బయటకు ఉండటంతో కాలు పూర్తిగా విరిగి కింద పడిపోయింది. స్థానికులు వెంటనే ఆస్పత్రికి తరలించారు. ఈ విషయంపై ఎటువంటి ఫిర్యాదు అందలేదని గోపాల్‌పేట ఎస్‌ఐ వెంకటేశుర్లు తెలియజేశారు.

>
మరిన్ని వార్తలు