దేశాభివృద్ధిలో విద్య, వైద్యం కీలకం

21 Jun, 2023 03:38 IST|Sakshi
పోతులబోగూడలో మన ఊరు – మన బడిని ప్రారంభిస్తున్న ప్రజాప్రతినిధులు

మన ఊరు–మన బడి కార్యక్రమంలో రాష్ట్ర మహిళా కమిషన్‌ చైర్‌పర్సన్‌ సునీతాలక్ష్మారెడ్డి

ఎమ్మెల్యేలు పద్మాదేవేందర్‌రెడ్డి, మదన్‌రెడ్డి, కలెక్టర్‌ రాజర్షిషా

శివ్వంపేట(నర్సాపూర్‌) : దేశాభివృద్ధిలో విద్య, వైద్యం కీలకమని రాష్ట్ర మహిళా కమిషన్‌ చైర్‌పర్సన్‌ సునీతాలక్ష్మారెడ్డి, లేబర్‌ వెల్ఫేర్‌ బోర్డు చైర్మన్‌ దేవేందర్‌రెడ్డి, ఎమ్మెల్యే మదన్‌రెడ్డి, కలెక్టర్‌ రాజర్షిషా అన్నారు. రాష్ట్ర అవతరణ దశాబ్ది ఉత్సవాల్లో భాగంగా మంగళవారం విద్యా దినోత్సవాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా మండలంలోని పోతులబోగూడ గ్రామంలో మనఊరు– మన బడిని వారు ప్రారంభించారు. అనంతరం విద్యార్థులకు పాఠ్య పుస్తకాలు, యూనిఫాం అందజేసి మాట్లాడారు. గ్రామీణ స్థాయిలో నాణ్యమైన విద్యను అందించేందుకు రాష్ట్ర ప్రభుత్వం మన ఊరు– మన బడి కార్యక్రమానికి శ్రీకారం చుట్టిందన్నారు.

అదేవిధంగా దంతన్‌పల్లి గ్రామంలో మన ఊరు– మన బడి ని ప్రజా ప్రతినిధులు ప్రారంభించారు. కార్యక్రమంలో జిల్లా ఎంపీపీల ఫోరం అధ్యక్షుడు కల్లూరి హరికృష్ణ, జడ్పీ కోఆప్షన్‌ మన్సూర్‌, ఆత్మకమిటీ చైర్మన్‌ వెంకట్‌రెడ్డి, పీఏసీఎస్‌ చైర్మన్‌ వెంకట్‌రెడ్డి, తహసీల్దార్‌ శ్రీనివాస్‌చారి, ఎంఈఓ బుచ్చనాయక్‌, సర్పంచ్‌లు హరికిషన్‌, దుర్గేష్‌, హెచ్‌ఎంలు రాజశేఖర్‌రెడ్డి, సత్తయ్య, బీఆర్‌ఎస్‌ నాయకులు నాగేశ్వర్‌రావు, హన్మంత్‌రెడ్డి, మహిపాల్‌రెడ్డి, బిక్షపతిరెడ్డి, కుంట లక్ష్మణ్‌, శ్రీనివాస్‌గౌడ్‌, రాజశేఖర్‌గౌడ్‌ తదితరులు ఉన్నారు.

పెరిగిన విద్యార్థుల సంఖ్య
మెదక్‌మున్సిపాలిటీ : రాష్ట్ర ప్రభుత్వం విద్యా రంగంలో తీసుకొచ్చిన సంస్కరణల వల్ల నేడు ప్రభుత్వ పాఠశాలలో విద్యార్థుల సంఖ్య భారీగా పెరిగిందని ఎమ్మెల్యే పద్మా దేవేందర్‌రెడ్డి అన్నారు. రాష్ట్ర అవతరణ దశాబ్ది ఉత్సవాలలో భాగంగా మంగళవారం విద్యాశాఖ ఆధ్వర్యంలో స్థానిక ద్వారకా గార్డెన్‌ నందు ఏర్పాటు చేసిన ఉపాధ్యాయ దినోత్సవంలో జడ్పీ చైర్‌ పర్సన్‌ హేమలత శేఖర్‌గౌడ్‌, కలెక్టర్‌ రాజర్షి షాతో కలిసి పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ రాష్ట్రంలోని 26 వేల ప్రభుత్వ పాఠశాలలో రూ.7వేల కోట్లతో మౌలిక వసతులు కల్పిస్తున్నట్లు చెప్పారు.

జడ్పీ చైర్‌పర్సన్‌ హేమలత శేఖర్‌గౌడ్‌ మాట్లాడుతూ మన ఊరు –మన బడి కింద పాఠశాలలో మెరుగైన వసతులు కల్పిస్తూ ఉత్తమ బోధన అందిస్తున్నట్లు తెలిపారు. కలెక్టర్‌ రాజర్షి షా మాట్లాడుతూ జిల్లాలో ఎంపిక చేసిన 152 పాఠశాలల్లో గ్రంథాలయాలు, 88 ఉన్నత పాఠశాలల్లో ఐఎఫ్‌పీ ప్యానల్స్‌తో డిజిటల్‌ తరగతులు, 24 పాఠశాలల్లో రాగిజావ కార్యక్రమాలను ప్రారంభించామని తెలిపారు. అనంతరం ఉపాధ్యాయులకు ట్యాబ్‌లు పంపిణి చేశారు. కార్యక్రమంలో జిల్లా గ్రంథాలయ సంస్థ అధ్యక్షులు చంద్ర గౌడ్‌, మునిసిపల్‌ చైర్మన్‌ చంద్ర పాల్‌, డీఈఓ రాధాకిషన్‌, జిల్లా సైన్స్‌ అధికారి రాజిరెడ్డి, జిల్లా అటవీ అధికారి రవి ప్రసాద్‌ తదితరులు పాల్గొన్నారు.

మరిన్ని వార్తలు