ఎలక్షన్లు, కలెక్షన్లు అంటూ.. మాటల తూటాలు!

28 Mar, 2024 07:10 IST|Sakshi
రఘునందన్‌రావు బీజేపీ అభ్యర్థి, పి.వెంకట్రామిరెడ్డి బీఆర్‌ఎస్‌ అభ్యర్థి

బీఆర్‌ఎస్‌ వర్సెస్‌ బీజేపీ

రఘునందన్‌పై సైటెర్లు

వెంకట్రాంరెడ్డికి రూ.వంద కోట్లు ఎక్కడివని కౌంటర్‌

వేడెక్కిన మెదక్‌ లోక్‌సభ రాజకీయం

సైడెపోతున్న కాంగ్రెస్‌

సాక్షిప్రతినిధి, సంగారెడ్డి: లోక్‌సభ ఎన్నికల వేళ ప్రధాన పార్టీల నేతల మధ్య మాటల యుద్ధం షురూవైంది. ఇరు పార్టీల నేతలు పరస్పరం మాటల తూటాలు పేలుతున్నాయి. ఆయా పార్టీల క్యాడర్‌ను ఈ ఎన్నికలకు సమాయత్తం చేయడంలో భాగంగా నిర్వహిస్తున్న సమావేశాల్లో నేతలు ఒకరినొకరు చేసుకుంటున్న ప్రత్యారోపణలతో ఉమ్మడి మెదక్‌ జిల్లా రాజకీయం వేడెక్కింది. ప్రధానంగా బీఆర్‌ఎస్‌, బీజేపీ నేతల విమర్శలు రాజకీయవర్గాల్లో రచ్చకు దారితీస్తున్నాయి.

బీఆర్‌ఎస్‌ ఎద్దేవా?
బీజేపీ అభ్యర్థి రఘునందన్‌రావు అంటే ఎలక్షన్లు, కలెక్షన్లు అంటూ బీఆర్‌ఎస్‌ నేతలు సైటెర్లు వేశారు. గులాబీ పార్టీ సంగారెడ్డి నియోజకవర్గం ముఖ్య నాయకుల సమావేశం మంగళవారం స్థానిక ఓ ఫంక్షన్‌ హాలులో జరిగింది. దుబ్బాకలో ప్రజలు తిరస్కరించిన ఆయన్నే బీజేపీ మెదక్‌ లోక్‌సభ అభ్యర్థిగా బరిలోకి దించిందని కారు పార్టీ నేతలు విమర్శలు గుప్పించారు. అలాగే కేంద్ర ప్రభుత్వ తీరును కూడా ఎండగట్టారు. నచ్చినోళ్లు జేబులో ఉండాలి నచ్చనోళ్లు జైలులో ఉండాలి అన్నట్లుగా బీజేపీ సర్కారు వ్యవహరిస్తోందని విమర్శించారు.

ఆయనకు నిధులెక్కడివి?
బీఆర్‌ఎస్‌ నేతల విమర్శలను కమలం పార్టీ తిప్పికొట్టింది. బీఆర్‌ఎస్‌ అభ్యర్థి పి.వెంకట్రాంరెడ్డికి రూ. వంద కోట్లు ఎక్కడి నుంచి వచ్చాయంటూ బీజేపీ అభ్యర్థి రఘునందన్‌రావు ప్రశ్నించారు. తాను ఎంపీగా గెలిచాక రూ.వంద కోట్లు సొంత నిధులతో పీవీఆర్‌ ట్రస్ట్‌ను ఏర్పాటు చేస్తామని వెంకట్రాంరెడ్డి ప్రకటించారు. ఇందులోంచి ఏటా రూ.20 కోట్లతో నియోజకవర్గంలోని నిరుపేద విద్యార్థులకు ఉచితంగా ఉన్నత విద్యను అందిస్తానని హామీ ఇచ్చారు. ఈ వివరాలను పక్కాగా వెబ్‌సైట్‌లో ఉంచుతానని స్పష్టం చేశారు. ఆయనకు రూ.వంద కోట్లు ఎక్కడి నుంచి వచ్చాయంటూ సంగారెడ్డిలో బుధవారం నిర్వహించిన బీజేపీ ముఖ్యనేతల సమావేశంలో రఘునందన్‌ ప్రశ్నించారు.

ఇవి చదవండి: కాంగ్రెస్‌కు ఓటేస్తే రైతుల పరిస్థితి ఆగమే.. : వినోద్‌కుమార్‌

Election 2024

మరిన్ని వార్తలు

Greenmarkdevelopers