సాయం చేయాలంటూ ఫ్యాన్స్‌ను కోరిన విజయ్‌

7 Dec, 2023 08:44 IST|Sakshi

బంగాళాఖాతంలో ఏర్పడిన మిచౌంగ్‌ తుపాను కారణంగా చెన్నైలో నివశిస్తున్న ప్రజలు అల్లాడిపోతున్నారు. ఆంధ్రప్రదేశ్‌లో తుపాను తీరాన్ని తాకినప్పటికీ, వర్షం కారణంగా చెన్నైని వరదలు ముంచెత్తాయి. చాలా చోట్ల క్రమంగా అక్కడి పరిస్థితులు చక్కబడుతున్నాయి. అయితే, వేలచ్చేరి, మడిపాక్కం, పల్లికరణై, పెరుంబాక్కం, దురైపాక్కం వంటి ప్రాంతాల్లో నీరు చేరిపోయి చెరువులను తలపిస్తున్నాయి. భారీ వర్షాల కారణంగా విద్యుత్ కోత ఏర్పడింది. సాధారణ ప్రజలు ఆహారానికి కూడా ఇబ్బంది పడుతున్నారు.

దీంతో తమిళనాడులోని ఇతర జిల్లాల నుంచి వాలంటీర్లు చెన్నైకి వెళ్లి సహాయం చేయడం ప్రారంభించారు. అక్కడ కూడా చాలా మంది ఫుడ్, వాటర్ బాటిళ్లు అందజేస్తున్నారు. చిత్ర పరిశ్రమకు చెందిన సూర్య, కార్తి తమిళ ప్రజలకు సాయం చేసేందుకు అందరి కంటే ముందుగా రియాక్ట్‌ అయ్యారు. ఇబ్బందులు పడుతున్న ప్రజల కోసం రూ. 10 లక్షలు సాయం ప్రకటించారు. ఆ తర్వాత వర్ధమాన నటుడు హరీష్ కళ్యాణ్ లక్ష 10 రూపాయలు ఇచ్చారు. ఇందులో విజయ్ ఏం చేయబోతున్నాడా అని చాలా మంది ఎదురు చూశారు. కానీ అతను ఎలాంటి ఆర్థిక సాయం ప్రకటించలేదు. దీంతో ఆయన తీరుపై సోషల్‌ మీడియాలో నెటిజన్లు రియాక్ట్‌ అయ్యారు.

విజయ్ మౌనం వీడాడు
ఈ సందర్భంగా ఆయన తన ట్విట్టర్ పేజీలో మాట్లాడుతూ.. చెన్నైతోపాటు శివారు ప్రాంతాల్లో కురుస్తున్న భారీ వర్షాల కారణంగా చిన్నారులు, మహిళలు, వృద్ధులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారని సమాచారం. వేలాది మంది ప్రజలు తాగునీరు, ఆహారం లేకుండా, తగిన మౌలిక వసతులు లేకుండా ఇబ్బందులు పడుతున్నారు. వరదల్లో చిక్కుకున్న వారిని రక్షించాలని కోరుతూ సోషల్ మీడియాలో ఇంకా అనేక స్వరాలు వినిపిస్తున్నాయి.

ఈ సమయంలో, బాధిత ప్రాంతాల ప్రజలను ఆదుకోవడానికి ప్రభుత్వం చేపడుతున్న సహాయక చర్యల్లో ప్రజా ఉద్యమ నిర్వాహకులందరూ స్వచ్ఛందంగా పాల్గొనవలసిందిగా కోరుతున్నాను. చేయి చేయి కలుపుదాం, దుఃఖాన్ని దూరం చేద్దాం.' అని విజయ్‌ తెలిపాడు. అంతే కాకుండా ప్రభుత్వానికి సాయం చేయడానికి వలంటీరులుగా రావాలని తమ ఫ్యాన్స్‌ను సాయం కోరాడు. 

>
మరిన్ని వార్తలు