కథలన్నీ సలీమ్‌వి... సంభాషణలు నావి

21 Jan, 2023 15:02 IST|Sakshi

మొదటిసారి తేటతెల్లం చేసిన జావేద్‌ అఖ్తర్‌

(జైపూర్‌ నుంచి సాక్షి ప్రతినిధి): బాలీవుడ్‌ స్టార్‌ రచయితలు సలీమ్‌ జావేద్‌ విడిపోయి ఇంతకాలం అయినా వారు ఇరువురూ ఏనాడూ తాము పని విభజన ఎలా చేసుకున్నారో చెప్పలేదు. ఎన్ని ఇంటర్వ్యూలలో ఆ ప్రశ్న వేసినా సమాధానం దాట వేసేవారు. కాని జైపూర్‌లో జరుగుతున్న లిటరేచర్‌ ఫెస్టివల్‌లో శుక్రవారం తన పుస్తకం ‘టాకింగ్‌ లైఫ్‌’ విడుదల సందర్భంగా జావేద్‌ మాట్లాడుతూ ‘మేమిద్దరం (సలీం జావేద్‌) రాసిన సినిమాలన్నింటిలో ప్రతి కథా సలీం నుంచి వచ్చేది. సంభాషణలు నేను రాసేవాణ్ణి. స్క్రీన్‌ ప్లే ఇద్దరం సమకూర్చేవాళ్లం’ అని తేటతెల్లం చేశాడు. 


ఈ ఇద్దరి జంట రచనలో జంజీర్, యాదోంకి బారాత్, డాన్, షోలే, దీవార్, శక్తి వంటి సూపర్‌హిట్‌ బాలీవుడ్‌ సినిమాలు రూపుదిద్దుకున్నాయి. రచయితలకు సినిమా రంగంలో స్టార్‌డమ్‌ తెచ్చిన జోడి వీరు. ‘మేమిద్దరం అనుకోకుండా కలిశాం. దర్శకుడు రమేష్‌ సిప్పి వాళ్ల నాన్న దగ్గర నెలకు 750 రూపాయల జీతానికి చేరాం.  రాజేష్‌ ఖన్నా హీరోగా అందాజ్, హాతీ మేరి సాథి రాయడంతో స్థిరపడ్డాం’ అన్నాడాయన. బాలీవుడ్‌లో యాంగ్రీ యంగ్‌మేన్‌ ఇమేజ్‌ను హీరోకు సృష్టించిన ఈ జంట అనిల్‌ కపూర్‌ హీరోగా ‘మిస్టర్‌ ఇండియా’ (1987) రాశాక విడిపోయారు. (క్లిక్ చేయండి: అవకాశాలు ఇప్పిస్తాం, కోరికలు తీర్చమని అడిగారు)

మరిన్ని వార్తలు