ఈ అల్లుడు బెదుర్స్‌!

16 Jan, 2021 05:20 IST|Sakshi

రివ్యూ టైమ్‌

చిత్రం: ‘అల్లుడు అదుర్స్‌’; తారాగణం: బెల్లంకొండ సాయి శ్రీనివాస్, నభా నటేశ్, ప్రకాశ్‌ రాజ్, సోనూసూద్, అనూ ఇమ్మాన్యుయేల్‌; సంగీతం: దేవిశ్రీ ప్రసాద్‌; కెమేరా: ఛోటా కె. నాయుడు; ఫైట్స్‌: రామ్‌ – లక్ష్మణ్, స్టన్‌ శివ; ఎడిటింగ్‌: తమ్మిరాజు; నిర్మాత: గొర్రెల సుబ్రహ్మణ్యం; దర్శకత్వం: సంతోష్‌ శ్రీనివాస్‌; రిలీజ్‌: జనవరి 14

అల్లుడు పాత్ర తెలుగు సినిమాకు మంచి కమర్షియల్‌ ఎలిమెంట్‌. సంక్రాంతికి అత్తారింటికి కొత్త అల్లుళ్ళు వచ్చినట్టే... ఈ సినీ సంక్రాంతికి థియేటర్లకు వచ్చిన చిత్రం ‘అల్లుడు అదుర్స్‌’. కానీ, అన్నిసార్లూ అల్లుడి సెంటిమెంట్‌ వర్కౌట్‌ అవుతుందా? విలన్‌ మామ గారిని ఒప్పించి, హీరోయిన్‌తో ప్రేమ పెళ్ళి చేసుకున్న హీరో కథలు కొన్ని వందల సినిమాల్లో చూశాం. మరోసారి ఆ ఫార్ములాను వాడి, తీసిన సినిమా ఇది.

కథేమిటంటే..: ఫ్యాక్షనిస్ట్‌ తరహా లీడర్‌ – నిజామాబాద్‌ జైపాల్‌ రెడ్డి (ప్రకాశ్‌ రాజ్‌). అతనికి ఇద్దరు కూతుళ్ళు. పెద్దమ్మాయి వసుంధర (అనూ ఇమ్మాన్యుయేల్‌). చిన్నప్పటి స్కూల్‌ ఫ్రెండ్‌ అయిన ఆ
అమ్మాయంటే శీను (బెల్లంకొండ సాయి శ్రీనివాస్‌)కు ఇష్టం. కానీ, ఆమె రియల్‌ ఎస్టేట్‌ గజ (సోనూసూద్‌)ను ప్రేమిస్తుంది. ఇది ఇలా ఉండగా, తెలియకుండానే వసుంధర చెల్లెలు కౌముది (నభా నటేశ్‌)తో లవ్‌ ఎట్‌ ఫస్ట్‌ సైట్‌లో పడతాడు హీరో. ఆ పెళ్ళి వద్దనే ఆడపిల్ల తండ్రిని మన హీరో ఎలా మెప్పించి, ఒప్పించాడన్నది కథ. సోనూసూద్‌కూ, ప్రకాశ్‌ రాజ్‌కూ మధ్య సినిమా కథలో సంబంధం ఏమిటి? సోనూసూద్‌ విఫల ప్రేమకథ ఎలా చివరకు సక్సెసైంది అన్నది ఓపిగ్గా చూడాల్సిన మెయిన్‌ కథలోని కీలక ఉపకథ.

ఎలా చేశారంటే..: బెల్లంకొండ సాయి శ్రీనివాస్‌ ఎప్పటిలానే డ్యాన్సులు, ఫైట్లు బాగా చేశారు. హిందీ డబ్బింగ్, శాటిలైట్‌ మార్కెట్‌ ఉన్నందు వల్లనో ఏమో – ఒకటి రెండు హిందీ డైలాగులూ చెప్పారు. హీరోయిజాన్ని ఎలివేట్‌ చేసేలా ‘‘శీనుగాడు నా ఫ్రెండు. యాక్షన్‌ సీన్లలో వీడిది సెపరేట్‌ ట్రెండు’’ (హీరో గురించి వెన్నెల కిశోర్‌) లాంటి మాస్‌ డైలాగులూ పెట్టారు. ఫైట్స్‌తో పాటు కామెడీ పండించేందుకు హీరో తెగ ప్రయత్నించారు. నభా నటేశ్‌ ఓకే అనిపిస్తారు. అనూ ఇమ్మాన్యుయేల్‌ది నిడివి పరంగా చిన్న పాత్రే. ప్రకాశ్‌ రాజ్, సోనూసూద్‌ తదితరులు – ఈ పాత్రల్లో ప్రత్యేకించి చేయడానికీ, నిరూపించుకోవడానికీ ఇవాళ కొత్తగా ఏమీ లేదు. హీరో తల్లి పాత్రలో ఒకప్పటి హీరోయిన్‌ ఇంద్రజ, హీరో ఇంట పనిమనిషి రత్తాలుగా హరితేజ లాంటి వాళ్ళూ ఉన్నారు.

ఎలా తీశారంటే..: సినిమాటోగ్రఫీ నుంచి దర్శకత్వం వైపు వచ్చిన సంతోష్‌ శ్రీనివాస్‌కు దర్శకుడిగా ఇది నాలుగో సినిమా. తొలి చిత్రం ‘కందిరీగ’ విజయంతోనే ఇప్పటికీ అందరికీ గుర్తుండే ఆయన... ఆ సక్సెస్‌ ఫార్ములాను ఇవాళ్టికీ వదులుకోలేకపోవడం అర్థం చేసుకోదగినదే. అందుకే, ఆ ఫార్ములానే వీలైనంత తిరగేసి, మరగేసి, బోర్లేసి... ‘అల్లుడు అదుర్స్‌’గా మరోసారి వండి వడ్డించారు. దానికి లారెన్స్‌ ‘కాంచన’ సినిమాతో పాపులరైన హార్రర్‌ కామెడీని కలిపారు. కానీ, ఎంత సక్సెస్‌ఫుల్‌ సూత్రమైనా, పదే పదే వాడితే చీకాకే. అది ఈ సినిమాకున్న పెద్ద ఇబ్బంది. దానికి తోడు ప్రేమకథను సాఫీగా కాకుండా, పలు పాత్రలు, సంఘటనల మధ్య అటూ ఇటూ తిప్పి, తిప్పి చెప్పే కథనం సహనానికి పరీక్ష పెడుతుంది. సెకండాఫ్‌లో వచ్చే హార్రర్‌ కామెడీ, ప్రకాశ్‌ రాజ్‌ – సత్యల ఊహా ప్రపంచం సీన్లు మాత్రం హాలులో అడపాదడపా బాగానే నవ్వులు పూయిస్తాయి.

నిర్మాణ విలువలు బాగున్న ఈ సినిమాలో ఛోటా కె. నాయుడు కెమెరా వర్క్, దేవిశ్రీ ప్రసాద్‌ నేపథ్య సంగీతం ప్రత్యేకించి స్పష్టంగా తెలుస్తాయి. సినిమాకు కొంత బలంగా నిలుస్తాయి. తెర నిండా సుపరిచితులైన నటీనటులు కనిపిస్తారు. వినోదం కోసం సత్య, శ్రీనివాసరెడ్డి, సప్తగిరి, చమ్మక్‌ చంద్ర – ఇలా చాలామందే వస్తూ పోతూ ఉంటారు. ఇటీవల కరోనా కాలంలో మరణించిన నటులు జయప్రకాశ్‌ రెడ్డి, కమెడియన్‌ వేణుగోపాల్‌ కోసూరి లాంటి వాళ్ళూ తెరపై తమ చివరి సినిమాల్లో ఒకటిగా ఇందులో ఎదురవుతారు. ‘బిగ్‌ బాస్‌4’ ఫేమ్‌ మోనాల్‌ గజ్జర్‌ చేసిన ఐటమ్‌ సాంగ్‌ ‘రంభ ఊర్వశి మేనక అందరు కలిసి నేనిక...’ లాంటివి మాస్‌ను ఆకర్షిస్తాయి. కాశ్మీర్‌లోని పహల్‌ గావ్‌ ప్రాంతాల్లో ఇటీవలే ఈ జనవరి చలిలో తీసిన హీరో, హీరోయిన్ల డ్యుయట్‌... మంచు కురిసే దృశ్యాలు విజువల్‌గా బాగున్నాయి. ఏ విదేశాల్లోనో తీసిన ఫీలింగ్‌ కలిగిస్తాయి. అయితే, అన్నీ ఉన్నా... అల్లుడి... అదేదో అన్నట్టు స్క్రిప్టులోని బలహీనతలు ఈ సినిమాకు శాపం. కామెడీ చేస్తున్నాం అనుకొని దర్శక, రచయితలు కథన విధానంలో లేనిపోని కన్‌ఫ్యూజన్లు పెట్టుకున్నారు. ఎంత సక్సెస్‌ఫుల్‌ ఫార్ములా వాడుకున్నా, దాన్ని ఆకట్టుకొనేలా చెప్పడానికి ప్రయత్నించకపోవడంలో పొరపాటు జరిగిందనిపిస్తుంది. ఇది ‘కందిరీగ’కు మరో రీమేక్‌ అనే కామెంట్‌నూ భరించాల్సి వస్తుంది. వెరసి, రెండున్నర గంటల సాగదీతను భరించాలంటే... జనం బెదుర్స్‌ అనాలనిపిస్తుంది.

కొసమెరుపు:  ‘కందిరీగ’ ఫార్ములా  +
‘కాంచన’ హార్రర్‌ కామెడీ = ‘అల్లుడు అదుర్స్‌’
బలాలు: ∙హీరో చేసిన డ్యాన్సులు, ఫైట్లు
∙తెర నిండా నటీనటులు, నిర్మాణ విలువలు
∙నేపథ్య సంగీతం, కెమెరా వర్కు
బలహీనతలు: ∙చాలా ప్రిడిక్టబుల్‌
ఫార్ములా ∙పాత సినిమాలే చూస్తున్న ఫీలింగిచ్చే స్క్రిప్టు ∙సహనాన్ని పరీక్షించే సా....గ దీత కథనం ∙దర్శకత్వ లోపం ∙కన్‌ఫ్యూజింగ్‌... కామెడీ 

-రివ్యూ: రెంటాల జయదేవ

మరిన్ని వార్తలు