అప్పటి వరకు నాకు ఉమెన్స్‌ డే వద్దు: రష్మీ

8 Mar, 2021 20:04 IST|Sakshi

ప్ర‌పంచ‌వ్యాప్తంగా అంత‌ర్జాతీయ మ‌హిళా దినోత్స‌వ వేడుక‌లు ఘ‌నంగా జ‌రుగుతున్నాయి. మహిళల గొప్పతనాన్ని, ఔనత్యాన్ని చాటుతూ రాజకీయ, క్రీడా, సినీ సెల‌బ్రిటీలు సోష‌ల్ మీడియాలో పోస్ట్‌లు పెడుతున్నారు. త‌మ జీవితంలోని మ‌హిళ‌ల గొప్ప‌ద‌నాన్ని వివరిస్తూ కామెంట్లు పెడుతున్నారు. అయితే కొంద‌రు మాత్రం ఒక్కరోజు మాత్ర‌మే మ‌హిళ‌ల‌ను గౌరవించడం.. పొగడటం  ఏంట‌ని ప్ర‌శ్నిస్తున్నారు. ‘‘ప్రతి రోజు ఆడవారిపై దారుణాల‌కు ఒడిగ‌డుతూ, వారిని కించ‌ప‌రుస్తూ, అవ‌మాన‌ప‌రుస్తూ కేవలం ఈ ఒక‍్క రోజును వారికి కేటాయిస్తున్నారా.. ఈ రోజును సెలబ్రేట్ చేసుకోమని చెబుతున్నారా’’ అంటూ ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. 

ఈ క్ర‌మంలో టాలీవుడ్‌ యాంక‌ర్ రష్మీ గౌత‌మ్ మహిళా దినోత్సవం గురించి సంచలన వ్యాఖ్యలు చేశారు. సమాజంలో ఆడవారిపై జరుగుతున్న అరాచకాలు.. వారు ఎదుర్కొంటున్న అవమానాలు ముగిసే రోజు రానంతవరకు తనకు ఉమెన్స్ డే అక్కర్లేదని స్పష్టం చేశారు. అంతేకాక తన ఇన్‌స్టాలో ఓ వ్యక్తి,  మహిళపై దారుణంగా దాడి చేస్తున్న వీడియోని పోస్ట్‌ చేశారు రష్మీ. 

దాంతో పాటు ‘‘సారీ గైస్‌.. సమాజంలో ఈ విషయంలో మార్పు రానంతవరకు నాకు ఉమెన్స్‌ డే శుభాకాంక్షలు వద్దు. ఒక పురుషుడు బ‌హిరంగంగా మ‌హిళ‌‌ను కించ‌ప‌రుస్తూ, ఆమెను అస‌భ్య‌ప‌ద‌జాల‌తంతో దూషిస్తూ, ఆమెపై చెప్పులు విసురుతున్నాడు. ఇదంతా అతడి త‌ల్లిదండ్రుల ముందే చేస్తున్నాడు. ఈ ఘ‌ట‌న బాధాక‌రం. ఈ రోజు కూడా అన్ని రోజుల్లా ఒక రోజు మాత్ర‌మే. స్త్రీ త‌త్వం కాదు. మాన‌వ‌త్వాన్ని సెల‌బ్రేట్ చేసుకుందాం. అంద‌రినీ స‌మానంగా చూద్దాం. మ‌న‌ముందున్న స‌మ‌స్య‌ల‌ను ప‌రిష్క‌రించుకుందాం’’ అనే క్యాప్షన్‌తో షేర్‌ చేసిన ఈ వీడియో ప్రస్తుతం తెగ వైరలవుతోంది. దీనిపై నెటిజనులు ‘‘చాలా బాగా చెప్పార్‌ మేడం.. ఆడవారిని గౌరవించకుండా.. కేవలం ఇలాంటి రోజులు జరుపుకోవడం వల్ల ఎలాంటి ఫలితం ఉండదు’’ అంటూ కామెంట్‌ చేస్తున్నారు. 

A post shared by Rashmi Gautam (@rashmigautam)

చదవండి: 
ఉమెన్స్‌ డే : రష్మి వ్యంగ్యాస్త్రాలు
టిక్‌టాక్ వీడియోపై ర‌ష్మి ఆగ్ర‌హం

మరిన్ని వార్తలు