ఇలాంటివి తక్షణమే మానేయండి: అనుష్క శర్మ

7 Jan, 2021 11:36 IST|Sakshi

సెలబ్రిటీలు కాలు బయటపెడితే చాలు.. ఆటోగ్రాఫులు, ఫొటోగ్రాఫులు అంటూ జనాలు మీదపడిపోతుంటారు. మీడియా అయితే ఊపిరి సలపనివ్వని ప్రశ్నలతో ఉక్కిరి బిక్కిరి చేస్తుంది. ఫొటోగ్రాఫర్లు రెప్పపాటులోనే పది ఫొటోలను క్లిక్‌ క్లిక్‌మనిపిస్తారు. వారి కాలి గోటి నుంచి జుట్టుకు వేసుకున్న రంగు వరకు ఆపాదమస్తకమంతా కెమెరాల్లో నిక్షిప్తం చేస్తారు. వాళ్లేం చేసినా కెమెరాల్లో రికార్డు చేస్తుంటారు. ఇది కొన్నిసార్లు సెలబ్రిటీలకు ఇబ్బందిగా ఉంటుంది. టీమిండియా కెప్టెన్‌ విరాట్‌ కోహ్లీ సతీమణి, హీరోయిన్‌ అనుష్క శర్మకు కూడా ఇలాంటి ఇబ్బందికర పరిస్థితే ఎదురైంది. బుధవారం నాడు ఆమె, తన భర్తతో బయటకు వెళ్లొచ్చారు. అనంతరం విరాట్‌తో బాల్కనీలో కూర్చుని సరదాగా కబుర్లు చెప్పుకుంటున్నారు. దీనికి సంబంధించిన ఫొటోను అనుష్క ఇన్‌స్టాగ్రామ్‌లో షేర్‌ చేశారు. (చదవండి: కేజీఎఫ్‌ ‘గరుడ’ ఎవరో తెలుసా..?!)

అయితే ఈ ఫొటో ఆమె తీయించుకున్నది కాదు, ఎవరో ఫొటోగ్రాఫర్‌ విరుష్కల అనుమతి లేకుండా తీసి తమ పబ్లికేషన్స్‌లో ఉపయోగించుకున్నారు. దీంతో సోషల్‌ మీడియాలో వేదికగా సదరు ఫొటోగ్రాఫర్‌, పబ్లికేషన్స్‌పై ఒంటికాలిపై లేచారు. "ఎన్నిసార్లు చెప్పినా మారరా? మీరు పదేపదే మా గోప్యతకు భంగం కలిగిస్తూనే ఉన్నారు. ఇక చాలు, ఇలాంటివి తక్షణమే ఆపేయండి" అని ఘాటుగా హెచ్చరించారు. కాగా అనుష్క మరికొద్ది రోజుల్లో పండంటి శిశువుకు జన్మనివ్వబోతున్నారు. ఆరోజు కోసం విరుష్కలు మాత్రమే కాదు, ఆ దంపతుల అభిమానులు సైతం వేయికళ్లతో ఎదురుచూస్తున్నారు. ఇక అనుష్క గర్భంతో ఉన్న సమయంలోనూ అటు షూటింగ్‌ సెట్స్‌కు వెళ్తూనే మరోవైపు జిమ్‌లో వర్కవుట్లు చేస్తూ చెమటలు చిందిస్తున్నారు. దీనితోపాటు వైద్యుల సూచనలు, భర్త సహకారంతో యోగాసనాలు కూడా చేస్తున్నారు. (చదవండి: అనుష్క శీర్షాసనం.. కోహ్లి సాయం!)

మరిన్ని వార్తలు