ఆఫ్టర్‌ ఎ గ్యాప్‌.. రీఎంట్రీకి రెడీ అయిన హీరోయిన్స్‌

12 May, 2022 08:02 IST|Sakshi

‘మేరా నామ్‌ చిన్‌ చిన్‌ చు..’ పాట సౌండ్‌ బాగుంది. మరి ఆట.. అదుర్స్‌. చేసిందెవరు? పంథొమ్మిదేళ్ల హెలెన్‌. ఆ పాట సోలో డాన్సర్‌గా ఆమెకు పెద్ద బ్రేక్‌. ఆ తర్వాత చేసిన పాటల్లో ‘పియా తూ అబ్‌ తో ఆజా’ (ప్రియుడా ఇప్పటికైనా రా అని అర్థం) ఒకటి. అలాంటి పాటలెన్నింటికో కాలు కదిపారు. ఎన్నో పాత్రలు చేశారు హెలెన్‌. పదేళ్ల క్రితం నటనకు బ్రేక్‌ ఇచ్చిన హెలెన్‌ని అప్పటి తరం అభిమానులు తలుచుకుంటూనే ఉన్నారు. వెండితెరకు ‘అబ్‌ తో ఆజా’ (‘ఇప్పటికైనా రా’) అంటున్నారు. హెలెన్‌ వచ్చేస్తున్నారు. ఇక హెలెన్‌ తర్వాతి తరాలకు చెందిన సోనాలీ బెంద్రే రాక కోసం కూడా ఫ్యాన్స్‌ ఎదురు చూస్తున్నారు. ‘అబ్‌ తో ఆజా’ అంటున్నారు. ఆమె కూడా వచ్చేస్తున్నారు. వీరితో పాటు హిందీలో రీ ఎంట్రీకి రెడీ అయిన తారలు కూడా ఉన్నారు. వారి గురించి తెలుసుకుందాం. 

‘మేరానామ్‌ చిన్‌ చిన్‌ చు’ సాంగ్‌లో డ్యాన్స్‌తో రెచ్చిపోయిన హెలెన్‌కి నాటి తరంలో ఎందరో అభిమానులు ఉన్నారు. 1958లో వచ్చిన ‘హౌరా బ్రిడ్జ్‌’ చిత్రంలో ‘మేరా నామ్‌ చిన్‌ చిన్‌ చు..’ అంటూ ఎంత ఎనర్జిటిక్‌గా డ్యాన్స్‌ చేశారో అంతే ఎనర్జీని 1971లో వచ్చిన ‘కారవాన్‌’లోని ‘పియా తు అబ్‌ తో ఆజా’, 1975లో వచ్చిన ‘షోలే’లోని ‘మెహబూబా మెహబూబా..’ పాటల్లోనూ చూపించారు హెలెన్‌. 70ఏళ్ల కెరీర్‌లో దాదాపు 700 చిత్రాల్లో నటించిన హెలెన్‌ దశాబ్దకాలంగా వెండితెరకు దూరమయ్యారు. ఇప్పడు ఆమె కెమెరా ముందుకు రానున్నారు. మధూర్‌ భండార్కర్‌ దర్శకత్వంలో 2012లో వచ్చిన ‘హీరోయిన్‌’ చిత్రం తర్వాత మరోమారు వెండితెరపై హెలెన్‌ కనిపించలేదు. తాజాగా ‘బ్రౌన్‌: ది ఫస్ట్‌ కేస్‌’లో హెలెన్‌ ఓ కీ రోల్‌ చేస్తున్నారు.

అభినవ్‌ దేవ్‌ దర్శకత్వం వహిస్తున్న ఈ క్రైమ్‌ ఫిల్మ్‌లో కరిష్మా కపూర్, సూర్య శర్మ లీడ్‌ రోల్స్‌ చేస్తున్నారు. కోల్‌కతా నేపథ్యంలో ఈ చిత్రం ఉంటుంది. అభీక్‌ బారువా రాసిన ‘సిటీ ఆఫ్‌ డెత్‌’ బుక్‌ ఆధారంగా ఈ సినిమాను తెరకెక్కిస్తున్నారు. ‘‘నేను యాక్ట్‌ చేసినప్పటి సమయంతో పోలిస్తే ఇప్పుడు చాలా విషయాల్లో మార్పులు కనిపిస్తున్నాయి. కాస్త భయంగా, ఆందోళనగా అనిపిస్తున్నా ఓ చాలెంజ్‌గా తీసుకుని నటిస్తున్నాను’’ అని హెలెన్‌ పేర్కొనడం విశేషం.. మరోవైపు ‘మురారి’, ‘ఖడ్గం’, ‘ఇంద్ర’, ‘మన్మథుడు’, ‘శంకర్‌దాదా ఎమ్‌బీబీఎస్‌’ వంటి తెలుగు చిత్రాల్లో నటించిన సోనాలీ బెంద్రేను అంత ఈజీగా మర్చిపోలేం. 2013లో హిందీలో వచ్చిన ‘వన్స్‌ అపాన్‌ ఏ టైమ్‌ ఇన్‌ ముంబై దొబార’ చిత్రంలో గెస్ట్‌గా కనిపించిన తర్వాత సోనాలీ నటిగా మేకప్‌ వేసుకోలేదు. ఆ మధ్య క్యాన్సర్‌ మహమ్మారితో పోరాడారామె.

క్యాన్సర్‌పై గెలిచి మళ్లీ యాక్టర్‌గా ప్రేక్షకుల ముందుకు వచ్చేందుకు రెడీ అయ్యారు. ‘ది బ్రోకెన్‌ న్యూస్‌’ అనే వెబ్‌ సిరీస్‌లో ఓ యాంకర్‌గా నటించారామె. ఇందులో జైదీప్‌ అహ్లావత్, శ్రియా పిల్గొన్కర్‌ ఇతర లీడ్‌ రోల్స్‌ చేశారు. సోనాలీకి ఓటీటీలో ఇదే తొలి ప్రాజెక్ట్‌. జీ5 ఓటీటీ ప్లాట్‌ఫామ్‌లో ఈ వెబ్‌ సిరీస్‌ త్వరలో స్ట్రీమింగ్‌ కానుంది. ‘‘తిరిగి సెట్స్‌లోకి వచ్చి కో స్టార్స్, దర్శకులు, స్టోరీ డిస్కషన్స్‌తో బిజీ అవుతున్నందుకు హ్యాపీ’’ అని పేర్కొన్నారు సోనాలీ బెంద్రే. మరోవైపు 2018లో వచ్చిన ‘జీరో’ తర్వాత ఇటీవలే నటిగా మేకప్‌ వేసుకున్నారు అనుష్కా శర్మ. మహిళా క్రికెటర్‌ జులాన్‌ గోస్వామి బయోపిక్‌లో నటిస్తున్నారామె. ఈ చిత్రానికి  ప్రోజిత్‌ రాయ్‌ దర్శకుడు. ఇలా బ్రేక్‌లో ఉన్న తారలు మళ్లీ నటించడం అభిమానులు ఆనందపడే విషయం. ఇంకా గ్యాప్‌ తీసుకున్న మరికొంతమంది తారలు మేకప్‌ వేసుకోవడానికి రెడీ అవుతున్నారు.     

మరిన్ని వార్తలు