Bart The Bear 2 Is Dead: ఆ స్టార్‌ 'ఎలుగుబంటి' ఇకలేదు..

26 Nov, 2021 15:59 IST|Sakshi

Bart The Bear 2 Is Dead In Utah: సినిమాల్లో అప్పుడప్పుడు అలరించే జంతువులపై చిన‍్న పిల్లలకు, పెద‍్దవారికి ఒకరకమైన ఇష్టం ఏర్పడుతుంది. తెలుగు చిత్రం 'సిసింద్రీ'లో కనపడే జంతువులు ప్రేక్షకులకు ఎంత నచ్చాయో అందరికీ తెలిసిందే. కీలక పాత్రల్లో నటించే ఈ యానిమల్స్‌ అంటే పిల్లలకు మహాసరదా. హాలీవుడ్‌లో అయితే ఏకంగా వాటినే హీరోలుగా పెట్టి సినిమాలు తీసిన సందర్భాలు ఉన్నాయి. అలాంటి సినిమాల్లో కీలక పాత్రలు పోషించింది ఆ ఎలుగుబంటి. తనదైన యాక్టింగ్‌తో ఎంతగానో ఆకట్టుకుంది. అనేకమంది ఫ్యాన్స్‌ను సంపాదించుకుంది. ఇప్పుడు ఆ ఎలుగు ఇకలేదు. అనారోగ్య సమస్యలతో 'బార్ట్‌ ది బేర్‌ 2' మరణించింది. 

2000 సంవత్సరంలో అలాస్కాలోని అడవుల్లో ఈ ఎలుగు చిన్న వయసులోనే అధికారులకు దొరికింది. వేటగాడికి బలైన తన తల్లిపక్కన ఉన్న ఈ చిన్న ఎలుగును తీసుకొచ్చి సంరంక్షించారు. దీంతోపాటు 'బార్ట్‌ ది బేర్‌ 2' సిస్టర్‌ ఎలుగు 'హనీ బంప్‌' కూడా ఉంది. 'బార్ట్‌ ది బేర్‌ 2' పెరిగాక అనేక సినిమా ఆఫర్లు వచ్చాయి. చిత్రాల్లోనే కాకుండా అనేక టీవీ షోలు, ప్రకటనల్లో తళుక్కుమంది. ప్రపంచవ్యాప్తంగా ప్రేక్షాధరణ పొందిన హాలీవుడ్‌ మెగా వెబ్‌ సిరీస్‌ 'గేమ్‌ ఆఫ్‌ థ్రోన్స్‌ (జీవోటీ)'తో ఎంతోమంది అభిమానులను కూడగట్టుకుంది. అంతకుముందు కూడా చాలా సినిమాల్లో నటించిందీ ఎలుగు. యాన్‌ అన్‌ఫినిష్‌డ్‌ లైన్‌, విత్‌ఔవుట్‌ ఏ ప‍్యాడిల్‌, డాక్టర్‌ డూ లిటిల్‌ 2, ఇంటూ ది గ్రిజ‍్లీ మేజ్‌,  హార్స్ క్రేజీ టూ, ఇంటూ ది వెస్ట్‌, ఇంటూ ది వైల్డ్‌, ఈవాన్ ఆల్మైటీ, జూకీపర్‌, హేవ్‌ యూ హియర్డ్‌ అబౌట్‌ మోర్గాన్స్‌, పీట్స్ డ్రాగన్‌, వీ బాట్‌ ఏ జూ వంటి చిత్రాల్లో మెరిసింది. 

'బార్ట్‌ ది బేర్‌ 2' మరణంపై జీవోటీలో దానితో యాక్షన్ సీన్ చేసిన గ్వైండాలీన్‌ క్రిస్టీ విచారం వ్యక్తం చేసింది. ఎలుగు ఆత్మకు శాంతి కలగాలని కోరింది. తన సినీ కెరీర్‌లో అత్యుత్తమ కో-స్టార్‌ అని తెలిపింది. షూటింగ్‌లో ఎలుగుని శాంతింపజేయడానికి అది నటించిన సినిమా ట్రైలర్లు, పాశ్చాత్య సంగీతాన్ని సెట్స్‌లో ప్లే చేస‍్తుండేవారని గుర్తు చేసుకుంది. దాంతో నటించిన ప్రతీ క్షణాన‍్ని ఆస్వాదించానని, జీవోటీలో బార్ట్‌తో ఫైట్‌ చేసిన ఫొటోను షేర్‌ చేసింది. 'బార్ట్‌ ది బేర్‌ 2' ఒక గొప్ప ఎలుగని, దాంతో ఇన్నాళ్లు కలిసి ఉన్నందుకు చాలా గౌరవంగా భావిస్తున్నామని 'ది వైటల్‌ గ్రౌండ్‌ ఫౌండేషన్' తెలిపింది. ఎలుగు సంరక్షణ బాధ్యతలు చేపట్టిన ఈ సంస‍్థ యూటాలోని డేనియల్‌ క్రీక్‌ ఒడ్డున ప్రశాంతంగా బార్ట్‌ కన్నుమూసిందని వెల‍్లడించారు. 

మరిన్ని వార్తలు