Bhuj: 300 మంది వీర నారీమణుల సాహసం

14 Aug, 2021 08:26 IST|Sakshi

డిసెంబర్‌ 8, 1971 ఇండియా-పాక్‌ యుద్ధకాలం..బాంబుల భయంతో వణుకుతున్న ఊరు. బాంబులు కురిసినా సరే దేశం కోసం చనిపోయినా పరవాలేదనే సాహసోపేత నిర్ణయం. ‘మేమున్నాం’ అంటూ ఒక్కరు కాదు ఇద్దరు కాదు ఏకంగా 300 మంది వీర నారీమణుల తెగువ. 72 గంటల వ్యవధిలో ఎయిర్‌ఫోర్స్‌ బేస్‌ పునరుద్ధరణ. ప్రాణాలకు తెగించి మరీ దేశభక్తిని చాటుకున్న వైనం! అంతేనా.. ప్రభుత్వ అవార్డు సొమ్మును దానం చేసిన దాతృత్వం.. జయహో.. వీరమహిళలు!!

చలి పులిలా విజృంభిస్తుంది. కాని ఆ ఊరు చలితో కాదు ‘బాంబుల భయం’తో వణికిపోతుంది. అందరూ ఆకాశం వైపు భయం భయంగా చూస్తున్నారు. పాకిస్థాన్‌ జెట్స్‌ భుజ్‌ (కచ్‌ జిల్లా, గుజరాత్‌)లోని ఇండియన్‌ ఎయిర్‌ఫోర్స్‌ బేస్‌పై బాంబులు వేశాయి. ఈ నేపథ్యంలో ఎయిర్‌బేస్‌ను పునరుద్ధరించడానికి భారత వైమానిక దళం బీఎస్‌ఎఫ్‌ జవాన్ల సహాయం కోరింది. పునరుద్ధరణ తక్కువ సమయంలో జరగాలంటే ఎక్కువమంది శ్రామికులు కావాలి. వారిని వెదికిపట్టి తీసుకురావడానికి సమయం లేదు. దగ్గరి గ్రామాల్లోని వారి సహాయం  కోరాలి.ప్రాణాలు అరచేతిలో పెట్టుకొని ఎవరి ఇంట్లో వాళ్లు ఉన్న ఆ సమయంలో ఎవరు బయటకు వస్తారు? వచ్చినా సహాయపడతారా?రకరకాల సందేహాలను పటాపంచలుచేస్తూ... ఒక్కరు కాదు ఇద్దరు కాదు మాదపూర్‌ గ్రామానికి చెందిన 300 మంది స్త్రీలు ‘మేమున్నాం’ అంటూ ముందుకువచ్చారు. పునరుద్ధరణ పనుల్లో చురుగ్గా పాలుపంచుకున్నారు.

డిసెంబర్‌ 8, 1971 ఇండియా-పాక్‌ యుద్ధకాలం నాటి దృశ్యం ఇది. ఆనాటి భుజ్‌ ఎయిర్‌ బేస్‌ను పునర్నిర్మించిన 300 మంది మహిళలను సగౌరవంగా గుర్తు తెచ్చుకుంటుంది ‘భుజ్‌: ది ప్రైడ్‌ ఆఫ్‌ ఇండియా’ చిత్రం. (అజయ్‌ దేవ్‌గణ్, సంజయ్‌దత్, సోనాక్షిసిన్హా ప్రధాన పాత్రలు పోషించిన ఈ సినిమా వోటీటీలో విడుదలైంది) ఈ నేపథ్యంలో ఆనాటి జ్ఞాపకాలు ఆసక్తికరంగా మారాయి.

‘చనిపోయినా సరే, దేశం కోసం చనిపోయాను అనే తృప్తి మిగులుతుంది...అని ఒకరికొకరం ధైర్యం చెప్పుకొని పనిలోకి దిగాము’ అని ఆనాటి జ్ఞాపకాలను గుర్తు చేసుకుంటుంది సెఘాని అనే మహిళా యోధురాలు.  ఆ 300 మంది మహిళలలో ఒకరైన హిరూ బుదియాలో మొదట ఒక సందేహం...‘వెళుతున్నాను సరే, కూలిపని తప్ప నాకు ఏది తెలియదు. నేను చేయగలనా?’ఆ తరువాత భయం... ‘పనిలో ఉండగా పై నుంచి బాంబులు పడితే... ఇంకేమైనా ఉందా!’తనలోని ధైర్యానికి, సందేహాలతో కూడిన భయానికి మధ్య ఆ సమయంలో పెద్ద యుద్ధమే జరిగింది. కాని చివరికి ధైర్యమే గెలిచింది. దేశభక్తి గొప్పతనం అదే కదా! (చదవండి Mirabai Chanu: ట్రెడిషనల్‌ ఔట్‌ఫిట్‌, ట్వీట్‌ వైరల్‌)

‘చిన్నచిన్న విషయాలకే భయపడే నాకు అంతధైర్యం ఎలా వచ్చిందో తెలియదు. ఏదో శక్తి ఆవహించినట్లు అనిపించింది’ అని ఆరోజును గుర్తు తెచ్చుకుంటుంది వీరు లఖాని. 72 గంటల వ్యవధిలో ఎయిర్‌ఫోర్స్‌ బేస్‌ను పునరుద్ధరించే పని పూర్తయింది.యుద్ధం పూర్తయిన తరువాత గ్రూప్‌ అవార్డ్‌గారూ. 50,000  ఇచ్చింది కేంద్ర ప్రభుత్వం. అయితే ఈ మొత్తాన్ని గ్రామ పంచాయతీ కమ్యూనిటీ  హాల్‌ కోసం ఇచ్చి తమ దాతృత్వాన్ని చాటుకున్నారు వీరమహిళలు.

మరిన్ని వార్తలు