Bigg Boss 5 Telugu: బిగ్‌బాస్‌ బోర్‌ కొడుతోందంటున్న ప్రేక్షకులు

25 Sep, 2021 19:44 IST|Sakshi

'టన్నుల కొద్దీ ఎంటర్‌టైన్‌మెంట్‌ గ్యారెంటీ' అంటూ టాలీవుడ్‌ కింగ్‌ నాగార్జున సెప్టెంబర్‌ 5న బిగ్‌బాస్‌ తెలుగు ఐదో సీజన్‌ను గ్రాండ్‌గా లాంచ్‌ చేశాడు. 19 మంది కంటెస్టెంట్లతో ప్రారంభమైన ఈ షోలో ప్రేక్షకులకు  తెలియని కొత్త ముఖాలు చాలానే ఉన్నాయి. అయితే రోజులు గడిచే కొద్దీ వారు ప్రేక్షకులకు దగ్గరవుతున్నారు. ఈ క్రమంలో ఆడియన్స్‌ కూడా తమకు నచ్చిన కంటెస్టెంట్లకు ఓట్లు గుద్దుతూ వారిని ఎలిమినేషన్‌ నుంచి రక్షిస్తున్నారు.

ఏమైందో ఏమో కానీ ఈ సీజన్‌కు అనుకున్నంత టీఆర్పీ రావడం లేదట! నాగార్జున టీవీపై కనిపించే వీకెండ్‌ ఎపిసోడ్‌కు మాత్రం అంతో ఇంతో రేటింగ్‌ వస్తుందట! నిజానికి ప్రత్యేకంగా నాగార్జున కోసమే ఈ షోను చూసేవాళ్లు చాలామందే ఉన్నారు. వాళ్లు అన్ని ఎపిసోడ్లు కాకుండా కేవలం వారాంతం ఎపిసోడ్లే చూస్తున్నారు. కారణం షో టైమింగ్స్‌!  రాత్రి 10 నుంచి 11 గంటలకు బిగ్‌బాస్‌ చూడటం చాలామందికి వీలు పడకపోవడంతో బిగ్‌బాస్‌ షోను ఆదరించడం లేదు. ఇది టీఆర్పీ రేటింగ్‌ను దెబ్బతీస్తోంది. అంతేకాకుండా బిగ్‌బాస్‌ షోలో పెద్దగా ఆకట్టుకునే కంటెంట్‌ కూడా లేదని పెదవి విరుస్తున్నారు పలువురు నెటిజన్లు.

కాంట్రవర్సీలకు కేరాఫ్‌గా ఉండే కంటెస్టెంట్లను ఎలిమినేట్‌ చేసి షోను చప్పగా మార్చారని బాహాటంగానే విమర్శిస్తున్నారు. ముఖ్యంగా ఈ వారమైతే మరీ బోరింగ్‌గా సాగిందంటున్నారు. కొత్తగా ఎవరినైనా వైల్డ్‌కార్డ్‌ ద్వారా హౌస్‌లోకి దింపితే ఆట ఏమైనా రంజుగా మారే అవకాశం ఉందంటున్నారు. లేదంటే బిగ్‌బాస్‌ 5 ఫ్లాప్‌ సీజన్‌గా అప్రతిష్ట మూటగట్టుకునే చాన్స్‌ ఉందని హెచ్చరిస్తున్నారు. వైల్డ్‌ కార్డ్‌ కుదరకపోతే కనీసం కంటెస్టెంట్ల మధ్య గట్టి పోటీనిచ్చే టాస్కులైనా పెట్టమని రిక్వెస్ట్‌ చేస్తున్నారు. మరీ బోరింగ్‌గా మారుతున్న బిగ్‌బాస్‌ షోకు నిర్వాహకులు ఏమైనా బూస్ట్‌ ఇస్తారా? లేదా రానున్న రోజుల్లో వైల్డ్‌ కార్డ్‌ ఎంట్రీ ఉండబోతుందా? అన్నది వేచి చూడాల్సిందే!

మరిన్ని వార్తలు