హైదరాబాద్‌లో కుండపోత వర్షం.. ట్రాఫిక్‌కు తీవ్ర అంతరాయం

25 Sep, 2021 19:51 IST|Sakshi

సాక్షి,హైదరాబాద్‌: గరంలో భారీ వర్షం కురుస్తోంది. మాదాపూర్‌, గచ్చిబౌలి, రాయదుర్గం, అంబర్‌పేట్‌, కాచిగూడ, గోల్నాక, ఖైరతాబాద్‌, హిమాయత్‌నగర్‌, పంజాగుట్ట, అమీర్‌పేట, మైత్రివనం, ఆర్టీసీ క్రాస్‌రోడ్‌, లక్డీకాపూల్‌, కోఠి, అబిడ్స్‌, దిల్‌సుఖ్‌నగర్‌, సరూర్‌నగర్‌, సైదాబాద్‌, కూకట్‌పల్లి, ఆల్విన్‌ కాలనీ, హైదర్‌నగర్‌, ప్రగతినగర్‌, నిజాంపేట, శేరిలింగంపల్లి, మియాపూర్, చందానగర్, పాతబస్తీ, చంద్రాయణగుట్ట, ఉప్పుగూడ, బార్కస్, బహదూర్‌పూర, ఫలక్‌నామాలో భారీ వర్షం కురిసింది. పలుచోట్ల రోడ్లపై వరద నీరు చేరడంతో ట్రాఫిక్‌కు తీవ్ర అంతరాయం ఏర్పడింది.  మాదాపూర్‌, కూకట్‌పల్లి ఫ్లైఓవర్‌పై ట్రాఫిక్‌ నిలిచిపోయింది. ఫిలీంనగర్‌లో బస్తీ నీటమునిగింది.

నగర వాసులు ఇంట్లోనే ఉండాలని వాతావరణ శాఖ హెచ్చరించింది. అత్యవసరమైతేనే బయటికి రావాలని సూచించింది. ఈ మేరకు డీఆర్‌ఎఫ్‌ను అప్రమత్తం చేసిన  జీహెచ్‌ఎంసీ.. అవసరమైతే కంట్రోల్‌ రూం నెంబర్‌ 040-29555500ను సంప్రదించాలని తెలిపింది. జూబ్లీహిల్స్‌ చెక్‌పోస్టు నుంచి ఎన్టీఆర్‌ భవన్‌ వరకు ట్రాఫిక్‌ స్తంభించింది. వందలాది వాహనాలు ఎక్కడికక్కడే రోడ్లపైనే నిలిచిపోయాయి. ట్రాఫిక్‌ను క్రమబద్దీకరించేందుకు పోలీసులు తీవ్రంగా శ్రమిస్తున్నారు. భారీ వర్షం నేపథ్యంలో జీహెచ్‌ఎంసీ అధికారులను మేయర్‌ విజయలక్ష్మి అప్రమత్తం చేశారు. సహాయక చర్యల కోసం అత్యవసర బృందాలను రంగంలోకి దించారు. తుఫాన్‌ గులాబ్‌ ప్రభావంతో తెలుగు రాష్ట్రా‍ల్లో మరో మూడు రోజులు భారీ వర్షాలు కురిసే అవకాశం ఉంది.


 

మరిన్ని వార్తలు