Bigg Boss 6 Telugu: శ్రీసత్య కంట్లో కన్నీరు చూసి ఏడ్చేసిన అర్జున్‌

23 Oct, 2022 23:05 IST|Sakshi

Bigg Boss 6 Telugu, Epsiode 50: బిగ్‌బాస్‌ షోలో ఒకరోజు ముందుగానే దీపావళి వేడుకలు జరిగాయి. హీరోయిన్ల డ్యాన్సులు, శ్రీరామచంద్ర పాటలు, హైపర్‌ ఆది పంచులు.. సెలబ్రిటీ గెస్టులు అంజలి, కార్తీల రాకతో నేటి ఎపిసోడ్‌ సందడిగా మారింది. మరి ఆ ఎంటర్‌టైన్‌మెంట్‌ అండ్‌ ఎలిమినేషన్‌ గురించి పూర్తిగా తెలియాలంటే నేటి ఎపిసోడ్‌ హైలైట్స్‌ చదివేయాల్సిందే!

తర్వాత కంటెస్టెంట్లను ఏడు జంటలుగా విడగొట్టాడు నాగ్‌. ఫైమా-రేవంత్‌, ఇనయ- శ్రీహాన్‌, శ్రీసత్య- సూర్య, మెరీనా- రోహిత్‌, కీర్తి-రాజ్‌, వాసంతి- అర్జున్‌, గీతూ-ఆదిరెడ్డిలు జోడీగా ఆటలాడారు. ఈ తరుణంలో ఓటీటీ సిరీస్‌ ఝాన్సీ ప్రమోషన్స్‌లో భాగంగా అంజలి బిగ్‌బాస్‌ షోకి వచ్చి సందడి చేసింది. ఆమెను చూడగానే రేవంత్‌ అంజలి పాట పాడి హీరోయిన్‌ను ఫిదా చేశాడు. ఆమె సమక్షంలో జంటలతో డ్యాన్స్‌ చేయించాడు నాగ్‌. అది కూడా ఇచ్చిన వస్తువును ఎక్కువగా వాడుతూ స్టెప్పులేయాలన్నాడు. ఇందులో తక్కువ మార్కులు పడ్డ ఇనయ- శ్రీహాన్‌ గేమ్‌ నుంచి ఔట్‌ అయ్యారు.

రెండో లెవల్‌లో అమ్మాయిలు తమ జోడీ అయిన అబ్బాయిలను లేడీస్‌గా మార్చేశారు. మీసం, గడ్డాలతో చీర కట్టులో కనిపించిన మేల్‌ కంటెస్టెంట్లను చూసి తట్టుకోలేకపోయాడు నాగ్‌. అయినా సరే తప్పక వారితో క్యాట్‌వాక్‌ చేయించాడు. ఈ రౌండ్‌లో వాసంతి- అర్జున్‌ కల్యాణ్‌కు ఎక్కువ మార్కులు పడ్డాయి. తర్వాత ​కీర్తి, శ్రీసత్య సేఫ్‌ అయినట్లు ప్రకటించాడు. అనంతరం సైంటిస్ట్‌ను పిలుస్తున్నానంటూ హైపర్‌ ఆదిని స్టేజీ మీదకు ఆహ్వానించాడు నాగ్‌. వచ్చీ రావడంతోనే కంటెస్టెంట్ల మీద పంచుల వర్షం కురిపించాడు.

ముందుగా గీతూ గురించి మాట్లాడుతూ.. అవతలి వాళ్ల మీద కాలూపడమే కాదు తల కూడా ఊపాలి(వాళ్లు చెప్పేది వినాలి) అని వ్యంగ్యంగా వ్యాఖ్యానించాడు. అలా ఒక్కొక్కరి గురించి సవివరంగా చెప్తూనే సెటైర్లు వేశాడు. ఫైనల్‌గా.. ఈ సీజన్‌లో కంటెస్టెంట్లు టాస్కులు ఎలా ఆడదామనేదానికంటే కూడా ఎప్పుడెప్పుడు అయిపోతాయా? అని ఎదురు చూస్తున్నారని, నామినేషన్స్‌ సిల్లీగా ఉంటున్నాయని వారి పరువు తీశాడు ఆది. అందరి బండారాలు బయటపెట్టిన తర్వాత బిగ్‌బాస్‌ షో నుంచి వీడ్కోలు తీసుకున్నాడు.

హీరోయిన్‌ అవికాగోర్‌ స్టెప్పులేయడం ముగియగానే సర్దార్‌ టీమ్‌ ఎంట్రీ ఇచ్చింది. హీరో కార్తీ, దర్శకుడు మిత్రన్‌, హీరోయిన్‌ రజీషా స్టేజీపై సందడి చేశారు. సర్దార్‌ మూవీ చూశాక చాలామంది ప్లాస్టిక్‌ బాటిల్స్‌లో నీళ్లు తాగేందుకు భయపడుతున్నారన్నాడు. ఈ సందర్భంగా నాగ్‌.. ఇక నుంచి నేను కూడా ప్లాస్టిక్‌ బాటిళ్లలో నీళ్లు తాగను అని శపథం చేశాడు.

తర్వాత కార్తీ.. ప్రేమ లేదని, ప్రేమించరాదని అని తెలుగులో అద్భుతంగా పాడాడు. హౌస్‌మేట్స్‌ కోసం స్వీట్లు కూడా తీసుకొచ్చానని చెప్పాడు. రోహిత్‌, బాలాదిత్యను సేఫ్‌ చేసి అక్కడినుంచి వెళ్లిపోయాడు. మూడో లెవల్‌కు వచ్చేసరికి మూడు జంటలే మిగిలాయి. కళ్లకు గంతలు కట్టుకుని తమ జోడీకి స్వీట్లు తినిపించాలనే టాస్కులో మెరీనా- రోహిత్‌, ఫైమా- రేవంత్‌, శ్రీసత్య- సూర్య పాల్గొన్నారు. సత్య ఎక్కువ స్వీట్లు తినడంతో ఆమె జంట విజయం సాధించగా వారికి దీపావళి కానుక అందింది.

చివరగా వాసంతి, అర్జున్‌ నామినేషన్‌లో ఉండగా వీరిలో అర్జున్‌ ఎలిమినేట్‌ అయినట్లు ప్రకటించాడు నాగ్‌. దీంతో ఒక్కసారిగా సత్య, శ్రీహాన్‌, రేవంత్‌ షాక్‌లోకి వెళ్లిపోయారు. రేవంత్‌, సత్య కన్నీళ్లు ఆపుకోలేక ఏడ్చేశారు. సత్య ఏడవటం చూసి తట్టుకోలేకపోయిన అర్జున్‌ తనూ కంటతడి పెట్టుకున్నాడు. అనంతరం అర్జున్‌తో ఐదు ఆటంబాంబులు, ఐదు తుస్సుబాంబులు ఎవరో చెప్పమని గేమ్‌ ఆడించాడు నాగ్‌. శ్రీహాన్‌, శ్రీసత్య, రేవంత్‌, గీతూ, ఫైమా ఆటంబాంబులు అన్నాడు. కాకపోతే రేవంత్‌.. ఆటంబాంబు కంటే ఎక్కువ పేలుతున్నాడు, ఫిజికల్‌ అవ్వకు, ఏది పడితే అది మాట్లాడి గేమ్‌ పాడు చేసుకోకు అని అతడికి సలహా ఇచ్చాడు.

రోహిత్‌, మెరీనా, కీర్తి, ఇనయ, బాలాదిత్య తుస్సుబాంబులు అని చెప్పాడు. చివరగా అర్జున్‌ తాను బిగ్‌బాస్‌లోకి రావడానికి ప్రధాన కారణం సత్య అన్న విషయాన్ని బయటపెట్టాడు అర్జున్‌. శ్రీసత్యను ఒక సినిమాకు రిఫర్‌ చేస్తే ఆమె డేట్స్‌ ఇవ్వలేనని చెప్పింది. ఎందుకని అడిగితే బిగ్‌బాస్‌కు వెళ్తున్నానంది. వెంటనే నేను బిగ్‌బాస్‌కు అప్లై చేశాను, వచ్చింది. ఆఫర్‌ రాగానే ఇంట్లోవాళ్లకు చెప్పకుండా మొదట సత్యకే ఫోన్‌ చేసి చెప్పాను అని చెప్పుకొచ్చాడు అర్జున్‌. ఈ విషయం ఇప్పటిదాకా తనకూ తెలియదంది శ్రీసత్య.

చదవండి: కొత్త కారు కొన్న హిమజ, వీడియో చూశారా?
ఉదయ్‌కిరణ్‌తో ఐదు సినిమాలు చేసేదాన్ని, కానీ అంతలోనే

Poll
Loading...
మరిన్ని వార్తలు