యూకే స్ట్రెయిన్‌‌: సల్మాన్‌ సోదరులపై కేసు

5 Jan, 2021 11:47 IST|Sakshi

ముంబై: కరోనా వైరస్‌ను అరికట్టెందుకు మన ప్రభుత్వాలు కఠిన నిబంధనలు విధిస్తున్నప్పటికి కొందరు మాత్రం వాటిని లెక్కచేయకుండా పెడచెవిన పెడుతున్నారు. ప్రభుత్వ నియమాలను, ఆదేశాలను లెక్కచేయని వారిలో సామాన్య ప్రజలే కాకుండా సెలబ్రిటీలు కూడా ఉండటం గమనార్హం. తాజాగా వారిలో బాలీవుడ్‌ కండల వీరుడు సల్మాన్‌ ఖాన్‌ సోదరులు అర్భాజ్‌ ఖాన్‌, సోహైల్‌ ఖాన్‌లు కూడా చేరారు. కోవిడ్‌ నిబంధనలను ఉల్లఘించారంటూ వారిపై ఓ వైద్యాధికారి ముంబై మున్సిపల్‌ కార్పోరేషన్‌(బీఎం‌సీ) పోలీసు స్టేషన్‌లో ఫిర్యాదు చేయడంతో వారిపై కేసు నమోదు చేసినట్లు పోలీసులు తెలిపారు. ప్రస్తుతం మన దేశంలో యూకే స్ట్రెయిన్‌ కేసుల సంఖ్య పెరుగుతున్న సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో మహరాష్ట్ర ప్రభుత్వం విదేశాల నుంచి వచ్చిన వారు కోవిడ్‌ టెస్టు చేయించుకోవడం తప్పనిసరి అంటూ ఆదేశాలు జారీ చేసింది. పరీక్షలో ఒకవేళ నెగిటివ్‌ వచ్చినప్పటికి కూడా వారాల పాటు హోం క్వారంటైన్‌లో ఉండాలని మహా ప్రభుత్వం ఆంక్షలు విధించింది.

ఈ నేపథ్యంలో ఇటీవల దుబాయ్‌ వెళ్లిన అర్బాజ్ ఖాన్, సోహైల్ ఖాన్, సోహైల్‌ తనయుడు నిర్వాన్ ఖాన్‌లు గతేడాది డిసెంబర్ 25న దుబాయ్ నుంచి ముంబైకు తిరిగి వచ్చారు. అయితే ప్రభుత్వ నిబంధనలు ఏమాత్రం లేక్క చేయకుండ ఆర్బాజ్‌ ఖాన్‌, సోహైల్‌ ఖాన్‌, నిర్వాన్‌లు నిబంధలను ఉల్లఘించడంతో ముగ్గురిపై ముంబై వైద్యాధికారులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. వారి ఫిర్యాదు మేరకు  పోలీసులు ముగ్గురిపై ఎఫ్‌ఐఆర్‌ నమోదు చేశారు.  అయితే వారు ప్రభుత్వ నిబంధనల ప్రకారం తప్పనిసరిగా 14 రోజులపాటు క్వారంటైన్‌కు వెళ్లాలి. కానీ నిబంధనలను అతిక్రమిస్తూ వారు నేరుగా ఇంటికి వెళ్లారని, కోవిడ్ -19 మార్గదర్శకాల ప్రకారం క్వారంటైన్‌లో ఉండాలని చెప్పినా పట్టించుకోకుండా మొండిగా ప్రవర్తించారని సదరు వైద్య అధికారి ఫిర్యాదులో పేర్కొన్నారు. 

మరిన్ని వార్తలు