సినిమాటోగ్రఫీ సవరణలు.. రాజ్యాంగవిరుద్ధం: వెట్రి మారన్‌

27 Jun, 2021 08:11 IST|Sakshi

న్యూఢిల్లీ/చెన్నై: కేంద్రం జారీ చేసిన సినిమాటోగ్రఫీ(సవరణ బిల్లు 2001)పై తీవ్ర దుమారం చెలరేగుతోంది. కొత్త సవరణల ప్రకారం.. సెంట్రల్‌ బోర్డు ఆఫ్‌ ఫిలిం సర్టిఫికేషన్‌(సీబీఎఫ్‌సీ) సర్టిఫై చేసిన సినిమాపై ఎవరైనా (ఒక్కరైనా సరే) అభ్యంతరం గనుక వ్యక్తం చేస్తే. మళ్లీ రీ సర్టిఫికేషన్‌ కోసం అడిగే అధికారం కేంద్ర ప్రభుత్వానికి ఉంటుంది. అంతేకాదు పైరసీకి సంబంధించిన శిక్షలతో పాటు ఏజ్‌ బేస్డ్‌ సర్టిఫికేషన్‌లు కూడా ఇందులో ఉన్నాయి. అయితే  సర్టిఫికెట్‌ గండం దాటేందుకు మేకర్లు నానా తంటాలు పడుతున్న టైంలో.. కొత్త సవరణలు పెద్దతలనొప్పిగా మారే అవకాశం ఉందని సినీ పెద్దలు భావిస్తున్నారు.

ప్రముఖ ఫిల్మ్‌మేకర్‌ శ్యామ్ బెనగల్ నేతృత్వంలోని కమిటీ గతంలో ‍కేంద్రానికి కొన్ని సూచనలు చేసింది. ఏదైనా సినిమాను చూసే సభ్యులు దానికి ఏజ్‌ సర్టిఫికేట్‌ ఇవ్వాలే తప్ప.. సినిమాను సెన్సార్ చేసే హక్కు ఉండకూడదని కమిటీ సూచించింది. కానీ, కేంద్రం దానిని పెడచెవిన పెట్టింది. ఇప్పటికీ అభ్యంతరకరం పేరుతో దృశ్యాలను తొలగించడం, డైలాగులను మ్యూట్ చేయడం నడుస్తోంది. ఇక సీబీఎస్‌సీ రెండు ప్యానెల్‌లు(ఎగ్జామైనింగ్‌ కమిటీ, రివైజింగ్‌ కమిటి) గనుక సర్టిఫికేషన్‌ను నిరాకరిస్తే.. ‘ఫిల్మ్‌ సర్టిఫికేషన్‌ అప్పలేట్‌ ట్రిబ్యునల్‌’ ఫిల్మ్‌ మేకర్లకు ఊరట ఇచ్చేది. కానీ,  ఏప్రిల్‌లో ఆ ట్రిబ్యునల్‌ను నిషేధిస్తున్నట్లు కేంద్రం చేస్తున్నట్లు ప్రకటించింది. దీంతో కత్తెరల పంచాయితీపై నిర్మాతలు ఇకపై కోర్టును ఆశ్రయించాల్సిన పరిస్థితి ఏర్పడింది.

ఇలా కంట్రోల్‌ చేస్తున్నారా?
ఇక  సినిమాటోగ్రఫీ యాక్ట్‌ 1952కు చేసిన తాజా సవరణలు చాలావరకు సినిమా రిలీజ్‌ టైంలో అడ్డుపడేందుకు వీలున్నవే. పైగా వ్యక్తిగత కక్క్ష్యలతో, రాజకీయ దురుద్దేశంతో అడ్డుతగిలే అవకాశం ఉందని పలువురు సినీ పెద్దలు భావిస్తున్నారు. ఓటీటీకీ సెన్సార్‌, ఫీచర్‌ ఫిల్మ్‌ సెన్సార్‌ నిబంధనలను సంక్లిష్టంగా మారుస్తూ వస్తున్న కేంద్రం.. ఇప్పుడు మరోసారి తీసుకున్న నిర్ణయం పై పలువురు ఇబ్బందిగా ఫీలవుతున్నారు. కేరళ మూవీ అకాడమీ చైర్‌పర్సన్‌ కమల, కోలీవుడ్‌ దర్శకుడు వెట్రిమారన్‌, డాక్యుమెంటరీ ఫిల్మ్‌ మేకర్‌ ఆనంద్‌ పట్వార్దాన్‌ తదితరులు తాజా నిర్ణయాలను తప్పుబడుతున్నారు.  ‘సినిమా తీసేవాళ్లను ఈవిధంగా నియంత్రించాలని చూస్తున్నారు.. ఇది రాజ్యాంగవిరుద్ధం’ అని కోలీవుడ్‌ దర్శకుడు వెట్రిమారన్‌ మండిపడ్డాడు. ఈ విషయంపై తమిళనాడు దర్శకుల అసోషియేషన్‌ కార్యదర్శి ఆరే సెల్వమణితో మాట్లాడిన వెటట్రి.. బిల్లుకు వ్యతిరేకంగా నిలబడాలని విజ్ఞప్తి చేశాడు.

 

యుబైఎలోనూ వయసువారీగా..
ప్రధానంగా సినిమాలను ‘యు’, ‘యు/ఎ’, ‘ఎ’ ‘ఆర్‌’ సర్టిఫికెట్లుగా ఇస్తూ వస్తున్నారు. ‘యు’ అంటే అందరూ చూడదగ్గ చిత్రం, ‘యు / ఎ’ అంటే పెద్దల సమక్షంలో పిల్లలు చూడదగ్గ చిత్రం, ‘ఎ’ అంటే 18 సంవత్సరాల పైబడిన వారు చూడదగ్గ చిత్రం. అయితే తాజా సవరణలతో ‘యు/ఎ’ సర్టిఫికెట్‌నూ మూడు కేటగిరీలుగా విభజించారు. యు /ఎ 7 ప్లస్, యు /ఎ 13 ప్లస్, యు /ఎ 16 ప్లస్ అని. అంటే పెద్దల సమక్షంలో కూడా ఏడు సంవత్సరాలు, పదమూడు సంవత్సరాలు, పదహారు సంవత్సరాల పైబడ్డ వారు చూసే చిత్రాలుగా విజభించారు. సెన్సార్‌షిప్‌ అడ్డుపుల్లలతో ఫిల్మ్‌మేకర్లను గిచ్చిగిల్లుతున్న కేంద్రం.. మరోవైపు కొత్తసవరణలపై ప్రజాభిప్రాయ సేకరణకు పిలువు ఇవ్వడం కొసమెరుపు.

చదవండి: సెన్సార్‌.. సెన్సార్‌.. సెన్సార్‌

Read latest Movies News and Telugu News
Follow us on FaceBook, Twitter, Instagram, YouTube
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి
మరిన్ని వార్తలు