Chetan Kumar: లగ్జరీ లైఫ్‌ వదిలి ఇండియాకు.. హీరోగా సూపర్‌ సక్సెస్‌.. కానీ..

20 Nov, 2023 12:59 IST|Sakshi

ముక్కుసూటిగా మాట్లాడే వైఖరి.. తన అభిప్రాయాన్ని నిక్కచ్చిగా చెప్పే ధైర్యం.. నటుడు చేతన్‌ కుమార్‌ సొంతం. కానీ దీనివల్ల ఎన్నో సార్లు విమర్శలు, వివాదాలు అతడిని చుట్టుముట్టాయి. అయినా వాటిని లెక్క చేయకుండా తనకు నచ్చింది చేసుకుంటూ పోతున్నాడు. భారత క్రికెట్‌ జట్టులో రిజర్వేషన్‌ ఉండి తీరాల్సిందేనంటూ  తాజాగా ఆయన చేసిన వ్యాఖ్యలు సోషల్‌ మీడియాలో దుమ్ముదుమారం రేపుతున్నాయి. ఈ క్రమంలో చేతన్‌ కుమార్‌ అలియాస్‌ చేతన్‌ అహింస ఎవరనేది ఓసారి చూద్దాం..

అమెరికా నుంచి వచ్చి..
చేతన్‌ కుమార్‌ 1983 ఫిబ్రవరి 24న అమెరికాలో జన్మించాడు. అతడికి అమెరికన్‌ పౌరసత్వం ఉంది. ఆయన తల్లిదండ్రులు ఇద్దరూ అమెరికాలో డాక్టర్లుగా సేవలందిస్తున్నారు. వీరు కర్ణాటక నుంచి వలస వెళ్లినవారే! 2005లో యేల్‌ యూనివర్సిటీ నుంచి గ్రాడ్యుయేషన్‌ పట్టా అందుకున్న చేతన్‌ అక్కడ చదువుకునే సమయంలో కుల, మత, లింగ బేధాల గురించి అధ్యయనం చేశాడు. ఫుల్‌బ్రైట్‌ స్కాలర్‌ అందుకున్న ఇతడు ఈ ప్రాజెక్ట్‌పై మరింత అధ్యయనం చేసేందుకు కర్ణాటకకు వచ్చాడు. ఇక్కడికి వచ్చాక సమాజంలో జరుగుతున్న సమస్యలు తనను నిద్ర పోనీయకుండా చేశాయి.

ఆ రెండే ఇష్టం
చేతన్‌కు రెండే రెండు ఇష్టం.. ఒకటి నటన, రెండు సామాజిక సేవ. 2005లోనే చికాగో వదిలేసి పూర్తిగా ఇండియాకు షిఫ్ట్‌ అయిన ఇతడు తన కలలను సాకారం చేసుకున్నాడు. ముందుగా మైసూరుకు 25 కి.మీ. దూరంలో ఉన్న ముల్లూరు అనే గ్రామంలోని పాఠశాలలో ఉపాధ్యాయుడిగా చేరాడు. తర్వాత విస్తారా అనే థియేటర్‌ గ్రూపులో చేరి నటుడిగా మారాడు. ఇక తన ప్రాజెక్టు కోసం కర్ణాటక అంతా తిరుగుతున్న సమయంలో డైరెక్టర్‌ కేఎమ్‌ చైతన్యను కలిశాడు. అతడు చేతన్‌ను హీరోగా పెట్టి ఆ దినగాలు అనే కన్నడ సినిమా చేశాడు. ఇది అగ్ని శ్రీధర్‌ అనే అండర్‌ వరల్డ్‌ డాన్‌ జీవితకథ ఆధారంగా తెరకెక్కింది. 2007లో రిలీజైన ఈ మూవీ బాక్సాఫీస్‌ దగ్గర ప్రకంపనలు సృష్టించింది.

అలా అహింస తోడైంది
తొలి సినిమాతోనే హిట్‌ అందుకున్న ఇతడికి హీరోగా మరిన్ని అవకాశాలు వచ్చాయి. అలా ఎనిమిది సినిమాలు చేశాక చేతన్‌ కుమార్‌ తన పేరు పక్కన అహింస అనే పదాన్ని జోడించాడు. సామాజిక కార్యకర్తగా తన ఆశయాన్ని, లక్ష్యాన్ని తన పేరులో ఇనుమడింపజేసేందుకు చేతన్‌ కుమార్‌ అహింసగా మారాడు. లింగాయత్‌, ఎల్‌జీబీటీక్యూఐ, దళితులు, ఆదివాసీలు, రైతులు.. బడుగు బలహీన వర్గాల కోసం ఎప్పటినుంచో ముందుండి పోరాడుతున్నాడు. తను నమ్మే సిద్ధాంతాలు, ఆశయాల కోసం ఎంతవరకైనా వెళ్తాడు.

గర్భిణీల వెంట్రుకలు తినాలట..
సాధారణంగా సినీ సెలబ్రిటీలు దేనిపైనా స్పందించడానికి ఇష్టపడరు. కానీ చేతన్‌ మాత్రం అందుకు భిన్నంగా తన అభిప్రాయాన్ని బల్లగుద్ది చెప్తాడు. 2017లో అజ్జలు పద్ధతి అనే సాంప్రదాయాన్ని బహష్కరించేందుకు పెద్ద పోరాటమే చేశాడు. ఈ సాంప్రదాయం ప్రకారం ఉన్నత వర్గానికి చెందిన గర్భిణీల వెంట్రుకలు, గోళ్లను తక్కువ వర్గానికి చెందినవారు తినాలి. దీన్ని రూపుమాపాలంటూ చేతన్‌ చేసిన పోరాటం ప్రభుత్వాన్నే కదిలించింది. ఆ సాంప్రదాయన్ని కర్ణాటక ప్రభుత్వం రద్దు చేసింది. ఇలా ఎన్నో పోరాటాలు చేశాడు. ఓసారి ఓ వర్గం మనోభావాలు దెబ్బతినేలా వ్యాఖ్యానించడంతో జైలుకు కూడా వెళ్లొచ్చాడు. పలుమార్లు అసందర్భ వ్యాఖ్యలు చేసి విమర్శలపాలు కూడా అయ్యాడు.

పెళ్లిలో అదే స్పెషల్‌
చేతన్‌ 2020 ఫిబ్రవరి 2న మేఘ అనే యువతిని పెళ్లి చేసుకున్నాడు. వీరి పెళ్లి కూడా అనాథాశ్రమంలో జరిగింది. పెళ్లి పత్రికలు కూడా విభిన్నంగా రూపొందించారు. వాటిని మట్టిలో పాతిపెట్టితే మొలకలు వచ్చేలా వెడ్డింగ్‌ కార్డ్‌లో విత్తనాన్ని పొందుపరిచారు. ట్రాన్స్‌జెండర్‌ చేతుల మీదుగా ఈ పెళ్లి జరిగింది. వివాహానికి వచ్చిన అతిథులకు భారత రాజ్యాంగ పుస్తకాలను బహుమతిగా ఇవ్వడం విశేషం.

చదవండి: 'మళ్లీ చెప్తున్నా, అలా చేసుంటే భారత్‌ గెలిచేది..' నటుడి వ్యాఖ్యలపై ట్రోలింగ్‌

మరిన్ని వార్తలు