క్రికెట్‌ జోష్‌ ముగిసింది.. ఈ సినిమాలతో జాతర ప్రారంభం.. 8 సినిమాల్లో లాస్ట్‌ పంచ్‌ సలార్‌దే

20 Nov, 2023 13:01 IST|Sakshi

కొద్దిరోజుల్లో 2023కు గుడ్‌బై చెప్పే సమయం ఆసన్నమైంది. దసర పండుగ వరకు వరుస సినిమాలతో సందడి చేసిన  చిత్ర పరిశ్రమ క్రికెట్‌ వరల్డ్‌ కప్‌ కారణంగా పలు సినిమాలు వాయిదా పడుతూ వచ్చాయి. ఎందుకంటే..? క్రికెట్‌, సినిమా రెండూ ప్రేక్షకులను అలరిస్తాయి. క్రికెట్‌ కారణంగా కొన్ని సినిమాలు విడుదల వాయిదా వేసుకుంటే మరికొన్ని అనుకోని కారణాలతో జాప్యం జరుగుతూ వచ్చింది. నిన్నటితో క్రికెట్‌ ప్రపంచం నుంచి ప్రేక్షకులు మెళ్లిగా సినిమా ప్రపంచం వైపు మళ్లుతున్నారు.

త్వరలో క్రిస్టమస్‌ పండగ రానుంది... అంతేకాకుండా 2023 సంవత్సరానికి గుడ్‌బై చెప్పే సమయం వచ్చేస్తుంది. ఇలాంటి సమయంలో రానున్న 40 రోజుల్లో విడుదలయ్యే సినిమాలు ఏవి..? ఏడాది చివర్లో భారీ సిక్సర్‌ కొట్టే సినిమా ఏది..? ఇదే క్రమంలో క్లీన్‌ బౌల్డ్‌ అయ్యే మూవీ ఏది..? అనే అప్పుడే లెక్కలు వేస్తున్నారు సినీ అభిమానులు. నవంబర్‌ 24 నుంచి డిసెంబర్‌ 22 వరకు వరసగా విడుదలయ్యే చిత్రాలు ఎన్ని ఉన్నాయో ఒకసారి చూద్దాం.

ఆదికేశవతో వస్తున్న వైష్ణవ్‌ తేజ్‌
వైష్ణవ్‌ తేజ్‌, శ్రీలీల జంటగా శ్రీకాంత్‌ ఎన్‌.రెడ్డి తెరకెక్కిస్తున్న చిత్రం 'ఆదికేశవ'. ఎస్‌. నాగవంశీ, సాయి సౌజన్య సంయుక్తంగా ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. ఇందులో అపర్ణా దాస్‌, జోజు జార్జ్‌, రాధిక తదితరులు కీలక పాత్రలు పోషిస్తున్నారు. ఈ సినిమా నవంబర్‌ 24న ప్రేక్షకుల ముందుకు రానుంది.  ఈ చిత్రంలో వైష్ణవ్‌, శ్రీలీల రొమాంటిక్‌ లుక్‌తో చూడముచ్చటగా కనిపించారు. మాస్‌ యాక్షన్‌ కథాంశంతో తెరకెక్కుతోన్న ఈ చిత్రంపై  వైష్ణవ్‌ భారీ అంచనాలు పెట్టుకున్నాడు. ఇందులో రుద్ర అనే పాత్రలో వైష్ణవ్‌ కనిపిస్తే... వజ్ర కాళేశ్వరి దేవిగా అపర్ణా దాస్‌ కనిపించనుంది. ఈ సినిమాకి సంగీతం జి.వి.ప్రకాష్‌ కుమార్‌ అందిస్తున్నారు.

'కోట బొమ్మాళి పీఎస్‌'లో శివాని రాజశేఖర్‌
లింగి లింగి లింగిడి... పాట వల్ల 'కోట బొమ్మాళి పీఎస్‌' సినిమా గురించి విడుదలకి ముందే హైప్‌ క్రియేట్‌ అయింది. తల్లిదండ్రులు జీవిత, రాజశేఖర్‌ల నట వారసత్వాన్ని పుణికి పుచ్చుకున్న శివాని ఇందులో ప్రధాన పాత్రలో కనిపించనుంది.  శ్రీకాంత్‌, రాహుల్‌ విజయ్‌, వరలక్ష్మి శరత్‌కుమార్‌ కీలక పాత్రలు పోషించిన ఈ చిత్రాన్ని గీతా ఆర్ట్స్‌ 2 పతాకంపై బన్నీ వాస్‌, విద్య కొప్పినీడి నిర్మించారు. నవంబర్‌ 24న ఈ చిత్రం విడుదల కానుంది. మలయాళంలో సూపర్‌ హిట్‌ అయిన  'నాయట్టు' చిత్రానికి  రీమేక్‌గా దీనిని తెరకెక్కించారు.

క్రూరమైన యానిమల్‌గా రణ్‌బీర్‌
రణ్‌బీర్‌ కపూర్‌ - రష్మిక జంటగా నటించిన చిత్రం 'యానిమల్‌'. పాన్‌ ఇండియా రేంజ్‌లో తెరకెక్కిన ఈ చిత్రానికి తెలుగు డైరెక్టర్‌ సందీప్‌రెడ్డి వంగా దర్శకత్వం వహించారు. విభిన్నమైన కథతో యాక్షన్‌ థ్రిల్లర్‌గా ఈ చిత్రాన్ని తెరకెక్కించినట్లు తెలుస్తోంది. డిసెంబర్‌ 1న ప్రపంచవ్యాప్తంగా ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ సినిమా రన్‌టైమ్‌ దాదాపు 3.20 గంటలు ఉండనుందని టాక్‌ వస్తుంది. కానీ అధికారికంగా ప్రకటన రాలేదు.

హ్యట్రిక్‌పై కన్నేసిన షారుక్‌ ఖాన్‌
సోషల్‌ మీడియాలో ఎక్కువగా వినిపిస్తున్న సినిమా పేర్లలో 'డంకీ' చిత్రం టాప్‌లో ఉంది. రాజ్‌కుమార్‌ హిరాణీ దర్శకత్వంలో షారుక్‌ ఖాన్‌ ఇందులో నటిస్తున్నాడు. ఈ ఏడాదిలో ఇప్పటికే వరుసగా రెండు సూపర్‌ హిట్‌ సినిమాలతో ఫుల్‌జోష్‌లో ఉన్న షారుక్‌ ఈ చిత్రం కోసం ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. పఠాన్‌, జవాన్‌ రెండు చిత్రాలు రూ.1000 కోట్ల క్లబ్‌లో చేరిపోయాయి. డంకీ చిత్రం ద్వారా సూపర్‌ హిట్‌ కొట్టి ఈ ఏడాదిలో హ్యాట్రిక్‌ కొట్టాలని షారుక్‌ ఉన్నారు. డిసెంబర్‌ 22న ఈ చిత్రం సలార్‌తో పోటీకి దిగనుంది.

చివర్లో దిగుతున్న డైనోసార్‌ (సలార్‌)
భారతీయ చలన చిత్ర పరిశ్రమలో భారీ అంచనాలతో విడుదలకు రెడీగా ఉన్న చిత్రం సలార్‌.. పాన్‌ ఇండియా స్టార్‌ ప్రభాస్‌,  ప్రశాంత్‌ నీల్‌ దర్శకత్వంలో సలార్‌ తెరకెక్కింది.  ఈ భారీ యాక్షన్‌ థ్రిల్లర్‌ చిత్రం ఇప్పటికే ఒకసారి వాయిదా పడి క్రిస్టమస్‌ కానుకగా డిసెంబర్‌ 22న విడుదల కానుంది. ఈ ఏడాది చివర్లో భారీ బడ్జెట్‌ చిత్రంగా సలార్‌ ఉంది.

లైన్లో ఉన్న నాని, నితిన్‌, విష్వక్‌సేన్‌
ఈ చిత్రాలతో పాటు మరికొన్ని ఆసక్తకరమైన చిత్రాలు డిసెంబర్‌ నెలలో విడుదల కానున్నాయి. డిసెంబర్‌  7న నాని చిత్రం 'హాయ్‌ నాన్న'  ప్రేక్షకుల ముందుకు రానుంది. డిసెంబర్‌ 8న ఏకంగా మూడు చిత్రాలు విడుదలకు రెడీగా ఉన్నాయి. వరుణ్‌తేజ్‌- 'ఆపరేషన్‌ వాలంటైన్‌', విష్వక్‌సేన్‌- 'గ్యాంగ్స్‌ ఆఫ్‌ గోదావరి',  నితిన్‌- 'ఎక్స్‌ట్రా ఆర్డినరీమేన్‌' ఉన్నాయి. ఈ మూడు సినిమాలూ ఒకే రోజు ప్రేక్షకుల ముందుకు వచ్చే ఛాన్స్‌ ఉంది.

మరిన్ని వార్తలు