శర్వానంద్‌ నాకు మరో రామ్‌చరణ్‌ లాగా: చిరు

9 Mar, 2021 01:23 IST|Sakshi
కిశోర్, రామ్‌ ఆచంట, శర్వానంద్, చిరంజీవి, ప్రియాంక, పువ్వాడ అజయ్‌ కుమార్, గోపీ ఆచంట

‘‘ఒక యాక్టర్‌ కొడుకు యాక్టర్, డాక్టర్‌ కొడుకు డాక్టర్, రాజకీయ నాయకుడి కొడుకు రాజకీయ నాయకుడు కావాలనుకుంటారు. కానీ ఓ రైతు కొడుకు రైతు అవ్వాలని అనుకోడు. రైతు కొడుకు కూడా గర్వంగా నేను రైతే అవుతాను అనే రోజులు మళ్లీ రావాలి. ఆ రోజు వస్తుందనే ఆశాభావం ఉంది’’ అని చిరంజీవి అన్నారు. వ్యవసాయ జీవితం నేపథ్యంలో శర్వానంద్, ప్రియాంకా అరుళ్‌ మోహన్‌ జంటగా కిశోర్‌ బి. దర్శకత్వం వహించిన చిత్రం ‘శ్రీకారం’. 14 రీల్స్‌ ప్లస్‌ బ్యానర్‌పై రామ్‌ ఆచంట, గోపీ ఆచంట నిర్మించిన ఈ సినిమా ఈ నెల 11న విడుదలవుతోంది. ఈ సందర్భంగా ఖమ్మంలో నిర్వహించిన ప్రీ రిలీజ్‌ వేడుకలో చిరంజీవి మాట్లాడుతూ–‘‘శర్వానంద్‌ నాకు మరో రామ్‌చరణ్‌ లాగా. తను చిన్నప్పుడు నాతో కలసి థమ్స్‌అప్‌ యాడ్‌ చేశాడు.

‘శంకర్‌దాదా ఎంబీబీఎస్‌’లో అతిథి పాత్ర చేశాడు. ఆ రకంగా తన నటనకి శ్రీకారం చుట్టింది నేనే. చూస్తుండగానే సినిమా సినిమాకి పరిణతి సాధిస్తూ సినిమాలు చేస్తున్నాడు. మన చదువుతోటి వ్యవసాయానికి అధునాతన టెక్నాలజీని జోడిస్తే వ్యవసాయాన్ని మరో స్థాయికి తీసుకెళ్లొచ్చు’’ అన్నారు. తెలంగాణ రాష్ట్ర రవాణాశాఖ మంత్రి పువ్వాడ అజయ్‌ కుమార్‌ మాట్లాడుతూ–‘‘నేను చిన్నప్పటి నుంచి చిరంజీవిగారి ఫ్యాన్‌. ‘శ్రీకారం’ ప్రీ రిలీజ్‌ వేడుక ఇంత పెద్ద ఎత్తున ఖమ్మంలో జరగడానికి ప్రధాన కారణం చిరంజీవి. ‘ఆచార్య’ షూటింగ్‌ కొంతైనా ఖమ్మంలో చేయాలని ఆయన్ని కోరడంతో ఇల్లందులోని మైన్స్‌ వద్ద షూటింగ్‌ చేస్తున్నారు’’ అన్నారు. శర్వానంద్‌ మాట్లాడుతూ – ‘‘బాస్‌ (చిరంజీవి) ముందు మాట్లాడాలంటే టెన్షన్‌గా ఉంది.

‘శర్వా... నీ సంకల్పం గొప్పదైతే దేవుడు నీ తలరాతను తిరగరాస్తాడు’ అని చిరంజీవిగారు చెప్పిన మాటను ఎప్పటికీ మర్చిపోలేను. ఆ సంకల్పమే నన్ను స్టార్‌ని చేసి నా స్టార్‌ని మార్చింది. వారసత్వం ద్వారా చాలామందికి ఆస్తులు వస్తాయి. కానీ చిరంజీవిగారి క్యారెక్టర్, ఆ వారసత్వం నా స్నేహితుడు రామ్‌చరణ్‌ తేజ్‌కి వచ్చింది.. అది ఇంకెవ్వరికీ దక్కదు’’ అన్నారు. దర్శకుడు కిశోర్‌ మాట్లాడుతూ – ‘‘శర్వానంద్‌గారిని ఒక హీరోలా కాదు.. నా అన్నలా భావిస్తున్నాను’’ అన్నారు. గోపీ ఆచంట మాట్లాడుతూ –‘‘మా సినిమా ప్రేక్షకులకు నచ్చుతుంది’’ అన్నారు. ఈ వేడుకలో మాటల రచయిత బుర్రా సాయిమాధవ్, పాటల రచయితలు పెంచల్‌ దాస్, కేకే, భరద్వాజ, నిర్మాత చెరుకూరి సుధాకర్‌ తదితరులు పాల్గొన్నారు.

చిరంజీవికి శర్వా పాధాభివందనం

మరిన్ని వార్తలు