Defamation Case: కంగనాకు షాక్‌, ఇలా అయితే అరెస్ట్‌ వారెంట్‌!

14 Sep, 2021 15:51 IST|Sakshi

ఇలా అయితే అరెస్ట్‌ వారెంట్‌ తప్పదు కంగనాకు కోర్టు వార్నింగ్‌

పదే పదే  గైర్హాజరవుతున్న కంగనాపై కోర్టు  ఆగ్రహం

తదుపరి విచారణ సెప్టెంబరు 20కి వాయిదా

సాక్షి, ముం‍బై: బాలీవుడ్‌ హీరోయిన్‌ కంగనా రనౌత్‌కు  కోర్టు మరోసారి షాక్‌ ఇచ్చింది. ప్రముఖ సినీ పాటల రచయిత, కవి జావేద్‌ అఖ్తర్‌ వేసిన  డిఫమేషన్‌ కేసులో  గైర్హాజరు కావడంపై ముంబయి మెట్రోపాలిటన్ కోర్టు ఆగ్రహం వ్యక్తం చేసింది. వ్యక్తిగతంగా హాజరు కాకుండా పదే పదే మినహాయింపు కోరుతుండడంపై అసహనం వ్యక్తంచేసిన కోర్టు  తాజాగా గట్టి వార్నింగ్ ఇచ్చింది.  తదుపరి విచారణకు వ్యక్తిగతంగా విచారణకు హాజరుకాకపోతే అరెస్ట్‌ వారెస్ట్‌ జారీ చేస్తానని న్యాయమూర్తి హెచ్చరించారు. అనంతరం కేసు విచారణను సెప్టెంబర్ 20 కి వాయిదా వేసారు.

చదవండి :  Terrific Road Accidents: తీరని విషాదాలు

జావేద్ అఖ్తర్ దాఖలు చేసిన పరువు నష్టం కేసులో అంధేరి మెట్రోపాలిటన్‌ మేజిస్ట్రేట్  కోర్టులో  మంగళవారం  విచారణ జరిగింది. పిటిషనర్ జావేద్ అఖ్తర్ హాజరుకాగా నటి కంగన రనౌత్ మాత్రం హాజరుకాలేదు. తన లాయర్ ద్వారా వ్యక్తిగత హాజరు నుంచి మినహాయింపు ఇవ్వాలని కోర్టును అభ్యర్థించింది. ఇదంతా చూస్తుంటే కావాలనే కాలయాపన చేస్తున్నట్టు కనిపిస్తోందని కోర్టు మండిపడింది. ఇకపై ఇదే తరహాలో  వ్యవహరిస్తే ఊరుకునేది లేదని వ్యాఖ్యానించింది. వచ్చే విచారణకు తప్పకుండా వ్యక్తిగతంగా హాజరు కావాలని ఆదేశించింది. లేదంటే అరెస్ట్‌ వారెంట్‌ జారీ చేస్తామని స్పష్టం చేసింది. దీనిపై అఖ్తర్ తరఫు న్యాయవాది జే భరద్వాజ్ కోర్టులో అభ్యంతరం తెలుపడంతో తాజా హెచ్చరిక చేసింది. 

కంగనా రనౌత్ తరఫు న్యాయవాది రిజ్వాన్ సిద్ధిఖీ మాట్లాడుతూ,  కంగనా  సినిమా యాక్టింగ్‌, ప్రమోషన్‌ పనుల్లో బిజీగా ఉండటంతో పా టు,   కొన్ని లక్షణాల కారణంగా కోవిడ్ పరీక్ష చేయించుకోనున్నారని, ఒకవేళ పాజిటివ్‌ వస్తే  మరింత మినహాయింపు అవసరం ఉంటుందని కోర్టుకు తెలపడం గమనార్హం

కాగా నటుడు సుశాంత్ సింగ్ రాజ్‌పుత్ మరణానంతరం ఒక ఛానెల్ కు ఇచ్చిన ఇంటర్వ్యూలో నటి కంగన తన పరువుకు నష్టం కల్గించే రీతిలో మాట్లాడారని జావేద్‌ పరువు నష్టం కేసు దాఖలు చేశారు. అయితే ఈ కేసును కొట్టివేయాలంటూ బాంబే హైకోర్టును ఆశ్రయించారు కంగనా. అయితే కంగనా పిటిషన్‌ను బాంబే  హైకోర్టు తిరస్కరించిన సంగతి తెలిసిందే.

మరిన్ని వార్తలు