T20 World Cup 2021: ఇలాగే చేస్తే అతడు రిటైర్మెంట్ ప్రకటించవచ్చు...

14 Sep, 2021 15:51 IST|Sakshi

Mohammad Hafeez Might Not Play T20 World Cup: పాకిస్తాన్ స్టార్‌ ఆల్‌రౌండర్‌ మహ్మద్ హఫీజ్ టీ20 ప్రపంచ కప్‌కు ముందు తన అంతర్జాతీయ క్రికెట్‌కు రిటైర్మెంట్ ప్రకటించవచ్చని ఆ జట్టు వికెట్ కీపర్ కమ్రాన్ అక్మల్ సంచలన వాఖ్యలు చేశాడు. ప్రస్తుతం కరీబియన్ ప్రీమియర్ లీగ్‌లో ఆడుతున్న హఫీజ్‌ను త్వరగా స్వదేశానికి రావాలని పాకిస్తాన్‌ క్రికెట్‌ బోర్డు ఆదేశాలు జారీ చేసింది. కాగా సెప్టెంబర్ 18 వరకు కొనసాగుతున్న సీపీల్‌లో పాల్గొనడానికి హఫీజ్‌కు నో అబ్జెక్షన్ సర్టిఫికేట్ మంజూరు చేయబడింది.

అయితే, న్యూజిలాండ్‌తో జరగబోయే హోమ్ సిరీస్ కోసం సెప్టెంబర్ 16లోపు హఫీజ్‌ను జట్టులో పీసీబీ  చేరమంది. ఇందుకోసం రెండు రోజులు గడువు ఇవ్వాలన్న హఫీజ్ అభ్యర్థనను కూడా బోర్డు తిరస్కరించింది. దీంతో హఫీజ్ న్యూజిలాండ్‌తో జరిగే సిరీస్‌కు దూరమయ్యాడు. ఈ నేపథ్యంలో పీసీబీ తీసుకున్న నిర్ణయంపై హఫీజ్‌ మండిపడుతున్నాడని సమాచారం. ఈ విషయం పై స్పందించిన అక్మల్ తన యూట్యూబ్ ఛానెల్‌లో మాట్లడతూ.. హఫీజ్ వంటి సీనియర్ ఆటగాడి పట్ల పాకిస్తాన్ క్రికెట్ బోర్డ్ దురుసుగా ప్రవర్తించడంపై  తీవ్ర విమర్శలు చేశాడు. హఫీజ్‌తో ఈ విధంగా ప్రవర్తించడం ఇదేమి మొదటిసారి కాదని అక్మల్ అన్నాడు.

"నేను మొహమ్మద్ హఫీజ్‌తో మాట్లాడలేదు కానీ అతడు చాలా బాధపడ్డాడని.. టీ20 ప్రపంచకప్ ఆడకపోవచ్చని నేను అనుకుంటున్నాను. పీసీబీ అతడితో సంప్రదింపులు జరపకపోతే , అతడు ప్రపంచకప్‌కు ముందు రిటైర్మెంట్ ప్రకటించే అవకాశం ఉంది" అని అక్మల్ అభిప్రాయపడ్డాడు. పాకిస్థాన్ క్రికెట్ బోర్డ్  కొత్త ఛైర్మన్ గా బాధ్యతలు స్వీకరించిన రమీజ్ రాజాను.. భవిష్యత్తులో హఫీజ్‌ లాంటి సీనియర్ ఆటగాళ్లకు ఈ విధంగా జరగకుండా చూసుకోవాలని అక్మల్ అభ్యర్థించాడు. తమ మధ్య ఉన్న వ్యక్తిగత సమస్యలను పక్కనపెట్టి హఫీజ్‌కి మద్దతు ఇవ్వాలని అక్మల్ కోరాడు. కాగా రమీజ్‌ రాజా కంటే పన్నెండేళ్ల వయస్సున్న తన కొడుకుకే క్రికెట్‌ గురించి ఎక్కువ తెలుసంటూ హఫీజ్‌ గతంలో వ్యాఖ్యానించిన సంగతి తెలిసిందే.

చదవండి: బ్లూ కలర్ జెర్సీలో కనిపించనున్న ఆర్సీబీ.. ఎందుకంటే?

మరిన్ని వార్తలు