దృశ్యం రీమేక్‌: కమల్‌ హాసన్‌ ‘పాపనాశం’ సీక్వెల్‌కు ప్లాన్‌!

9 Jun, 2021 09:25 IST|Sakshi

జీతూ జోసెఫ్‌ దర్శకత్వంలో మలయాళంలో ఘనవిజయం సాధించిన థ్రిల్లర్‌ ‘దృశ్యం’. ఈ సినిమా తెలుగు, తమిళ భాషల్లో రీమేక్‌ అయి, మంచి హిట్‌ అందుకున్న విషయం తెలిసిందే. తెలుగు ‘దృశ్యం’కి శ్రీప్రియ దర్శకత్వం వహించగా, వెంకటేశ్‌-మీనా జోడీగా నటించారు. తమిళంలో ‘పాపనాశం’ పేరుతో కమల్‌హాసన్‌-గౌతమి జంటగా జీతూ జోసెఫ్‌ తెరకెక్కించారు. కాగా ‘దృశ్యం’ చిత్రానికి సీక్వెల్‌గా జీతూ జోసెఫ్‌ దర్శకత్వంలో మలయాళ, తెలుగు భాషల్లో ‘దృశ్యం 2’ రూపొందింది. మలయాళంలో ఇప్పటికే విడుదలైంది. తెలుగు ‘దృశ్యం 2’ రీమేక్‌ పూర్తయి, విడుదలకు సిద్ధంగా ఉంది.

ఇప్పుడు జీతూ తమిళ రీమేక్‌ని ప్లాన్‌ చేస్తున్నారట. రెండో భాగంలోనూ కమల్‌హాసన్‌ కథానాయకుడిగా నటించనున్నారట. అయితే మొదటి భాగంలో ఆయనకు భార్యగా నటించిన గౌతమి సీక్వెల్‌లో నటిస్తారా? అనే చర్చ ఆరంభమైంది. కమల్‌–గౌతమి తమ స్నేహానికి ఫుల్‌స్టాప్‌ పెట్టిన విషయం, కమల్‌ ఇంట్లోనే ఉంటూ వచ్చిన గౌతమి ఆ ఇంటి నుంచి బయటకు రావడం తెలిసిందే. ఈ నేపథ్యంలో గౌతమి నటిస్తారా? అసలు దర్శకుడికి ఆమెను తీసుకోవాలని ఉందా? అనే ప్రశ్నలకు త్వరలోనే సమాధానం దొరుకుతుంది. 

చదవండి: 
కరోనాపై వరలక్ష్మి శరత్‌కుమార్‌ అవగాహన

మరిన్ని వార్తలు