‘నాగార్జున, నాగచైతన్యలకు కథ నచ్చడంతో మా సినిమా మొదలైంది’

24 Nov, 2021 09:22 IST|Sakshi

‘‘జీవితం చాలా చిన్నది.. ఉన్నప్పుడే ఎంజాయ్‌ చేయాలనేది ‘అనుభవించు రాజా’ కథ’’ అని డైరెక్టర్‌ శ్రీను గవిరెడ్డి అన్నారు. రాజ్‌ తరుణ్, కశిష్‌ ఖాన్‌ జంటగా తెరకెక్కిన చిత్రం ‘అనుభవించు రాజా’. సుప్రియ యార్లగడ్డ నిర్మించిన ఈ సినిమా ఈ నెల 26న విడుదలవుతోంది. ఈ సందర్భంగా శ్రీను గవిరెడ్డి మాట్లాడుతూ.. ‘‘పూరి జగన్నాథ్‌ స్ఫూర్తితో ఇండస్ట్రీకి వచ్చి, అసిస్టెంట్‌ డైరెక్టర్‌గా చేశాను. నేను దర్శకత్వం వహించిన ‘సీతమ్మ అందాలు రామయ్య సిత్రాలు, గరమ్‌’ సినిమాలు 2016లో విడుదలైనా అంతగా ఆడలేదు.

ఆ తర్వాత ‘అనుభవించు రాజా’ కథ రాసుకున్నాను. సుప్రియగారు కథ విని ఓకే అన్నారు. నాగార్జున గారు, నాగచైతన్యలకు కూడా కథ నచ్చడంతో ఈ సినిమా మొదలైంది. ఇందులో రాజ్‌ తరుణ్‌ సెక్యూరిటీ గార్డ్‌గా కనిపిస్తారు. ‘మనం ఎక్కడుంటే అది మన ఊరు కాదు.. మనం పుట్టిందే మన ఊరు’ అనే ఎమోషన్‌ ఇందులో ఉంటుంది. ఈ సినిమాను నాగచైతన్య చూసి, బాగుందన్నారు. ఇండస్ట్రీ, సినిమాలు నాకు చాలా నేర్పించాయి. నా బలం ఎంటర్‌టైన్‌మెంట్‌. నా తర్వాతి సినిమా ఓ మంచి బ్యానర్‌లో ఓకే అయింది’’ అన్నారు.

మరిన్ని వార్తలు