Venkatesh Maha: కేజీఎఫ్‌ సినిమాపై కేరాఫ్‌ కంచరపాలెం డైరెక్టర్‌ సంచలన వ్యాఖ్యలు

6 Mar, 2023 13:05 IST|Sakshi

కన్నడ స్టార్‌ యశ్‌ హీరోగా నటించిన కేజీఎఫ్‌ 1, 2 సినిమాలు బాక్సాఫీస్‌ను గడగడలాడించాయి. కేవలం కన్నడలోనే కాకుండా దక్షిణాది భాషలతో పాటు హిందీలోనూ వసూళ్ల వర్షం కురిపించాయి. బాక్సాఫీస్‌ రికార్డులను తిరగరాసిన ఈ సినిమా విమర్శకుల నుంచి సైతం ప్రశంసలు అందుకుంది. కానీ ఈ సినిమా ఓ టాలీవుడ్‌ దర్శకుడికి అస్సలు నచ్చలేదు. దీంతో సదరు సినిమాపై ఓ ఇంటర్వ్యూలో బాహాటంగా  విమర్శలు గుప్పించాడు కేరాఫ్‌ కంచరపాలెం డైరెక్టర్‌ వెంకటేశ్‌ మహా. కేజీఎఫ్‌ సినిమా పేరు ప్రస్తావించకుండా కేవలం కథ గురించి చెప్తూ సెటైర్లు వేశాడు.

'ఇప్పుడేవైతే వంద కోట్లు, వెయ్యి కోట్లు, లక్ష కోట్లు సంపాదిస్తున్నాయో అవన్నీ పాప్‌కార్న్‌ ఫిలింస్‌. పాప్‌కార్న్‌ తింటూ సినిమా చూడొచ్చు. ఏదైనా సీన్‌ మిస్సైనా ఏం పర్లేదు అన్నట్లుగా ఉంటుంది. ఆ సినిమాలు ఓటీటీలో చూడాల్సినవి. మేము తీసినవి అలాంటివి కావు. ఒక సినిమా పేరు చెప్పను కానీ వివరాలు చెప్తాను. ప్రపంచంలో ఒక తల్లి.. కొడుకుని నువ్వెప్పటికైనా గొప్పోడివి అవ్వాలిరా అని చెప్తుంది. అంటే బాగా సంపాదించి నలుగురికీ ఉపయోగపడు అని!

తల్లి ఓ పెద్ద వస్తువు కావాలంటుంది. ఈ హీరో వెళ్లి దాన్ని తవ్వేవాళ్లను ఉద్ధరిస్తాడు. వాడు ఆ బంగారం తీసుకెళ్లి ఎక్కడో పారదొబ్బుతాడు. వాడంత పిచ్చోడు ఎవడైనా ఉంటాడా? ఆ మహాతల్లి నిజంగా ఉంటే తనను కలవాలనుంది. ఇలాంటి కథను సినిమాగా తీస్తే మనం చప్పట్లు కొడుతున్నాం' అంటూ వెటకారంగా మాట్లాడాడు. ఈయన వ్యాఖ్యలు యశ్‌ ఫ్యాన్స్‌కు కోపం తెప్పించాయి. పాన్‌ ఇండియా లెవల్‌లో హిట్టయిన సినిమా గురించి ఇంత నీచంగా మాట్లాడుతున్నాడేంటని మండిపడుతున్నారు అభిమానులు. ఈ ఇంటర్వ్యూలో వెంకటేశ్‌ మహా మాటలకు పడీపడీ నవ్విన డైరెక్టర్‌ నందినీరెడ్డి సోషల్‌ మీడియాలో ఈ వివాదంపై స్పందిస్తూ.. క్షమాపణలు కోరింది.

మరిన్ని వార్తలు