యూత్‌ కలల రాణికి నిశ్చితార్ధం.. త‍్వరలో పెళ్లి

24 Nov, 2023 12:43 IST|Sakshi

భాషతో సంబంధం లేకుండా గుడ్‌నైట్‌ చిత్రాన్ని తెలుగు ప్రేక్షకులు ఎంతగానో ఆదరించారు. ఈ ఏడాదిలో చిన్న సినిమా వచ్చిన గుడ్‌నైట్‌ భారీ హిట్‌ను సొంతం చేసుకుంది. మిలియన్ డాలర్ స్టూడియోస్, ఎమ్మార్పీ ఎంట‌ర్‌టైన్‌మెంట్ బ్యానర్‌లపై వచ్చిన ఈ చిత్రంలో కె. మణికంఠన్, మీతా రఘునాథ్ జోడీ చాలా బాగా మెప్పిస్తుంది. డిస్నీ ప్లస్‌ హాట్‌స్టార్‌లో స్ట్రీమింగ్‌ అవుతున్న ఈ చిత్రం సౌత్‌ ఇండియాలో మంచి గుర్తింపు తెచ్చుకుంది.

గుడ్‌నైట్‌ చిత్రంలో ఎలాంటి మేకప్‌ లేకుండా 'అను' పాత్రలో మీతా రఘునాథ్ ప్రేక్షకులను చాలా బాగా మెప్పించింది. త‌క్కువ బ‌డ్జెట్‌తో రూపొందిన ఈ సినిమా భారీ విజ‌యం సాధించడమే కాకుండా ఈ ఏడాది హిట్ చిత్రాల జాబితాలో చేరిపోయింది. నిద్ర, గురక వంటి సాదాసీదా విషయాలను కథావస్తువుగా తీసుకుని అద్భుతమైన స్క్రీన్ ప్లేగా అభిమానులకు అందించారు దర్శకుడు వినాయక్ చంద్రశేఖరన్.

మీతా రఘునాథ్ పెళ్లి
ఈ చిత్రంలో మణికందన్, మీతా రఘునాథ్ నటనకు భారీ స్పందన లభించింది. మీతా రఘునాథ్ తన సహజ నటనతో అభిమానులను ఆకట్టుకుంది. 2022లో "సా నీ నిధూమ్ నీ" చిత్రంతో తమిళ చిత్రసీమలో నటిగా అరంగేట్రం చేసిన ఆమెకు 'గుడ్ నైట్' చిత్రం మంచి గుర్తింపు తెచ్చింది. ఈ సినిమాలో ఆమె నటన చూసిన అభిమానులు తనలాంటి భార్య కావాలని సోషల్ మీడియాలో ఎందరో యూత్‌  మాట్లాడుకునేలా చేసింది.  భర్త కోసం దేన్నైనా భరించే భార్యగా ఆమె పాత్ర ప్రేక్షకుల మదిలో  ఎప్పటికీ నిలిచిపోతుంది.

ఈ సినిమా వల్ల ఆమెకు కోలీవుడ్‌లో భారీగానే ఆఫర్లు వస్తున్నాయి. ఈ సందర్భంలో మీతాకు పెళ్లి నిశ్చయమైంది. తాజాగా ఆమె నిశ్చితార్థం ఫోటోలు సోషల్‌ మీడియాలో వైరల్‌ అవుతున్నాయి. కాబోయే భర్తతో కలిసి ఉన్న ఫోటోను తన ఇన్‌స్టాగ్రామ్‌ స్టోరీస్‌లో షేర్‌ చేసింది. త్వరలో పెళ్లి తేదీని ప్రకటించనుండగా, అభిమానులు మీతాకు సోషల్ మీడియాలో శుభాకాంక్షలు తెలుపుతున్నారు.

మరిన్ని వార్తలు