మొట్టమొదటి మలయాళ హీరోయిన్ ఎవరో తెలుసా..!

10 Feb, 2023 16:46 IST|Sakshi

ఇప్పుడు సినిమా అంటే రంగుల ప్రపంచం. స్క్రీన్‌పై మాయ చేసే ఓ కలర్‌పుల్ ప్రపంచం. మరీ అప్పట్లో సినిమాలు ఎలా ఉండేవో తెలుసా. అప్పటి నటీనటులు బ్లాక్ అండ్ వైట్ తెరపై ఎలా కనిపించారో మీరు కూడా చూసే ఉంటారు. అయితే ఆ కాలంలోనూ అత్యంత అణగారిన వర్గాల నుంచి వెలుగులోకి వచ్చిన నటి పీకే రోజీ. దళితులపై కఠినమైన ఆంక్షలున్న ఆ రోజుల్లో తెరపై కనిపించిన మొట్ట మొదటి మలయాళ నటి ఆమెనే.

ఇవాళ ఆమె 120 బర్త్‌డే సందర్భంగా గూగుల్ ఆమెను గౌరవించింది. గూగుల్ డూడుల్‌ మొదటి మలయాళ నటిని బర్త్‌ డే సందర్భంగా ప్రదర్శించింది. ఆ సమయంలో అనేక అడ్డంకులను అధిగమించి సినిమాల్లో నటించింది. పీకే రోజీ 1903లో కేరళలోని త్రివేండ్రంలో(తిరువనంతపురం) రాజమ్మగా జన్మించింది. ఆమెది పేద కుటుంబం. చాలా చిన్న వయస్సులో ఉన్నప్పుడే ఆమె తండ్రి మరణించారు. ఆమె సంగీతం, నటనను గుర్తించిన రోజీ మేనమామ ప్రోత్సాహం అందించారు. 

నాటకాలు వేస్తూ తనలోని ప్రతిభను చాటుకుంది. ఆ విధంగా కక్కరిసీ అనే నాటకంపై గుర్తింపు తెచ్చుకుంది. ఆమె నాటకం ఎక్కడ ప్రదర్శించినా అపూర్వ స్పందన వచ్చేది. ఈ క్రమంలోనే అప్పటి ఫిల్మ్ మేకర్ జేసీ డేనియల్​ దృష్టిని ఆకర్శించారామె. ఆ తర్వాత తాను తీయబోయే విగతుకుమారన్ అనే చిత్రానికి రోజీని తన సినిమాలో హీరోయిన్‌గా తీసుకున్నారు. దీంతో మొట్టమొదటి దళిత హీరోయిన్‌గా రోజీ నిలిచింది. అయితే ఈ సినిమాలో పీకే రోజీ అగ్ర వర్ణ కులానికి చెందిన మహిళగా నటించారు. దీన్ని ఆ వర్గం వారు కొందరు వ్యతిరేకించారు.

అంతేకాదు కాకుండా సినిమా ప్రారంభోత్సవానికి ఆమెను ఆహ్వానించొద్దని కూడా నిరసన చేశారు. సినిమా ప్రదర్శన సమయంలో తెరపై కొందరు రాళ్లు విసిరేశారట. అప్పటికీ కోపం తగ్గని వారంతా కలిసి రోజీ ఏదో నేరం చేసిందన్నట్టుగా ఇంటికి నిప్పు పెట్టారు. ఆ తర్వాత రోజీ ఓ లారీలో తమిళనాడుకు పారిపోయారని.. అక్కడ లారీ డ్రైవర్​ కేశవన్ పిళ్లైని పెళ్లి చేసుకొని రాజమ్మాళ్ పేరుతో అక్కడే స్థిరపడిపోయారని సమాచారం. ఆమె ఒక నటి అన్న సంగతి కూడా ఆమె పిల్లలకు తెలియదని చెబుతారు. తాజాగా ఇవాళ (ఫిబ్రవరి 10) ఆమె జయంతి సందర్భంగా గూగుల్ డూడుల్‌తో గుర్తుకు తెచ్చింది.


 

మరిన్ని వార్తలు