Happy Birthday Chiranjeevi: చిరంజీవ.. చిరంజీవ..

22 Aug, 2021 08:11 IST|Sakshi

ఆదివారం (ఆగస్టు 22) చిరంజీవి బర్త్‌ డే. ఈ సందర్భంగా పలువురు సినీ ప్రముఖులు ఆన్‌లైన్‌ వేదికగా చిరంజీవికి చిరంజీవ.. చిరంజీవ.. అంటూ బర్త్‌ డే శుభాకాంక్షలు తెలిపారు. వారిలో కొందరి స్పందనలు... ఇలా..!

చిరంజీవీ... నీకు జన్మదిన శుభాకాంక్షలు. ఆయురారోగ్య ఐశ్వర్యాలతో  క్షేమంగా ఉండాలని, సుఖంగా ఉండాలని, నువ్వు ఇంకా మంచి కీర్తి  ప్రతిష్ఠలు తెచ్చుకోవాలని మనసారా కోరుకుంటున్నాను. ‘శతమానం భవతి శతాయః పురుషశ్శతేంద్రియ ఆయుష్యేవేంద్రియే ప్రతితిష్ఠతి’ అని పెద్దవాడిగా ఆశీర్వదిస్తున్నాను.
– దర్శకులు కె. విశ్వనాథ్‌

మంచి సుగుణాలన్నీ క్రోడీకరించుకుని ఉన్న వ్యక్తి చిరంజీవి. యాక్టర్‌గా మెగాస్టార్‌ అనిపించుకున్నారు. ఆ భగవంతుడు చిరంజీవిని కాపాడుతూ ఉండాలని కోరుకుంటున్నాను. 
– నటులు కైకాల సత్యనారాయణ

నాకు గైడ్, నన్ను ప్రోత్సహించే చిరంజీవిగారికి జన్మదిన శుభాకాంక్షలు. ఇక పై మీరు(చిరంజీవి) మీ జీవితంలో మునుపటి కంటే ఎక్కువ సక్సెస్‌ను చూడాలి.
- హీరో వెంకటేశ్‌ 

హ్యాపీ బర్త్‌ డే టు మెగా మెగా మెగా...మెగా మెగాస్టార్‌ చిరంజీవిగారు. మా తరానికే కాదు. భవిష్యత్‌ తరాలకు కూడా మీరు స్ఫూర్తి సార్‌.  
– హీరో ప్రభాస్‌

చిరంజీవిగారు సెట్స్‌లో నన్ను బాగా చూసుకునేవారు. చిరంజీవిగారి ‘ఆలయశిఖరం’ సినిమా సెట్స్‌కు వెళ్లి ఆయనతో నా చేతిపై ఆటోగ్రాఫ్‌ తీసుకున్నాను. అలాంటి నేను ఆయనతో హీరోయిన్‌గా సినిమాలు చేస్తానని అనుకోలేదు. అదృష్టంగా భావిస్తున్నాను. ఒక అభిమాని తన అభిమాన హీరో సరసన హీరోయిన్‌గా చేయడం చాలా అరుదు. కానీ ఆ అవకాశం నాకు లభించింది. చిరంజీవి 150వ సినిమా సమయంలో ‘సాక్షి’ టీవీకి నేను ఆయన్ను ఇంటర్వ్యూ చేశాను. అప్పుడు ఆయన నన్ను చూసి షాక్‌ అయ్యారు. కొంతగ్యాప్‌ తర్వాత మేం కలిసినందు వల్లే ఆయన అలా షాక్‌ అయ్యారు. ‘రాజకీయాలు వేరు, సినిమాలు వేరు. నువ్వు ఎప్పుడైనా మా ఇంటికి రావొచ్చు’ అని ఆయన అప్పుడు అన్నారు. చిరంజీవిగారు మరెన్నో బర్త్‌ డేలు చేసుకోవాలి. నేను ఇప్పుడు సినిమాలు చేయడం లేదు. కానీ చిరంజీవిగారి సినిమాలో ఛాన్స్‌ వస్తే చేస్తా.
– నటి, రాజకీయ నాయకురాలు రోజా 

చిరంజీవి ఫేస్‌లో మంచి గ్రేస్‌ ఉంది. చిరంజీవిగారితో నేను పాతిక సినిమాలు చేశాను. సెట్స్‌లో ప్రతిరోజూ కొత్తగా అనిపించేది. ప్రతిరోజూ థ్రిల్లింగ్‌ ఎక్స్‌పీరియన్సే. ఆయన బాడీ అంతా యాక్టింగే. చిరంజీవిగారితో మంచి అండర్‌స్టాండింగ్‌ ఉంది కాబట్టే ఆయనతో అన్ని సినిమాలు చేయగలిగాను. సెట్స్‌లో ఏ రోజూ ఆయన అలసిపోయినట్లు కనిపించలేదు. ముందురోజు రాత్రి 12 గంటల వరకు షూట్‌లో పాల్గొని, మళ్లీ ఉదయం ఐదు గంటలకే సెట్స్‌లోకి వచ్చేశారు. చిరంజీవిగారు మరెన్నో సినిమాలు చేయాలి. 
– దర్శకులు కోదండ రామిరెడ్డి

చిరంజీవిగారు మంచి హార్డ్‌వర్కర్‌. ఆయన చేసిన సినిమాలకు అసిస్టెంట్‌ డైరెక్టర్‌గా వర్క్‌ చేసిన తర్వాత దర్శకుడిగా ‘స్టేట్‌రౌడీ, ఇంద్ర’ వంటి సినిమాలు చేశాను. ఆయన సినిమా షూటింగ్‌ను చూసేందుకు ప్రజలు తెగ వచ్చేవారు.
– దర్శకులు బి. గోపాల్‌

మద్రాస్‌లో ఉన్నప్పుడు చిరంజీవి బర్త్‌ డేకి అందరం కలుసుకునేవాళ్ళం. నాకన్నా చిరంజీవి వయసులో చిన్నవాడే అయినప్పటికీ ‘బాబాయ్‌’ అని పిలిచేవాడిని. ఇప్పటికీ, ఎప్పటికీ చిరంజీవి జగదేకవీరుడే. మంచితనం, సంస్కారం ఆయనకు అలంకారాలు. ‘ఆచార్య’ సినిమా చూడటానికి ఆసక్తిగా ఎదురుచూస్తున్నాను 
– దర్శకులు కె.రాఘవేంద్రరావు

చిరంజీవి గారి చాలా సినిమాలను నేను తమిళంలో డబ్‌ చేశాను. ఆయనతో నాకు 1980 నుంచి అనుబంధం ఉంది. ‘హిట్లర్‌’ సినిమాను నేను నిర్మించినప్పుడు చిరంజీవిగారు బాగా హెల్ప్‌ చేశారు. ఇప్పుడు మా అబ్బాయి మోహన్‌రాజా చిరంజీవిగారి ‘గాడ్‌ఫాదర్‌’ సినిమాను డైరెక్ట్‌ చేస్తున్నారు. ఇది పెద్ద విజయం సాధించాలి. చిరంజీవిగారు వందేళ్లకు పైగా జీవించాలని కోరుకుంటున్నాను. 
– ఎడిటర్‌ మోహన్‌

చిరంజీవిగారి విజయయాత్ర ఇలానే కొనసాగాలని కోరుకుంటున్నాను. 
 – నటి శారద

స్వయంకృషికి మారుపేరు చిరంజీవిగారు. హీరోగా ఓ కొత్త ఒరవడిని సృష్టించిన వ్యక్తి ఆయన.
– నటి ప్రభ

నాకు యాభై సంవత్సరాలుగా ఫిల్మ్‌స్టార్స్‌తో పరిచయాలు ఉన్నాయి. ఆ స్టార్స్‌లో చిరంజీవి స్పెషల్‌. పాజిటివ్‌ మైండ్, క్రమశిక్షణ, సక్సెస్‌..ఈ మూడు అంశాలు ఉన్న వ్యక్తి చిరంజీవి. ఇండియన్‌ సినిమాలోని గ్రేట్‌ స్టార్స్‌లో చిరంజీవి ఒకరు. 
– కళాబంధు సుబ్బరామిరెడ్డి!

ఇరవై సంవత్సరాలుగా చిరంజీవిని కలవాలన్న నా కోరిక ఒకటి ఇటీవలే  నేరవేరింది. చిరంజీవిగారు ఎన్నో రికార్డులను తిరగరాశారు. మళ్లీ ఆయన మరోసారి తెలుగు బాక్సాఫీసును బద్దలు కొట్టాలని, అత్యధిక కలెక్షన్స్‌ రికార్డు ఆయన పేరిట ఉండాలని నా కోరిక. జరుగుతుందని నా ప్రగాఢ విశ్వాసం. ఇందుకు నేను చేయాల్సింది ఏమైనా ఉంటే అది చేస్తాను. తెలుగు ఫీల్డ్‌లో టాప్‌ ఒకటి, రెండు, మూడు సాంగ్స్‌ ఆయనవే. తెలుగు, తమిళం, హిందీ ఇండస్ట్రీస్‌లో కూడా ఆయన టాప్‌ 3 ప్లేసెస్‌లో ఉండాలన్నది నా ఆకాంక్ష. అది జరగాలని కోరుకుంటాను. ఆయనకు ఓ యూనివర్సల్‌ సబ్జెక్ట్‌ను రాసే అవకాశం వస్తే అది నా అదృష్టంగా భావిస్తాను.
 – రచయిత విజయేంద్రప్రసాద్‌

Read latest Movies News and Telugu News
Follow us on FaceBook, Twitter, Instagram, YouTube
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి
మరిన్ని వార్తలు