క్లైమాక్స్‌ మార్చుకున్న‘ది గాడ్‌ ఫాదర్‌’ 

3 Dec, 2020 17:00 IST|Sakshi

ఫ్రాన్సిస్‌ ఫోర్డ్‌ కపోలా దర్శకత్వం వహించిన ‘ది గాడ్‌ ఫాదర్‌’ ఇంగ్లీష్‌ చిత్రానికి హాలివుడ్‌లో అప్పటికీ ఇప్పటికీ చెరిగిపోనీ ఓ ప్రత్యేక ముద్ర ఉన్న విషయం తెలిసిందే. ఇటాలియన్‌ మాఫియా గురించి ఆయన తీసిన ‘ది గాడ్‌ ఫాదర్‌’ సినిమా మూడు పార్ట్‌లను కూడా భారతీయ ప్రేక్షకులు ఎంతో ఆదరించారు. ఒక్క సినిమా స్ఫూర్తితో ప్రపంచవ్యాప్తంగా ఎంతోమంది దర్శకులుగా సినిమా ప్రపంచానికి పరిచయం కాగా, మరెంతో మంది దర్శకులు అదే సినిమా స్ఫూర్తితో ఎన్నో సినిమాలు తీసి ప్రేక్షకుల మెప్పు పొందారనడంలో సందేహం లేదు. (చదవండి : మహాబలేశ్వరంలో ‘ఆర్‌ఆర్‌ఆర్‌’ సందడి)


టాలీవుడ్, బాలీవుడ్‌ రంగాల్లో తనకంటూ ఓ ప్రత్యేక గుర్తింపును సాధించిన రామ్‌ గోపాల్‌ వర్మ కూడా ‘ది గాడ్‌ ఫాదర్‌’ సిరీస్‌ సినిమాలను 300 సార్లు చూశానని చెప్పుకోవడమే కాకుండా వాటి స్ఫూర్తితో తాను పలు చిత్రాలను తీశానని ఒప్పుకున్నారు. 1990లో తీసిన ‘ది గాడ్‌ ఫాదర్‌ పార్ట్‌–3’ కి ఇప్పుడు కూడా ‘రాటెన్‌ టమాటోస్‌’ 68 శాతం రేటింగ్‌ ఇవ్వడం విశేషం. ఈ సినిమా ఇప్పుడు కొత్త రూపంలో మళ్లీ మన ముందుకు వస్తోంది. 

81 ఏళ్ల ఫాన్సిస్‌ ఫోర్డ్‌ కపోలా ‘ది గాడ్‌ ఫాదర్‌ పార్ట్‌–3’ సినిమా బిగినింగ్‌ను కొద్దిగా మార్చి, క్లైమాక్స్‌ను పూర్తిగా మార్చివేసి ప్రేక్షకుల ముందుకు తెస్తున్నారు.ఇంకా ఎన్నో ఏళ్లు జీవించాల్సిన మైకేల్‌ కార్లియోన్‌ అర్ధాంతరంగా చనిపోయే చివరి పతాక సన్నివేశంలో మార్పులు చేశానని, ఇది నాటి తరం ప్రేక్షకులతోపాటు ఈ తరం ప్రేక్షకులను ఆకట్టుకుంటోందని భావిస్తున్నట్లు దర్శకులు కపోలా ఆశాభావం వ్యక్తం చేశారు.  ఈ చిత్రం డిజిటల్, ఇతర రూపాల్లో డిసెంబర్‌ 8వ తేదీన ప్రపంచవ్యాప్తంగా విడుదలవుతోంది. 

మరిన్ని వార్తలు