సమంత ‘యశోద’కు భారీ షాక్‌.. ఓటీటీ విడుదల ఆపాలంటూ కోర్టు ఆదేశం!

24 Nov, 2022 10:01 IST|Sakshi

టాలీవుడ్‌ స్టార్‌ హీరోయిన్‌ సమంత నటించిన లెటెస్ట్‌ మూవీ ‘యశోద’. శ్రీదేవి మూవీస్ పతాకంపై ప్రముఖ నిర్మాత శివలెంక కృష్ణ ప్రసాద్ నిర్మించిన ఈ చిత్రానికి హరి, హరీష్ దర్శకత్వం వహించారు. భారీ అంచనాల మధ్య నవంబర్‌ 11 థియేటర్స్‌లో విడుదలైన ఈ చిత్రం పాజిటివ్‌ టాక్‌తో డీసెంట్‌ హిట్‌గా నిలిచింది. ఈ మూవీని థియేటర్స్‌లో మిస్‌ అయినవాళ్లు ఓటీటీలో చూసేందుకు ఎదురు చూస్తున్నారు. డిసెంబర్‌ రెండో వారంలో అమెజాన్‌ ప్రైమ్‌ వీడియోలో ఈ చిత్రం స్ట్రీమింగ్‌ కాబోతున్నట్లు వార్తలు వినిపించాయి. కానీ ఈ లోపే యశోద మేకర్స్‌కి ఊహించని దెబ్బ తగిలింది. ఈ సినిమా ఓటీటీ విడుదలను నిలిపివేయాలంటూ సిటీ సివిల్‌ కోర్టు ఆదేశాలు జారీ చేసింది. డిసెంబర్ 19 వరకు  ఓటీటీలో స్ట్రీమింగ్‌ చేయడానికి  వీల్లేదని సిటీ సివిల్ కోర్టు ఉత్తర్వులు జారీ చేసింది.  

కారణామేంటి?
యశోద సినిమాలో సరోగసీ ఫెర్టిలిటీ సెంటర్‌కు  ‘ఈవా’అని పేరు పెట్టారు. అందులో అన్ని అక్రమాలు జరిగినట్లు చూపించారు. అయితే సినిమాలో తమ ఆస్పత్రి పేరు చూపించడం వల్ల తమ ప్రతిష్ట దెబ్బతిన్నదంటూ ‘ఈవా హాస్పిటల్’ యాజమాన్యం సిటీ సివిల్ కోర్టులో పిటిషన్ వేసింది. ఈ సినిమా ఓటీటీ విడుదలను అడ్డుకోవాలని కోరింది. దీంతో సిటీ కోర్టు యశోద నిర్మాణ సంస్థకు నోటీసులు జారీ చేసి.. డిసెంబర్ 19 వరకు ఓటీటీలో చిత్ర ప్రదర్శన చేయకూడదని ఆదేశించింది. తదుపరి విచారణను డిసెంబర్‌ 19కి వాయిదా వేసింది. 

మరిన్ని వార్తలు