Late Actress Savithri: చివరి రోజుల్లో ‘మహానటి’ సావిత్రికి సెట్‌లో అవమానం, అన్నం కూడా పెట్టకుండా..

5 Nov, 2022 12:44 IST|Sakshi

సావిత్రి.. ఈ పేరు తెలియని తెలుగు ప్రేక్షకులు ఉండరు. న‌ట‌న‌కే న‌ట‌న‌ను నేర్పిన స‌హ‌జ న‌టి. పాత్ర‌ల‌కే ప్రాణం పోసిన మ‌హాన‌టి ఆమె. అందుకే తరాలు మారిన ఇండస్ట్రీలో సావిత్రి స్థానం సుస్థిరం. తెలుగు సినిమా గురించి చెప్పుకుంటే ఎన్టీఆర్‌, ఏఎన్‌ఆర్‌ల తర్వాత వినిపించే పేరు సావిత్రిదే. అప్పట్లోనే హీరోలకు ధీటుగా సినిమాలు చేయడమే కాదు, మెగాఫోన్‌ పట్టి డైరెక్టర్‌గా కూడా మారారు. చలన చిత్ర రంగంలో తనకంటూ చేరగని ముద్ర వేసుకున్న ఆమె నిజ జీవితంలో ఎన్నో ఒడిదుడుకులను చూశారు. హీరోయిన్‌గా కోట్ల ప్రజల అభిమానాన్ని పొందిన సావిత్రి చివరికి ఓ అనాథలా కన్నుమూశారు.

చదవండి: గుడ్‌న్యూస్‌ చెప్పిన సుడిగాలి సుధీర్‌.. ఫుల్‌ ఖుషిలో ఫ్యాన్స్‌

అసలు సావిత్రి చివరి రోజుల్లో ఎలా ఉన్నారు, వందల కోట్ల ఆస్తులు పోగొట్టుకున్న ఆమెకు చివరిలో రోజుల్లో ఓ మూవీ సెట్‌లో ఎదురైన చేదు అనుభవాన్ని దివంగత  నటులు గుమ్మడి గతంలో చెప్పారు. ఆయన తన చివరి రోజుల్లో ఓ చానల్‌తో ముచ్చటించిన ఈ పాత వీడియోలో గుమ్మడి, సావిత్రిని గుర్తు చేసుకుని ఎమోషనల్‌ అయిన తీరు పలువురిని కదిలిస్తోంది. ‘‘నేను సావిత్రికి చాలా ఆత్మీయుడ్ని. నన్ను అన్న అని పిలిచేది. సావిత్రి చివరి రోజుల్లో ఆమె పడ్డ కష్టాలను స్వయంగా చూశాను. ఇందులో ఓ చేదు గుర్తు, తీపి గుర్తు రెండూ ఉన్నాయి. నాకు ఓ వారం రోజులు ఆరోగ్యం బాగోలేదు. అవి సావిత్రి చివరి రోజులు. ఆమె నన్ను పలకరించడానికి ఇంటికి వచ్చింది. డాక్టర్‌ నాకు ఇంజెక్షన్‌ ఇస్తే మగతగా పడుకుని ఉన్నా.

సావిత్రి వచ్చి నన్ను పలకరించింది. నాతో కాసేపు మాట్లాడిన అనంతరం ఆమె వెళుతూ నా తలగడను సర్దినట్లు అనిపించింది. ఏంటా అని దాన్ని తీసి చూస్తే  2 వేల రూపాయలు ఉన్నాయి. ఫోన్‌ చేసి ఏంటమ్మా డబ్బులు పెట్టావు అని అడిగా.. ‘‘ మీరు మర్చిపోయారేమో అన్నయ్యా.. నేను మీ దగ్గర అప్పుడు 2 వేల రూపాయలు తీసుకున్నా..పోయే లోపల ఎవ్వరికీ దమ్మడి కూడా బాకీ ఉండకూడదు. నాకు 5 వేలు అడ్వాన్స్‌ వచ్చింది. దాంట్లోంచి ఇస్తున్నా’’ అంది. ఆమె వ్యక్తిత్వం చూసి నా కళ్లు చెమ్మగిల్లాయి’’ అంటూ భావోద్వేగానికి లోనయ్యారు. అనంతరం మాట్లాడుతూ.. ‘ఆమెకు హీరోయిన్‌గా అవకాశాలు తగ్గిపోయిన తర్వాత.. సినిమాలు కూడా తగ్గిపోయాయి. చివరికి క్యారెక్టర్‌ ఆర్టిస్ట్‌గా సినిమాలు చేయసాగింది. అప్పుడే ఓ సినిమా కోసం ఆమెను తల్లి పాత్రకు తీసుకున్నారు. నేను కూడా ఆ సినిమాలో చేస్తున్నాను.

చదవండి: ఫ్లైట్‌ నుంచి దూకేశా.. కోలుకోడానికి రెండున్నర ఏళ్లు పట్టింది: శర్వానంద్‌

ఆ సమయంలో అందరికీ ఇంటి దగ్గరి నుంచి భోజనాలు వస్తాయి. మాకు కొందరికి క్యారియర్లు వచ్చాయి. నా క్యారియర్‌ కూడా వచ్చింది. అప్పుడు సావిత్రి దూరాన ఒక్కతే అలా కూర్చుని ఉంది. సాధారణంగా ఇంటినుంచి క్యారియర్‌ రాని వాళ్లకు ప్రొడక్షన్‌ వాళ్లు భోజనం అరెంజ్‌ చేయాలి. ఆమె క్యారియర్‌ తెచ్చేవాళ్లు ఎవరు లేరు. నేను తన దగ్గరికి వెళ్లి ‘భోజనం చేయలేదా’ అని అడిగా.ఆకలిగా లేదని చెప్పింది. నాకు అంత అర్థమైంది. ప్రొడక్షన్‌ వాళ్లు భోజనం పెట్టలేదు. తనకు ఇంటి దగ్గరినుంచి రాలేదు. ‘‘రామ్మా.. భోజనం చేద్దాం’ అన్నా. ‘‘వద్దు’’ అని అంది. ‘‘లేదమ్మా! నువ్వు వస్తే తప్ప నేను కూడా భోజనం చేయను’’ అన్నాను. అప్పుడు ఏడ్చుకుంటూ వచ్చి భోజనం చేసింది’’ అని అన్నారు. అప్పట్లో మా సినిమాలో సావిత్రిగారే కావాలని పట్టుబట్టి మరి ఆమె కాల్‌షీట్‌ కోసం ఎదురు చూసేవాళ్లు.. చివరికి తను ఆ పరిస్థితి రాగానే ప్రోడక్షన్‌ బాయ్స్‌కు కూడా ఆమె చులక అయిపోయిందంటూ ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. 

మరిన్ని వార్తలు