ఆదిపురుష్‌ అగ్నిప్రమాదం: కావాలనే చేశారా?

3 Mar, 2021 20:25 IST|Sakshi

చిన్నదో, పెద్దదో... ఏ సినిమా అయినా ప్రారంభించేముందు అన్ని జాగ్రత్తలు తీసుకుంటారు. ఆ తర్వాతే కొబ్బరికాయ కొడుతారు. అలాంటిది పాన్‌ ఇండియా స్టార్‌ ప్రభాస్‌ శ్రీరాముడిగా నటిస్తున్న అత్యంత ప్రతిష్టాత్మక చిత్రం ఆదిపురుష్‌ సెట్స్‌ షూటింగ్‌ ప్రారంభించిన తొలి రోజే అగ్నికి ఆహుతి కావడం అందరినీ విస్మయానికి గురి చేసింది. కోట్ల రూపాయలు నష్టాన్ని మిగిల్చిన ఈ విషాదం ఓ రకంగా సినిమా యూనిట్‌కు కూడా అప్రతిష్టే. అదృష్టవశాత్తూ ఈ ఘటనలో ఎవరికీ ఎలాంటి హానీ జరగలేదు. కానీ ఈ ప్రమాదం ఎలా సంభవించింది? అన్న ప్రశ్నకు మాత్రం ఇప్పటికీ సరైన సమాధానం దొరకడం లేదు.

తాజాగా ఫిబ్రవరి 2న చోటు చేసుకున్న ఈ ప్రమాదం ఉద్దేశపూర్వకంగానే జరిగిందన్న చర్చ బాలీవుడ్‌లో మొదలైంది. ఇందులో హిందీ హీరో సైఫ్‌ అలీ ఖాన్‌ రావణుడి పాత్రను పోషిస్తున్న విషయం తెలిసిందే కదా! ఆ మధ్య అతడు "రావణాసురుడిలోని మానవత్వ కోణాన్ని ఆవిష్కరించే విధంగా ఈ సినిమాలో చూపించబోతున్నాం. ఆయన రాముడితో ఎందుకు యుద్ధం చేశాడు? రావణుడు తీసుకున్న నిర్ణయం ఒప్పే.. అనే కోణంలో సినిమా ఉంటుంది" అని చెప్పాడు. ఈ వ్యాఖ్యలు పెద్ద దుమారాన్నే రేపడంతో సైఫ్‌ తన తప్పు తెలుసుకున్నాడు. చేతులు కాలాక ఆకులు పట్టుకున్న చందంగా తీవ్ర వ్యతిరేకత వ్యక్తమయ్యాక అందరికీ క్షమాపణలు చెప్పాడు. అయినప్పటికీ చాలామంది ఆగ్రహజ్వాలలు చల్లారినట్లు లేదు. దీని ప్రతిఫలంగానే ఆదిపురుష్‌ సెట్స్‌కు నిప్పంటించి ఉండొచ్చని కథనాలు వెలువడుతున్నాయి. అయితే వీటిలో వాస్తవం ఎంతనేది తెలియాల్సి ఉంది.

కాగా రామాయణ ఇతిహాసం నేపథ్యంలో తెరకెక్కనున్న ఈ భారీ బడ్జెట్‌ చిత్రానికి ఓం రౌత్‌ దర్శకత్వం వహిస్తున్నాడు. టీ సిరీస్‌ ఫిల్మ్స్‌ సమర్పణలో భూషణ్‌ కుమార్, ఓం రౌత్, కిషన్‌ కుమార్, ప్రసాద్‌ సుతార్, రాజేష్‌ నాయర్‌ నిర్మిస్తున్నారు. ఈ చిత్రాన్ని వచ్చే ఏడాది ఆగస్ట్‌ 11న విడుదల చేయనున్నారు.

చదవండి: క్షమాపణలు చెప్పిన సైఫ్‌ అలీఖాన్‌

ప్రభాస్‌ ‘ఆదిపురుష్’ సెట్‌లో భారీ అగ్ని ప్రమాదం

మరిన్ని వార్తలు