MAD Review: ‘మ్యాడ్‌’ మూవీ ఎలా ఉందంటే..?

6 Oct, 2023 08:22 IST|Sakshi
Rating:  

టైటిల్‌: మ్యాడ్‌
నటీనటులు: నార్నే నితిన్, సంగీత్ శోభన్, రామ్ నితిన్, శ్రీ గౌరీ ప్రియా రెడ్డి, అనంతిక సనీల్ కుమార్, గోపికా ఉద్యన్, రఘుబాబు, రచ్చ రవి తదితరులు
నిర్మాణ సంస్థలు: సితార ఎంటర్‌టైన్‌మెంట్స్, ఫార్చ్యూన్ ఫోర్ సినిమాస్
నిర్మాతలు: హారిక సూర్యదేవర, సాయి సౌజన్య
రచన, దర్శకత్వం: కళ్యాణ్ శంకర్
సమర్పణ: ఎస్. నాగ వంశీ
సంగీతం: భీమ్స్ సిసిరోలియో
సినిమాటోగ్రఫీ:మ్‌దత్ సైనుద్దీన్, దినేష్ కృష్ణన్ బి 
ఎడిటర్: నవీన్ నూలి
విడుదల తేది: అక్టోబర్‌ 06, 2023

కథేంటంటే..
ఓ ఇంజనీరింగ్‌ కాలేజీ స్టూడెంట్స్‌ చుట్టూ తిరిగే కథ ఇది. వివిధ ప్రాంతాలకు చెందిన మనోజ్ (రామ్ నితిన్), దామోదర్ అలియాస్ డీడీ (సంగీత్ శోభన్), అశోక్ (నార్నే నితిన్) ముగ్గురూ.. రీజీనల్‌ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ ఇంజనీరింగ్‌ కాలేజీ మొదటి సంవత్సరంలో జాయిన్‌ అవుతారు. వీరితో పాటు లడ్డు అనే కుర్రాడు కూడా అదే కాలేజీలో చేరుతాడు. ఈ నలుగురు మంచి స్నేహితులవుతారు. అశోక్‌ ఇంట్రావర్ట్‌గా ఉంటాడు. మనోజ్‌..కనిపించిన ప్రతి అమ్మాయితో పులిహోర కలుపుతాడు. డీడీ ఏమో తనకు ఏ అమ్మాయిలు పడరని దూరంగా ఉంటూ సోలో లైపే సో బెటర్ అని పాటలు పాడుతుంటాడు.

అశోక్‌ను అదే కాలేజీకి చెందిన జెన్నీ(అనంతిక సనీల్‌ కుమార్‌) ఇష్టపడుతుంది. అశోక్‌కి కూడా ఆమె అంటే ఇష్టమే. కానీ తమ ప్రేమ విషయాన్ని ఒకరికొకరు చెప్పుకోరు. మరోవైపు మనోజ్‌.. బస్సులో శృతి((శ్రీ గౌరీ ప్రియా రెడ్డి)ని చూసి నిజంగానే ప్రేమలో పడతాడు. ఆమె కూడా కొన్నాళ్లు మనోజ్‌తో స్నేహం చేసి ఓ కారణంతో అమెరికాకు వెళ్లిపోతుంది. ఇక డీడీకి ఓ అజ్ఞాత అమ్మాయి నుంచి ప్రేమ లేఖ వస్తుంది. వెన్నెల పేరుతో ఫోన్‌లో పరిచయం చేసుకొని.. ప్రేమాయణం సాగిస్తుంటారు. మరి ఈ ముగ్గురి ప్రేమ కథలు ఎలా ముగిశాయి? శృతి ఎందుకు అమెరికా వెళ్లింది? అశోక్, జెన్నీలు ఒకరి మనస్సులో మాట మరొకరకు చెప్పుకున్నారా? డీడీకి ప్రేమ లేఖ రాసిన వెన్నెల ఎవరు? ఇంజనీరింగ్‌ కాలేజీలో MAD(మనోజ్‌, అశోక్‌, దామోదర్‌) చేసిన అల్లరి ఏంటి? అనేదే మిగతా కథ. 

ఎలా ఉందంటే..
కాలేజీ నేపథ్యంలో వచ్చే సినిమాలు ఎప్పుడూ ఎంటర్‌టైనింగ్‌గానే ఉంటాయి. ప్రెండ్‌షిప్‌, ర్యాగింగ్‌, ప్రేమ.. ఈ మూడు అంశాల చుట్టే  కథ తిరిగినప్పటీకి..వినోదంలో కొత్తదనం ఉంటే చాలు ఆ సినిమాను ప్రేక్షకులు ఆదరిస్తారు. మ్యాడ్‌ కూడా అదే కాన్సెప్ట్‌తో తెరకెక్కింది. లాజిక్స్‌ని పక్కకి పెట్టి.. స్టార్టింగ్‌ నుంచి ఎండింగ్‌ వరకు వరుస పంచ్‌ డైలాగ్స్‌తో వినోదభరితంగా కథ ముందుకు తీసుకెళ్లాడు దర్శకుడు  కళ్యాణ్ శంకర్.

ఈ కథలో కొత్తదనం వెతికితే ఏమి కనిపించదు. కానీ సన్నివేశాలుగా విభజించి చూస్తే..ప్రతీదీ ఎంటర్‌టైనింగ్‌గానే ఉంటుంది. కాలేజీలో ర్యాగింగ్.. సీనియర్లతో గొడవలు.. ఓ విషయంలో అంతా ఏకమై పక్క కాలేజీ వాళ్లతో పోటీపడడం.. ఇవన్నీ హ్యాపీడేస్‌ నుంచి మొన్నటి హాస్టల్‌ డేస్‌ వరకు చూసినవే. కానీ మ్యాడ్‌లో ప్లస్‌ పాయింట్‌ ఏంటంటే.. కామెడీ కొత్తగా ఉండడం. కొన్ని చోట్ల డబుల్‌ మీనింగ్‌ డైలాగ్స్‌ ఉన్నా.. ఆడియన్స్‌ నవ్వులో అవి కొట్టుకుపోతాయి. ఇలాంటి కథలకు స్క్రీన్‌ప్లే రాయడం చాలా కష్టం. పైగా ఈ సినిమాలో ప్రధాన పాత్రలు పోషించిన వారంతా కొత్తవాళ్లే. అయినా కూడా వారి నుంచి దర్శకుడు తనకు కావాల్సినంత నటనను రాబట్టుకున్నాడు. ఈ విషయంలో దర్శకుడిని అభినందించాల్సిందే. 

లడ్డు అనే వ్యక్తి మ్యాడ్‌ గ్యాంగ్‌ గురించి ఓ స్టూడెంట్‌కు వివరిస్తూ కథను ప్రారంభించాడు దర్శకుడు. ఆ తర్వాత వారంతా కాలేజీలో చేసిన రచ్చ, ప్రేమ స్టోరీలు.. ర్యాగింగ్‌.. ఇలా సరదాగా ఫస్టాఫ్‌ ముగుస్తుంది. ఇక సెకండాఫ్‌ కూడా ఫస్‌ డోస్‌ మరింత పెరుగుతుంది. వెన్నెల కోసం డీడీ తన టీమ్‌తో కలిసి లేడీస్‌ హాస్టల్‌కి వెళ్లి చేసే రచ్చ.. థియేటర్స్‌లో నవ్వులు పూయిస్తుంది.  వెన్నెల ఎవరై ఉంటారనే క్యూరియాసిటీని చివరకు కొనసాగించడంలో దర్శకుడు సఫలం అయ్యాడు. అయితే సినిమాలో కామెడీ వర్కౌట్‌ అయినంతగా ఎమోషన్స్ వర్కవుట్ కాలేదు.  అలాగే నార్నే నితిన్ ని కోసం యాక్షన్ సీక్వెన్స్ కూడా కథకు అతికినట్లుగా అనిపించాయి. బూతు డైలాగ్స్‌ ఫ్యామిలీ ఆడియన్స్‌కి కాస్త ఇబ్బందిగా అనిపించొచ్చు.  కానీ నవ్వులు పంచడంలో మాత్రం ఈ ‘మ్యాడ్‌’ గ్యాంగ్‌ సక్సెస్‌ అయింది. 
ఎవరెలా చేశారంటే..
ఈ సినిమాలో నటించవారంతా కొత్తవాళ్లే. అయినా ఈ విషయం తెరపై ఎక్కడా కనిపించారు. డీడీ పాత్రలో నటించిన సంగీత్‌ శోభన్‌..తనదైన కామెడీ టైమింగ్‌తో అదరగొట్టేశాడు. ఆయన నటన, డైలాగ్‌ డెలివరీ చాలా బాగున్నాయి.  అశోక్ గా నార్నే నితిన్ స్క్రీన్ ప్రెజన్స్ బాగుంది. యాక్షన్‌ సన్నివేశాల్లో అదరగొట్టేశాడు కానీ.. ఆ సీన్స్‌ కథకి అతికించినట్లుగా అనిపిస్తాయి. 

ఇక లవర్‌బాయ్‌ మనోజ్‌గా రామ్‌ నితిన్‌ చక్కగా నటించాడు. హీరోయిన్స్   శ్రీ గౌరీ, ప్రియా రెడ్డి, ఆనంతిక తమ తమ పాత్రల పరిధిమేర నటించారు. లడ్డు పాత్రలో ‘టాక్సీవాలా’ విష్ణు జీవించేశాడు. అమాయకత్వంతో ఆయన పండించిన కామెడీ సినిమాకు ప్లస్‌ అయింది. అనుదీప్ ఒక సీన్‌లో కనిపించి వెళ్తాడు.  కాలేజీ ప్రిన్సిపల్‌గా రఘుబాబు, అతని పీఏగా రచ్చ రవితో పాటు మిగిలిన నటీనటులు తమ పాత్రల పరిధిమేర నటించారు. 

టెక్నికల్‌ విషయాలకొస్తే.. భీమ్స్ సిసిరోలియోసి  పాటలు, నేపథ్య సంగీతం సినిమా స్థాయిని పెంచాయి. పాటలు కథలో భాగంగా సాగుతాయి. సినిమాటోగ్రఫీ బావుంది. నిర్మాణ విలువలు సినిమా స్థాయికి తగ్గట్లు ఉన్నతంగా ఉన్నాయి. 
-అంజిశెట్టి, సాక్షి వెబ్‌డెస్క్‌

Rating:  
(3/5)
మరిన్ని వార్తలు