Mahima Nambiar: సినీ పరిశ్రమలో మహిళలకు రక్షణ ఉందా? హీరోయిన్‌ ఆన్సరేంటంటే?

15 Sep, 2023 08:29 IST|Sakshi

సినిమా రంగంలో హీరోయిన్ల గురించి ఎప్పుడూ ఏదో ఒకరకమైన ప్రచారం జరుగుతూనే ఉంటుంది. ముఖ్యంగా అడ్జెస్ట్‌మెంట్‌ అనే పదం ఎక్కువగా వినిపిస్తుంటుంది. అడ్జెస్ట్‌మెంట్‌ అన్న విషయం గురించి పలువురు హీరోయిన్లు ప్రస్తావిస్తూ వచ్చారు. తమకు అలాంటి అనుభవం ఎదురు కాలేదనే చాలామంది చెబుతుంటారు. నటి మహిమా నంబియార్‌ కూడా ఇందుకు అతీతం కాదు. ఈ కేరళ భామ మోడలింగ్‌ నుంచి చిత్ర రంగ ప్రవేశం చేసింది.

15 ఏళ్ల వయసులోనే అంటే 2010లోనే మాతృభాషలో నటిగా పరిచయం అయ్యింది. ఆ విధంగా ఈమె నట వయస్సు 13 ఏళ్లు. 2012లో సాట్టై చిత్రం ద్వారా కోలీవుడ్‌కు ఎంట్రీ ఇచ్చింది. ఆ చిత్రం మంచి విజయాన్ని సాధించడంతో ఇక్కడ మహిమ నంబియార్‌కు వరుసగా అవకాశాలు రావడం మొదలుపెట్టాయి. అలా మలయాళంలో కంటే తమిళంలోనే ఎక్కువ చిత్రాలలో నటిస్తోంది. ప్రస్తుతం ఈమె రాఘవ లారెన్స్‌కు జంటగా నటించిన చంద్రముఖి–2 ఈనెల 28న తెరపైకి రానుంది.

అదే విధంగా విజయ్‌ ఆంటోని సరసన నటించిన రత్తం, ముత్తయ్య మురళీధరన్‌ బయోపిక్‌గా తెరకెక్కిన '800' చిత్రాలు కూడా అక్టోబర్‌ 6వ తేదీన విడుదలకు సిద్ధమయ్యాయి. ఈ సందర్భంగా ఒక ఇంటర్వ్యూలో ఈమె మాట్లాడుతూ.. క్రికెట్‌ క్రీడాకారుడు ముత్తయ్య జీవిత చరిత్రతో రూపొందిన 800 చిత్రంలో తాను ఆయన భార్య మదిమలర్‌గా నటించినట్లు చెప్పింది. ఇందులో తన పాత్ర చిన్నదే అయినా ఈ చిత్రం తనకు చాలా స్పెషల్‌ అని పేర్కొంది. ముత్తయ్య మురళీధరన్‌ ఒక క్రికెట్‌ క్రీడాకారుడిగానే అందరికీ తెలుసని, అయితే ఆయన జీవితంలో ఎన్నో కష్టాలను అనుభవించారని, అలా ఆయనలోని రియల్‌ కోణాన్ని చూపించే చిత్రమే 800 అని చెప్పింది.

ఇకపోతే చంద్రముఖి –2 చిత్రంలో రాఘవ లారెన్స్‌ మాస్టర్‌కు జంటగా నటించడం మంచి అనుభవంగా పేర్కొంది. మలయాళం, తెలుగు భాషల్లో తన సినీ పయనం సాగుతున్నా, ప్రస్తుతానికి మలయాళంలో ఏ చిత్రం చేయడం లేదని చెప్పింది. సినిమా పరిశ్రమలో మహిళలకు రక్షణ ఉందా? అని అడుగుతున్నారని అయితే ఇతరుల గురించి తాను చెప్పలేనని తన వరకైతే మాత్రం ఎలాంటి చేదు అనుభవం ఎదురుకాలేదని ఆమె తెలిపారు.

A post shared by Mahima Nambiar (@mahima_nambiar)

చదవండి: లావణ్య త్రిపాఠి రూట్‌లో కృతి శెట్టి.. పెళ్లిపై నిజమెంత?

మరిన్ని వార్తలు