Manoj Bajpayee: సౌత్‌ బ్లాక్‌బస్టర్స్‌ వారికి వెన్నులో వణుకు పుట్టిస్తున్నాయి

29 Apr, 2022 09:17 IST|Sakshi

సౌత్‌ సినిమాలపై బాలీవుడ్‌ ప్రముఖ నటుడు మనోజ్‌ బాజ్‌పాయ్‌ ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు. పుష్ప, కేజీఎఫ్‌ చాప్టర్‌ 2, ఆర్‌ఆర్‌ఆర్‌ సినిమా విజయాలు బాలీవుడ్‌ దర్శకనిర్మాతలకు వెన్నులో వణుకు పుట్టిస్తున్నాయని వ్యాఖ్యానించాడు. కరోనా వైపరీత్యం తర్వాత రిలీజైన 'పుష్ప' డబ్బింగ్‌ వర్షన్‌ హిందీలో రూ.106 కోట్ల గ్రాస్‌ సాధిస్తే ఆర్‌ఆర్‌ఆర్‌, కేజీఎఫ్‌ 2.. బాలీవుడ్‌లో తలా రూ.300 కోట్లను అవలీలగా రాబట్టాయి. కానీ అక్కడి హిందీ సినిమాలు మాత్రం వందల కోట్లను వసూళ్లు చేయడంలో వెనకబడుతున్నాయి.

దీనిపై మనోజ్‌ బాజ్‌పాయ్‌ ఢిల్లీ టైమ్స్‌తో మాట్లాడుతూ.. 'ఈమధ్య కాలంలో ఎన్నో బ్లాక్‌బస్టర్లు వచ్చాయి. ఇది చూసి హిందీ ఇండస్ట్రీలో పనిచేసే ఫిలింమేకర్స్‌ భయపడిపోతున్నారు. వాళ్లకు ఏం చేయాలో కూడా తోచడం లేదు. కానీ ఒకరకంగా ఇది బాలీవుడ్‌కు గుణపాఠం నేర్పింది. దీన్నుంచి తప్పకుండా ఎంతో కొంత నేర్చుకోవాలి. సౌత్‌ వాళ్లు సినిమా పట్ల ఎంతో ప్యాషన్‌తో పని చేస్తారు. తీసే ప్రతి సన్నివేశం కూడా ఈ ప్రపంచంలోనే బెస్ట్‌ సీన్‌గా ఉండాలన్న తపనతో తీస్తారు.'

'పుష్ప, కేజీఎఫ్‌, ఆర్‌ఆర్‌ఆర్‌ సినిమాలు చూసినట్లయితే ఎలాంటి లోటుపాట్లు లేకుండా క్లీన్‌గా కనిపిస్తాయి. ప్రతి ఫ్రేమ్‌ కూడా ఎంతో నిబద్ధతతో తీసినట్లు సులువుగా అర్థమవుతుంది. ఈ అంకితభావం మనదగ్గర(హిందీలో) లేదు. మనం ఎప్పుడూ బాక్సాఫీస్‌ కలెక్షన్ల గురించి ఆలోచించామే తప్ప మనల్ని మనం విమర్శించుకోలేదు. అందుకే ఆ సినిమాలు విభిన్నమైనవి అని వేరు చేసి మాట్లాడుతున్నాము. కానీ ఇది కచ్చితంగా ఒక గుణపాఠం. తప్పకుండా దీన్నుంచి మెళకువలు నేర్చుకోవాల్సిందే' అని చెప్పుకొచ్చాడు.

చదవండి: అప్పుడే ఓటీటీకి సమంత ‘కణ్మనీ రాంబో ఖతీజా’!, స్ట్రీమింగ్‌ ఎక్కడంటే..

ఏంటి, పుష్ప 2 సినిమాకు బన్నీ అన్ని కోట్లు తీసుకుంటున్నాడా?

మరిన్ని వార్తలు