ఇలాగైతే... ఎలా మాస్టర్‌?

14 Jan, 2021 00:03 IST|Sakshi

రివ్యూ టైమ్‌

చిత్రం:‘మాస్టర్‌’
తారాగణం: విజయ్, విజయ్‌ సేతుపతి
మాటలు: రాజేశ్‌ ఎ. మూర్తి
కథ, స్క్రీన్‌ ప్లే, దర్శకత్వం: లోకేశ్‌ కనకరాజ్‌
రిలీజ్‌: జనవరి 13

దాదాపు ఏణ్ణర్ధం శ్రమ... లాక్‌ డౌన్‌ అనంతర ప్రపంచంలో తమిళనాట విడుదలవుతున్న తొలి బిగ్‌ బడ్జెట్, బిగ్‌ రిలీజ్‌ ఫిల్మ్‌! తమిళంలో తయారై, తెలుగులోనూ రిలీజైన విజయ్‌ ‘మాస్టర్‌’ చిత్రం గురించి చెప్పుకోవడానికి ఎన్నో ఉన్నాయి. ప్రస్తుతం తమిళ సూపర్‌ స్టార్లుగా వెలుగుతున్న హీరో విజయ్, విలక్షణ నటుడు సేతుపతి ప్రత్యర్థులుగా రూపొందిన చిత్రం ఇది. కానీ ఆ స్టార్లు మినహా ‘మాస్టర్‌’లో ఇంకేముందంటే జవాబు కష్టం.

కథేమిటంటే..: వరంగల్‌లో చిన్నప్పుడే కొందరు దుర్మార్గుల వల్ల తల్లితండ్రులను కోల్పోయి, పిల్లల జైలులో పెరిగి, కసి కొద్దీ దుష్టుడిగా మారిన వ్యక్తి భవాని (విజయ్‌ సేతుపతి). ఆ బాల నేరస్థుల అబ్జర్వేషన్‌ హోమ్‌లోని వాళ్ళందరికీ గంజాయి, మందు అలవాటు చేసి, అసాంఘిక కార్యకలాపాలకు వాడుకుంటూ ఉంటాడు. మరోపక్క స్టూడెంట్స్‌ ప్రేమించే ఓ కాలేజీ ప్రొఫెసర్‌ జె.డి. (విజయ్‌). ఆ పిల్లల జైలును ఒక దారిలో పెట్టే పని అనుకోకుండా ఆ మాస్టర్‌ చేతిలో పడుతుంది. అక్కడ అతనికి ఎదురైన అనుభవాలు, మద్యానికి బానిసైన హీరోలో వచ్చిన మార్పు, చివరకు అతను భవాని ఆట కట్టించిన తీరు – మూడు గంటల ‘మాస్టర్‌’ చిత్రం.

ఎలా చేశారంటే..: హీరో విజయ్‌ తన స్టార్‌ హోదాకు తగ్గట్లు నటించారు. సినిమానంతా తన భుజాల మీద తీసుకెళ్ళడానికి ప్రయత్నించారు. అలాగే, సేతుపతి విలన్‌ పాత్రను తనదైన పద్ధతిలో పండించారు. కానీ, ఇమేజ్‌ను దృష్టిలో పెట్టుకొని రాసుకున్న సీన్లలో ఉన్నంత బిల్డప్‌ స్క్రిప్టులో, సినిమాలో లేకపోవడం విషాదం. హీరోకు ప్రత్యేకించి హీరోయినంటూ లేని ఈ సినిమాలో మాళవికా మోహనన్‌ ఉన్నంతలో హీరోయిన్‌ అనుకోవాలి. బాణాలు పట్టుకొని, నటి ఆండ్రియా ఎదురవుతారు. కానీ, ఈ నటీమణులెవరివీ కీలకపాత్రలు కాకపోవడం విచిత్రం.

ఎలా తీశారంటే..:  గతంలో సందీప్‌ కిషన్‌తో ‘నగరం’, కార్తీతో ‘ఖైదీ’ లాంటి చిత్రాలు అందించిన దర్శకుడు లోకేశ్‌ కనకరాజ్‌కు ఇది ముచ్చటగా మూడో సినిమా. మొదటి రెండు సినిమాలనూ కథ, కథన బలాలతో నడిపించిన ఈ యువ దర్శకుడు ఈసారి మాత్రం ‘మాస్టర్‌’ కథను రాసుకోవడంలో, తీయడంలో రాజీపడ్డట్టుంది. సేతుపతి, విజయ్‌– ఇలా ఇద్దరు హాట్‌ స్టార్లను తీసుకున్నాక, ఇమేజ్‌ను బ్యాలెన్స్‌ చేస్తూ, వారిని కథలో ఇరికించడానికే ఎక్కువ ఎనర్జీ పెట్టినట్టుంది. వెరసి, ఫ్యాన్స్‌ను దృష్టిలో పెట్టుకొని, ‘మాస్టర్‌’గా కాకుండా మా ‘స్టార్‌’గా తీశారు. అదే ఈ సినిమాకు పెద్ద బలహీనత. అలాగే, తెర మీది భావోద్వేగాలను కథలా చూపడమే తప్ప, ప్రేక్షకులు కనెక్ట్‌ అయ్యేలా తీర్చిదిద్దడంలోనూ డైరెక్టర్‌ ఫెయిలయ్యారు.

విలన్, హీరోల పరిచయానికే అరగంట తీసుకున్న ఈ సినిమాలో అసలు కథ కన్నా పాత్రల ఎస్టాబ్లిష్‌ మెంట్, ప్రతి సన్నివేశానికీ బిల్డప్పులపైనే శ్రద్ధ పెట్టారు. మంచివాడిగా మొదలై పిల్లల జైలులో చెడ్డవాడిగా ఎదిగిన విలన్‌ లక్ష్యంలో క్లారిటీ లేదు. హీరో ఎందుకు తాగుబోతుగా మారాడో అర్థం కాదు. తాగుడు మానేసిన సీన్, సందర్భం కూడా కన్విన్సింగ్‌గా అనిపించదు. తమిళనాట విజయ్‌ రాజకీయ ఆకాంక్షలకు అనుగుణంగా పొలిటికల్‌ డైలాగు లూ అక్కడక్కడా ఉన్నాయి.

గతంలో కార్తీ ‘ఖైదీ’, తెలుగులో వై.ఎస్‌.ఆర్‌. బయోపిక్‌ ‘యాత్ర’ లాంటి వాటికి పనిచేసిన సత్యన్‌ సూర్యన్‌ కెమేరా వర్క్‌ బాగుంది. పి.సి. శ్రీరామ్‌ శిష్యుడైన సత్యన్‌ ఈసారి కూడా నైట్‌ ఎఫెక్ట్‌ షాట్స్, యాక్షన్‌ పార్టుల లాంటివి బాగా తీసినా, దాదాపు 3 గంటల క్లాసు పీకిన ‘మాస్టర్‌’ను అవి గట్టెక్కించలేవు. ప్రత్యేకించి హీరో – హీరోయిన్లకు డ్యూయట్లు, చెప్పుకోదగ్గ పాటలేవీ లేకుండా నేపథ్య సంగీతం మీదే ఆధారపడడంతో, ఈ సినిమాకు కొలవెరి ఫేమ్‌ అనిరుధ్‌ సంగీతం పరిస్థితీ అంతే. ఇక, విజయ్‌ చేసిన ‘గిల్లీ’ (మహేశ్‌ ‘ఒక్కడు’కు తమిళ రీమేక్‌)లోని కబడ్డీ సీన్‌ స్ఫూర్తితో ఈ సినిమాలోనూ తీసిన కబడ్డీ ఫైట్‌ లాంటి యాక్షన్‌ సీన్స్‌ బాగున్నాయి. అయితే, రాసుకున్న కథలో, తీస్తున్న విధానంలోనే దమ్ము లేనప్పుడు ఇవి ఎన్ని ఉన్నా ఏం లాభం! వెరసి, ఎంత ఇమేజ్‌ ఉన్నప్పటికీ స్టార్‌ ఈజ్‌ నాట్‌ బిగ్గర్‌ దేన్‌ సినిమా అనే పాఠం ఈ ‘మాస్టర్‌’ గట్టిగా చెబుతుంది. స్క్రిప్టు గనక బలంగా లేకపోతే, స్టార్లున్నా... నో యూజ్‌ మాస్టర్‌!!

కొసమెరుపు: అన్నట్టు... మూడు గంటల క్లాసు తెరపై చూపించాక, విలన్‌పై విజయం సాధించిన హీరో ‘‘దూల తీరిపోయింది’’ అంటాడు. హాలులో నుంచి బయటకొస్తున్న జనం మనసులో మాట హీరోకి ఎలా తెలిసిందబ్బా?

బలాలు:
సేతుపతి, విజయ్‌ల స్టార్‌ పవర్‌
మెరిసే యాక్షన్, కెమేరా వర్క్‌

బలహీనతలు:
í్రÜ్కప్టును మింగేసిన స్టార్‌ ఇమేజ్‌
నీరసమైన కథ, నిదా...నమైన కథనం 
హీరో, విలన్‌ మినహా అన్నీ అప్రధాన పాత్రలే
వినోదం, పాటలు కొరవడడం

– రెంటాల జయదేవ  

మీ అభిప్రాయాలను కింద తెలపండి

Read latest Movies News and Telugu News
Follow us on FaceBook, Twitter, Instagram, YouTube
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి
Load Comments
Hide Comments

మరిన్ని వార్తలు