Neha Kakkar: ఒకప్పుడు ఇండియన్‌ ఐడల్‌లో పార్టిసిపెంట్‌..

8 Sep, 2021 09:26 IST|Sakshi

‘‘వాళ్లు తొక్కేస్తున్నారు వీళ్లు తొక్కేస్తున్నారు అందుకే కెరియర్‌లో ఎదగలేకపోతున్నాను. నాకు ఎటువంటి బ్యాక్‌గ్రౌండ్‌ లేదు, ఫీల్డ్‌లో గాడ్‌ ఫాదర్‌లాంటి వాళ్లు ఎవరూ లేరు’’ అంటూ రకరకాల సాకులతో తమలోని ప్రతిభను గుర్తించకుండా నిరాశపడుతుంటారు కొందరు. కానీ ప్రతిభ ఉంటే పాతాళంలో ఉన్నా పైకి ఎదిగి పాపులర్‌ అవచ్చని ప్రముఖ గాయని నేహాకక్కడ్‌ జీవితం ఉదాహరణగా నిలుస్తోంది. 

నేహాకక్కడ్‌.. ఈ పేరు తెలియని వారు ఉండరేమో. ఈ మధ్యకాలంలో బాలీవుడ్‌లో వచ్చే ప్రతి సినిమాలో నేహా కక్కడ్‌ పాడిన పాట ఒకటి ఉండాల్సిందే. ఆమె పాడిన ప్రతిపాట సూపర్‌ హిట్‌ కావడం విశేషం. దేశంలోనే పాపులర్‌ సింగర్‌గా వెలిగిపోతున్న నేహా అదృష్టంతోనో, గాడ్‌ఫాదర్‌ల అండతోనో ఎదగలేదు. స్వయంకృషితో ఒక్కో మెట్టు ఎదుగుతూ దేశంలోనే అత్యధిక పారితోషికం అందుకుంటోన్న మహిళా గాయనిగా నిలుస్తోంది.

సమోసాలు విక్రయిస్తూ..
ఉత్తరాఖండ్‌లోని మధ్యతరగతి కుటుంబానికి చెందిన అమ్మాయి నేహా కక్కడ్‌. రిషీకేష్‌లో పుట్టిన నేహాకు ఒక అక్క(సోను కక్కడ్‌), తమ్ముడు (టోనీ కక్కడ్‌)లు ఉన్నారు. తండ్రి స్కూల్, కాలేజీల బయట సమోసాలు విక్రయించి కుటుంబాన్ని పోషించేవారు. తల్లి గృహిణి. ఒక చిన్నగదిలో కుటుంబం అంతా సర్దుకుపోయి జీవించేవారు. కుటుంబ ఆర్థిక పరిస్థితులు అంతంత మాత్రంగా ఉండడంతో నాలుగేళ్ల వయసులోనే నేహా పాడడం మొదలు పెట్టింది. తన అక్క, తమ్ముడుతో కలిసి వివిధ ధార్మిక కార్యక్రమాల్లో కీర్తనలు పాడడానికి వెళ్లేవాళ్లు. అక్కడ వచ్చే కొద్దిపాటి పారితోషకాన్ని ఇంటి ఖర్చులకు వినియోగిస్తూ తండ్రికి చేదోడుగా ఉండేది.

నేహా కీర్తనలు విన్నవారు మెచ్చుకుంటుండడంతో గాయనిగా ఎదిగేందుకు రుషీకేష్‌ నుంచి ఢిల్లీకి కుటుంబం మొత్తం మకాం మర్చారు. అక్కడ కూడా రోజుకు నాలుగైదు కార్యక్రమాల్లో పాల్గొని భజన కీర్తనలు పాడేది. అలా కీర్తనల ద్వారా ఆదాయంతోపాటు, గాత్రాన్నీ మెరుగు పరుచుకుంది. నేహాతోపాటు సోను, టోనీ కక్కడ్‌లు కూడా మంచిగా పాటలు పాడేవారు. సోను బాబూజీ జర దీరే చాలో పాటతో కెరియర్‌ను ప్రారంభించింది. తన గొంతుకు జానపదాన్ని జోడించడంతో పాట బాగా పాపులర్‌ అయింది. 


నేహాకక్కడ్‌ ది రాక్‌ స్టార్‌...
అక్క పాటకు మంచి స్పందన లభించడం చూసిన నేహా తన తమ్ముడితో కలిసి 2006లో ముంబై వెళ్లి ఇండియన్‌ ఐడల్‌ సీజన్‌–2లో పాల్గొంది. కానీ కొన్ని రౌండ్లలోనే ఎలిమినేట్‌ అయ్యి వెంటనే వెనుతిరిగింది. ఎలాగైనా తన గొంతు అందరికీ చేరాలన్న పట్టుదలతో సొంతంగా ఆల్బమ్స్‌ చేయడం ప్రారంభించింది. అప్పుడు నేహా వయసు పదహారు. 2008లో మీట్‌ బ్రదర్స్‌ మ్యూజిక్‌తో ‘నేహాకక్కడ్‌ ద రాక్‌స్టార్‌’ పేరిట తొలి ఆల్బమ్‌ను విడుదల చేసింది. దీనికి పెద్దగా పేరు రాకపోయినప్పటికీ నేహాను ఈ ప్రపంచానికి గాయనిగా పరిచయం చేసింది ఈ ఆల్బమ్‌.

తరువాత 2013లో బాలీవుడ్‌ సినిమా ‘ఫటా పోస్టర్‌ నిఖ్లాలో ‘ధాటింగ్‌ నాచ్‌’ పాట పాడింది. తరువాత హనీసింగ్‌తో కలిసి సానీసానీ (2014) పాట పాడింది దీంతో నేహాకు మంచి గుర్తింపు వచ్చింది. అక్కడి నుంచి నేహా వెనక్కి తిరిగి చూసుకోలేదు. క్వీన్‌  సినిమాలో థుమకడ’, హాయ్‌ రామా (మీరాబాయ్‌ నాట్‌ అవుట్‌), వు కేక్‌ పాల్‌ చైన కాల్‌ (నాట్‌ ఏ లవ్‌ స్టోరీ), సెకండ్‌ హ్యాండ్‌ జవానీ (కాక్‌టెయిల్‌), బోట్లా ఖోల్‌ (ప్రెగ్‌) జాదూ కీ జాపీ(రామయ్య వస్తావయ్యా), కాలా ఛష్మా, దిల్‌బర్‌ దిల్‌బర్, బద్రీకి దుల్హనియా, మనాలి ట్రాన్స్‌ వంటి హిట్‌ సాంగ్స్‌తో బాగా పాపులర్‌ అయ్యింది. ఇవేగాక బంగ్లాదేశ్‌ సినిమా అగ్నీ–2, కర్‌ మెయినే మ్యూజిక్‌ బజా, టుకుర్‌ టుకుర్, చిట్టా కుక్కడ్‌లతో ఆడియెన్స్‌ను ఉర్రూతలూగిస్తోంది. ఈరోజు హనీసింగ్, టోనీ కక్కడ్‌తో కలిసి  ‘కాంటా లాగా..’సాంగ్‌ను విడుదల చేయనుంది.

బెస్ట్‌ డ్యూయట్‌ వోకలిస్ట్‌
అతికొద్దికాలంలోనే తన గాత్రంతో ఇండియాలో ఉన్న ప్రముఖ గాయకుల జాబితాలో నేహా చేరింది. దీంతో ఏ ప్లాట్‌ఫామ్‌ మీద అయితే ఎలిమినేట్‌ అయ్యిందో అదే ప్లాట్‌ఫాంపై జడ్జిగా గౌరవాన్ని అందుకుంది నేహా. ఇండియన్‌  ఐడల్‌ 10, 11కు జడ్జిగా, కామెడీ సర్కస్‌ కే టెన్సీస్‌  ప్రోగ్రామ్, సారేగమాపా లిటిల్‌ చాంప్స్‌కు జడ్జ్‌గా వ్యవహరించింది. నేహా గాత్రానికి బెస్ట్‌ డ్యూయట్‌ వోకలిస్ట్‌(2017), ఫేవరెట్‌ జడ్జ్‌ అవార్డ్స్‌ (జీరిష్తే–2017) బాలీవుడ్‌ ట్రాక్‌ ఆఫ్‌ ద ఇయర్‌ (దిల్‌బర్‌)–2018, మిర్చి సోషల్‌ మీడియా ఐకాన్‌  ఆఫ్‌ ది ఇయర్‌(2020) అవార్డులు వరించాయి. ఇవేకాకుండా సామ్‌సంగ్, రియల్‌మి, గివ ఫ్యామిలీ, ఆర్గానిక్‌ హార్వెస్ట్‌ వంటి కంపెనీలకు బ్రాండ్‌ అంబాసిడర్‌గా చేసింది. 

సోషల్‌ మీడియా ఐకాన్‌
ఇన్‌స్టాగామ్‌లో 6.2 కోట్ల ఫాలోవర్స్‌తో సోషల్‌ మీడియా ఐకాన్‌ గా దూసుకుపోతోంది. అత్యధికంగా ఫాలోవర్స్‌ కలిగిన ఏకైక మహిళా గాయకురాలిగా నేహా నిలవడం విశేషం. యూట్యూబ్‌లో దాదాపు కోటీ ముప్ఫై లక్షలమంది ఫాలోవర్స్‌ ఉన్నారు. 
  

మరిన్ని వార్తలు