మిస్టరీగా వాణీ జయరాం మరణం.. హత్య చేశారా?

4 Feb, 2023 16:48 IST|Sakshi

ప్రముఖ గాయని వాణీ జయరాం(78) మృతిపై పలు అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి. ఆమె నుదురు, ముఖంపై తీవ్రగాయాలు ఉండడంతో అమెది సహజ మరణం కాదని.. ఎవరో హత్య చేసినట్లుగా పోలీసులు భావిస్తున్నారు. తొలుత ఆమె ఆప‌స్మార‌క స్థితిలో ప‌డి చనిపోయారని భావించారు. కానీ ఆమె ముఖంపై ఉన్న గాయాలు, పని మనిషి చెబుతున్న వివరాలు చూస్తుంటే వాణీ జయరాం మృతిపై అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి. పోలీసులు కూడా అనుమానస్పద మృతిగా కేసు నమోదు చేసుకొని.. ఆ దిశగా విచారణ చేస్తున్నారు. 

అసలేం జరిగింది?
చెన్నైలోని నుంగంబాకం ప్రాంతంలో నివాసం ఉంటున్న వాణీ జయరాం చనిపోయిన సమయంలో ఇంట్లో ఎవరూ లేరని పని మనిషి చెబుతున్నారు. శనివారం ఉదయం ఎప్పటి మాదిరిగానే ఇంట్లో పని చేసేందుకు పని మనిషి వాణీ జయరాం ఫ్లాట్‌కి వచ్చింది. తలుపులు మూసి ఉండడంతో కాలింగ్‌ బెల్‌ కొట్టారు. అయినా తలుపులు తీయలేదు. దాంతో పనిమనిషి భర్త తన ఫోన్‌లోంచి వాణీ జయరాం ఫోన్‌కు కాల్‌ చేశాడు.

అయినా ఆమె ఫోన్‌ లిఫ్ట్‌ చేయలేదు. అనుమానం వచ్చిన పనిమనిషి పోలీసులకు ఫోన్‌ చేసి, స్థానికుల సాయంతో గది తలుపులు బద్దలు కొట్టారు. లోపలికి వెళ్లి చూడగా అప్పటికే వాణీ జయరాం స్పృహ లేకుండా కింద పడిపోయి ఉన్నారు. వెంటనే ఆమెను ఆస్పత్రికి తరలించగా.. పరిశీలించిన వైద్యులు అప్పటికే  మృతి చెందారని నిర్ధారించారు. అయితే ఆమె ముఖంపై తీవ్ర గాయాలు ఉండడంతో ఎవరో కొట్టి చంపారని పోలీసులు భావిస్తున్నారు. పనిమనిషి చెప్పిన వివరాల మేరకు  కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. ఆమె ఫ్లాట్‌ను ఆధీనంలోకి తీసుకుని అన్ని ఆధారాలు సేకరిస్తున్నారు. సీసీ టీవి ఫుటేజీని పరిశీలిస్తున్నారు. వారం రోజులుగా ఏం జరిగిందనేది పోలీసులు ఆరా తీస్తున్నాన్నట్లు తెలుసోంది. ఆమె పేరుమీద ఏవైనా విలువైన ఆస్తులున్నాయా? ఎవరితోనైనా గొడవలు ఉన్నాయా? అనే దిశగా పోలీసులు విచారణ చేస్తున్నారు.

మరిన్ని వార్తలు