షూటింగ్స్‌ ప్రారంభించుకోండి!

24 Aug, 2020 01:39 IST|Sakshi
మంత్రి ప్రకాష్‌ జవదేకర్‌

కరోనా వల్ల ఏర్పడ్డ అనిశ్చితి అలానే ఉంది. సినిమా షూటింగ్స్‌ పరిస్థితి అయోమయంగా మారింది. ఒకటీ అరా తప్పిస్తే పెద్దగా షూటింగ్స్‌ జరుగుతున్న దాఖలాలు కనిపించడంలేదు. రాష్ట్ర ప్రభుత్వాలు ఆల్రెడీ చాలా వరకూ సినిమా, టీవీ చిత్రీకరణలకు అనుమతి ప్రకటించాయి. తాజాగా కేంద్రప్రభుత్వం కూడా సినిమా, టీవీ చిత్రీకరణలకు అనుమతి ఇచ్చింది. అలాగే ఆరోగ్య శాఖ సూచనల మేరకు కొన్ని గైడ్‌ లైన్స్‌ కూడా తయారు చేసింది. ఆ గైడ్‌ లైన్స్‌ ఈ విధంగా..

► కెమెరా ముందు ఉన్నప్పుడు తప్ప నటీనటులతో సహా సెట్‌లో ఉండే ప్రతీ ఒక్కరూ తప్పనిసరిగా మాస్క్‌ ధరించాలి.
► కాస్ట్యూమ్స్, విగ్, మేకప్‌ సామాన్లు ఒకరివి ఒకరికి వాడటం వీలైనంత తగ్గించేయాలి.
► చిత్రీకరణకు సంబంధించిన ప్రదేశాల్లో (కెమెరా ముందు కాకుండా) ఆరు అడుగులు భౌతిక దూరం తప్పనిసరిగా పాటించాలి.
► సెట్లో వీలైనన్ని చోట్ల హ్యాండ్‌ వాష్‌ చేసుకునే ఏర్పాటు చేయాలి. పని ప్రదేశాల్లో ఉమ్మేయడం నిషేధం.
► ఆరోగ్య సేతు యాప్‌ను (కోవిడ్‌ సోకిన వారికి మనం ఎంత దగ్గర/దూరంలో ఉన్నామో తెలియజేసే ప్రభుత్వం యాప్‌) అందరూ ఉపయోగించేలా చేయాలి.
► మెడికల్‌ టీమ్‌ను అందుబాటులో ఉంచాలి. మేకప్‌ గదులు, వ్యానిటీ వ్యాన్స్, బాత్‌రూమ్‌లను ఎప్పటికప్పుడు శానిటైజ్‌ చేయాలి.      
► సెట్లో అడుగుపెట్టే చోట థర్మల్‌ స్క్రీనింగ్‌ తప్పనిసరి. కోవిడ్‌ లక్షణాలున్న వారిని అనుమతించకూడదు.
► పార్కింగ్‌ ప్రదేశాల్లో జాగ్రత్తగా వ్యవహరించాలి. అక్కడ కూడా వీలైనంత దూరం పాటించగలిగేలా చూసుకోవాలి.
► వీలైతే కోవిడ్‌ జాగ్రత్తలను తెలిపే పోస్టర్లు, వీడియోలను ఏవీలు రూపంలో ప్రదర్శించగలగాలి.
► పని చేసిన ప్రదేశంలో ఎవరికైనా పాజిటివ్‌ అని నిర్ధారణ అయితే వెంటనే శానిటైజ్‌ చేయాలి.      
► అనారోగ్యం అనిపిస్తే వెంటనే టీమ్‌కు త్వరగా రిపోర్ట్‌ చేయాలి. అశ్రద్ధ చేయకూడదు.
► లొకేషన్‌లో తక్కువ మంది ఉండేలా చూసుకోవాలి. విజిటర్స్‌ను, ఆడియన్స్‌ను లొకేషన్‌లోకి అనుమతించకూడదు.
► స్టూడియోల్లో ఒకేసారి రెండు మూడు సినిమా యూనిట్లు ప్యాకప్‌ చెప్పకుండా టైమింగ్స్‌ విషయంలో జాగ్రత్తలుపడాలి.  
► సినిమా పరికరాల్ని ఉపయోగించే ప్రతి ఒక్కరూ గ్లౌజ్‌ ధరించాలి. మేకప్‌ ఆర్టిస్ట్‌లు, హైయిర్‌ డ్రెస్సర్‌లు తప్పనిసరిగా పీపీఈ కిట్లు ధరించాలి.

‘‘ఈ నిర్ణయాన్ని అందరూ గౌరవిస్తారని, ముఖ్యంగా సినిమాకు సంబంధించిన వాళ్లు హర్షిస్తారని అనుకుంటున్నాం. సినిమా అనేది ఆర్థిక వ్యవస్థకు చాలా కీలకమైనది. అలానే సినిమా ఎంతో మందికి ఉపాధి కలిగిస్తుంది. సినిమా నిర్మాణం అనేది పెద్ద వ్యవస్థ. ఇలాంటి వ్యవస్థ తిరిగి పుంజుకోవాలి, ఎప్పటిలానే మళ్లీ పరిగెత్తాలని షూటింగులకు ప్రభుత్వం అనుమతించింది’’ అన్నారు సమాచార మరియు ప్రసారశాఖ మంత్రి ప్రకాష్‌ జవదేకర్‌.

మరిన్ని వార్తలు