సలార్‌ VS డంకీ.. మొదటిసారి రియాక్ట్‌ అయిన ప్రశాంత్ నీల్

31 Dec, 2023 15:53 IST|Sakshi

'ఉగ్రం' సినిమాతో దర్శకుడిగా 2014లో కెరీర్ ప్రారంభించిన ప్రశాంత్ నీల్ ప్రస్తుతం సలార్ సక్సెస్‌తో ఫుల్‌ జోష్‌లో ఉన్నాడు. ‘ఉగ్రం’ తర్వాత మూడు సినిమాలే చేశాడు. కానీ ఆయన సినిమాలకు ఆదరణ మాత్రం చాలా ఎక్కువగా ఉంటుంది. కేజీఎఫ్ 1, 2 సినిమాల ద్వారా ఇండియన్ సినిమా మార్కెట్‌లో ఫేమస్ డైరెక్టర్‌గా పాపులారిటీ పెంచుకున్నాడు. ప్రశాంత్ నీల్ ప్రస్తుతం యాక్షన్ ప్యాక్డ్ మూవీ సలార్‌ను ప్రేక్షకుల ముందుకు తీసుకొచ్చి అదరగొట్టేస్తున్నాడు.

'కేజీఎఫ్' సిరీస్ సినిమాలతో ప్రేక్షకులను అలరించిన ప్రశాంత్ నీల్ ఇప్పుడు రెబల్ స్టార్ ప్రభాస్‌తో సలార్‌ తెరకెక్కించాడు. పృథ్వీరాజ్ సుకుమారన్, శృతి హాసన్ తదితరులు నటించిన సలార్ బాక్సాఫీస్ రికార్డులను బద్దలు కొడుతోంది. ఈ విజయం పట్ల దర్శకుడు ప్రశాంత్ నీల్ సంతోషం వ్యక్తం చేశాడు. ఇటీవల ఓ ఇంటర్వ్యూలో పాల్గొన్న దర్శకుడు.. తన సినిమాను ఆదరిస్తున్న ప్రేక్షకులకు ధన్యవాదాలు తెలిపారు. మరోవైపు సలార్‌ వర్సెస్‌ డంకీ ఫైట్‌పై సోషల్‌ మీడియాలో  జరుగుతున్న చర్చలపై ఆయన అసంతృప్తి వ్యక్తం చేశారు.

కొంతమంది అభిమానులు ఇద్దరు టాప్‌ హీరోల సినిమాల మధ్య గొడవలు పడుతుంటారు. 'నేను అలాంటి వాటిని ప్రోత్సహించను. అలాంటివి వినడానికి కూడా ఇష్టపడను. ఇలాంటి ట్రెండ్ సినిమా ఇండస్ట్రీకి ఏ మాత్రం మంచిది కాదు. కళాకారులు ఒకరితో ఒకరు పోటీపడరు. అందరూ చాలా స్నేహపూర్వకంగా ఉంటారు. ‘సలార్‌’, ‘డంకీ’ల మధ్య చాలా మంది అనుకుంటున్నట్లు ప్రతికూల వాతావరణం ఉండాలని నేనెప్పుడూ అనుకోలేదు. డంకీ నిర్మాతలు కూడా మనలాగే పాజిటివ్‌గా ఆలోచించాలి. మనమందరం ప్రేక్షకులను అలరించాలనుకుంటున్నాం. ఇది ఇద్దరు వ్యక్తుల మధ్య పోటీ ఉండే క్రికెట్ మ్యాచ్ కాదు.' అని తన అభిప్రాయాన్ని పంచుకున్నాడు. బాలీవుడ్‌లో సలార్‌ చిత్రానికి థియేటర్లు లేకుండా చేసిన కొందరు రివ్యూలు కూడా నెగటివ్‌గానే చెప్పడం జరిగింది.

సలార్ సినిమాను ఇంకా బాగా ప్రమోట్ చేస్తే బాగుంటుందని అలా చేసి ఉంటే మరింత వసూళ్లు వచ్చేవని కూడా వచ్చే ప్రశ్నలకు కూడా ఆయన ఇలా చెప్పారు. 'డంకీతో విడుదల కాకుండా మా సినిమా మాత్రమే విడుదలై ఉంటే ఇలాంటి వార్తలు వచ్చేవి కావు.' అని ప్రశాంత్‌ నీల్‌ అన్నారు. సలార్ చిత్రం డిసెంబర్ 22న తెలుగు, కన్నడ, తమిళం, మలయాళం, హిందీ భాషల్లో విడుదలయింది. ప్రపంచ బాక్సాఫీస్ వద్ద రూ. 600 కోట్ల మార్క్‌ను దాటింది. 

>
మరిన్ని వార్తలు