ఆమె ప్రేమే నన్ను మార్చింది!

29 Jan, 2023 04:15 IST|Sakshi

– రజనీకాంత్‌

సూపర్‌ స్టార్‌ రజనీకాంత్‌ ఏ వేడుకలో పాల్గొన్నా సినిమాల గురించే ఎక్కువగా మాట్లాడతారు. వ్యక్తిగత విషయాలు మాట్లాడిన దాఖలాలు దాదాపు లేవు. అలాంటిది ఇటీవల తన వ్యక్తిగత అలవాట్ల గురించి, తన భార్య లత కారణంగా తాను మారిన విషయం గురించి చెప్పి ఆశ్చర్యపరిచారు. రజనీకాంత్‌ మాట్లాడుతూ – ‘‘నేను బస్‌ కండక్టర్‌గా ఉద్యోగం చేస్తున్న సమయంలో మద్యం సేవించేవాడిని. ధూమపానం బాగా అలవాటు.

మాంసాహారం కూడా కాస్త ఎక్కువగానే తీసుకునేవాడిని. మద్యం–మాంసాహారం–సిగరెట్‌.. ఈ మూడూ మంచి కాంబినేషన్‌. అయితే ఈ చెడు అలవాట్లు ఉంటే 60 ఏళ్లకు పైన బతకరు. ఈ అలవాట్లు ఆరోగ్యానికి శ్రేయస్కరం కాదని, కొంతకాలం తర్వాత ఇవి మన అనారోగ్యానికి కారణమవుతాయని అనిపించింది. నా భార్య లత వల్లే నా చెడు అలవాట్లకు నేను దూరం కాగలిగాను. ఆమె తన ప్రేమతో నన్ను మార్చింది. లత ప్రేమ వల్లే ఇప్పుడు వీటికి దూరంగా ఉంటూ, క్రమశిక్షణతో కూడిన జీవితాన్ని గడుపుతున్నాను.

73ఏళ్లలోనూ నేనింత ఆరోగ్యంగా ఉండటానికి కారణం తనే. అందుకే నా భార్య లతకు ఎప్పటికీ రుణపడి ఉంటాను. అలాగే లతను నాకు పరిచయం చేసిన మహేంద్రన్‌ (లత బావ, నటుడు, రచయిత వైజీ మహేంద్రన్‌ని ఉద్దేశించి)కూ రుణపడి ఉంటాను’’ అని చెప్పుకొచ్చారు రజనీకాంత్‌. వైజీ మహేంద్రన్‌ రూ΄÷ందించిన ‘చారుకేశి’ నాటికకు సంబంధించిన వేడుకలో పాల్గొన్న రజనీ తన అలవాట్ల గురించి ఈ విధంగా చెప్పుకొచ్చారు. ఇక ప్రస్తుతం రజనీకాంత్‌ హీరోగా నెల్సన్‌ దిలీప్‌కుమార్‌ దర్శకత్వంలో ‘జైలర్‌’ సినిమా తెరకెక్కుతున్న సంగతి తెలిసిందే.

మరిన్ని వార్తలు