‘ఉపాధి’కి గడ్డు రోజులు? | Sakshi
Sakshi News home page

‘ఉపాధి’కి గడ్డు రోజులు?

Published Sun, Jan 29 2023 4:16 AM

Major Changes Possibility In Telangana MGNREGS Scheme - Sakshi

సాక్షి, హైదరాబాద్‌: త్వరలో ప్రవేశపెట్టనున్న కేంద్ర బడ్జెట్‌లో మహాత్మాగాంధీ జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకానికి కేటాయింపులు ఎలా ఉండబోతున్నాయనేది ప్రస్తుతం చర్చనీయాంశమైంది. వివిధ రాష్ట్రాల్లో బీజేపీయేతర ప్రభుత్వాలున్న చోట్ల ఈ పథకం సరిగా అమలు కావడం లేదని, చేపట్టిన పనులు సరిగా లేవని, నిధులు పక్కదారిపట్టడమో లేక వినియోగం సరిగా లేకపోవడమో జరుగుతోందన్న అభిప్రాయంతో కేంద్రం ఉన్న విషయం తెలిసిందే.

ఈ నేపథ్యంలోనే రాష్ట్రాల్లో పటిష్ట అమలు ద్వారా నిర్దేశిత లక్ష్యాల సాధన, కచ్చితమైన ప్రయోజనం కలిగేలా చేయాలన్న ఆలోచనతో ఆయా రాష్ట్రాల్లో పరిశీలనకు ఓ టాస్క్‌ఫోర్స్‌ను కేంద్రం నియమించింది. తెలంగాణ సహా వివిధ రాష్ట్రాల్లో అధ్యయనం పూర్తి చేసిన టాస్క్‌ఫోర్స్‌ ప్రధానమంత్రి కార్యాలయానికి నివేదిక సమర్పించినట్టు సమాచారం. ఈ నేపథ్యంలో వచ్చే ఆర్థిక సంవత్సరంలో ఈ పథకంలో భారీగా మార్పులు జరగొచ్చునని, తెలంగాణ సహా ఇతర రాష్ట్రాలకు చేసే బడ్జెట్‌ కేటాయింపులు కూడా తగ్గొచ్చునని నిపుణులు అంచనా వేస్తున్నారు. రాబోయే రోజుల్లో ఈ పథకానికి గడ్డురోజులు తప్పవనే అభిప్రాయాన్ని వ్యక్తం చేస్తున్నారు.  

రాష్ట్రానికి నిధులు తగ్గిపోతాయా? 
కేంద్రం రాష్ట్రానికి రెండేళ్ల క్రితం చేసిన కేటాయింపులతో పోల్చితే 2023–24 బడ్జెట్‌లో అధిక కేటాయింపులు ఉండక పోవచ్చునని అధికారులు అంచనా వేస్తున్నారు. ఉపాధి పనులకు హాజరయ్యే కూలీలకు.. నేషనల్‌ మొబైల్‌ మానిటరింగ్‌ సిస్టమ్‌ యాప్‌ ద్వారా లైవ్‌ లొకేషన్‌లో హాజరు నమోదును కేంద్ర గ్రామీణాభివృద్ధి శాఖ తప్పనిసరి చేసింది.

దీంతో పాటు కూలీలు, వారి కుటుంబాల జాబ్‌ కార్డులను వారి వారి ఆధార్‌ నంబర్లతో అథెంటికేషన్‌ చేయాలని ఆదేశించింది. లేనిపక్షంలో చేసిన పనికి కూలీ మొత్తం బ్యాంక్‌ ఖాతా ల్లో పడే అవకాశం లేదని స్పష్టం చేసింది. రాష్ట్రంలో ఎన్‌ఎంఎంఎస్‌ యాప్‌లో కూలీల హాజరు నమోదు క్షేత్రస్థాయిలో ఇబ్బందులెదురవుతున్నాయి. కూలీల జాబ్‌ కార్డులతో ఆధార్‌ అథెంటికేషన్‌ పూర్తికాలేదు. దీంతో నిధులు తగ్గే అవకాశం ఉందంటున్నారు.  

క్రమంగా తగ్గిపోతున్న కేటాయింపులు.. 
దేశవ్యాప్తంగా 2022 ఏప్రిల్‌–డిసెంబర్‌ల మధ్య 5.56 కోట్ల కుటుంబాలు ఈ పథకం కింద పనులు కోరాయి. అంతకుముందు ఏడాది అవే నెలలతో పోల్చితే కోటి కుటుంబాల మేర తగ్గుదల నమోదైంది. ఈ నేపథ్యంలోనే 2023–24 బడ్జెట్‌ కేటాయింపులు ఎలా ఉండబోతున్నాయనేది చర్చనీయాంశమైంది. 2019–20లో రూ.71,687 కోట్లు కేటాయించారు.

కానీ కరోనా మహమ్మారి పరిస్థితుల నేపథ్యంలో 2020–21లో రూ.1.11 లక్షల కోట్ల బడ్జెట్‌ కేటాయించారు. కానీ 2021–22కు వచ్చేసరికి రూ.98 వేల కోట్లకు, 2022–23లో రూ.73 వేల కోట్లకు దిగజారింది. ఈ నిధులు సరిపోకపోవడంతో సప్లిమెంటరీ గ్రాంట్ల కోసం గత డిసెంబర్‌లో కేంద్రానికి విజ్ఞప్తులు వెళ్లాయి. ఈ పరిస్థితుల్లోనే 2023–24 బడ్జెట్‌ పెరుగుతుందా లేదా అన్న సందిగ్థత నెలకొంది.    

తగ్గించే అవకాశమే ఉంది.. 
ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలోనే ఈ పథకం కింద చేసే ఖర్చును కేంద్రం తగ్గించింది. అందువల్ల వచ్చే ఆర్థిక ఏడాదిలో ఈ పథకానికి చావా రేవా? అన్న సమస్య ఉత్పన్నం కావొచ్చు. ఎన్‌ఎంఎంఎస్‌ యాప్‌ అమల్లోకి తీసుకురావడం, జాబ్‌కార్డులతో ఆధార్‌ అథెంటికేషన్‌ తప్పనిసరి వంటి వాటితో కూలీలు ఈ పథకం నుంచి దూరమవుతున్నారు. ఈ ఏడాది ఉపాధి హామీ పథకం కింద వ్యయం తక్కువైనందున, దానిని సాకుగా చూపి బడ్జెట్‌ కేటాయింపులు తగ్గించే అవకాశాలున్నాయి.

రాష్ట్రంలో ఈ పథకం కింద 2021– 22లో రూ.4 వేల కోట్లు ఖర్చు కాగా, 2022– 23లో రూ.2,087 కోట్ల వ్యయమే చేశారు. ఈ నేపథ్యంలో వివిధ పనుల కోసం ఇవ్వాల్సిన రూ.1,100 కోటను కూడా నిలిపేసింది. వచ్చే బడ్జెట్‌లో ఈ పథకానికి నిధులు ఎలా ఉంటాయోనన్న సందేహాలు వ్యక్తమవుతున్నాయి. 
– చక్రధర్‌ బుద్ధా, డైరెక్టర్, లిబ్‌టెక్‌ ఇండియా  

Advertisement
Advertisement