Anushka Sharma Breakup Story: అవమానంతో రణ్‌వీర్‌ ఆమెతో మాట్లాడ్డం మానేశాడు

25 Jul, 2021 08:36 IST|Sakshi

రణ్‌వీర్‌ సింగ్‌ ఎక్కడుంటే అక్కడ ఎనర్జీ ఉంటుంది.. 
దేన్నయినా సరదాగా తీసుకొని ముందుకెళ్లిపోవడమే తెలుసు అతనికి!
అనుష్కా శర్మ .. స్ట్రిక్ట్‌ అండ్‌ సీరియస్‌! బోల్డ్‌ అండ్‌ బ్యూటీఫుల్‌!
నిజానికి ఈ పరస్పర విరుద్ధమైన స్వభావాలు కలిస్తే అద్భుతమైన గ్రామర్‌ క్రియేట్‌ అయ్యేది ప్రేమకు!
కానీ స్వభావాలే గెలిచాయి కలవకుండా! ‘మొహబ్బతే’కు మరో బ్రేకప్‌ స్టోరీనిచ్చాయి.. 

Ranveer Singh&Anushka sharma Breakup Story: ఓ సినిమా స్క్రీనింగ్‌ జరుగుతోంది.. దానికి రణ్‌వీర్‌ సింగ్, అనుష్కా శర్మ హాజరయ్యారు. అందరూ సీరియస్‌గా సినిమాలో లీనమయ్యారు. ఇంతలోకి ఒక ప్రేక్షకుడు లేచి అనుష్కా దగ్గరకి వచ్చి మోకాళ్ల మీద వంగి ‘మీరంటే నాకు చాలా ఇష్టం. రబ్‌ నే బనాదీ జోడీ చూసి పిచ్చి ఫ్యాన్‌ అయిపోయా మీకు’ అన్నాడు ఉద్విగ్నంగా!
ఊహించని ఆ చర్యకు అనుష్కా ముందు కంగారు పడ్డా ఆ అభిమాన్నాన్ని ఆస్వాదిస్తూ ‘ఇప్పటికీ ఇష్టపడుతున్నావా?’ అని అడిగింది అతన్ని. ‘ఇప్పటికీ.. ఎప్పటికీ’ అన్నాడా ఫ్యాన్‌ తన గుండె మీద చేయి వేసుకుంటూ!

ఈ సీన్‌ చిరాకు తెప్పించింది ఆమె పక్కనే కూర్చున్న రణ్‌వీర్‌కు. ఒకింత కోపాన్నీ కూడా! వెంటనే అతని మీద విరుచుకుపడ్డాడు ‘ఎవరితో మాట్లాడుతున్నావో తెలిసే మాట్లాడుతున్నావా? ఆమె నా గర్ల్‌ఫ్రెండ్‌! ఇష్టం గిష్టమంటూ వాగితే మూతి పగులుతుంది జాగ్రత్త’ అంటూ! 
రణ్‌వీర్‌ ప్రతిస్పందనకు అక్కడున్న వాళ్లంతా హతాశులయ్యారు అనుష్కా సహా!


∙∙ 
2011 .. ఐఫా అవార్డ్స్‌ ఫంక్షన్‌..
సోనాక్షీ సిన్హాతో కలసి ఆ ఫంక్షన్‌ను హోస్ట్‌ చేస్తున్నాడు రణ్‌వీర్‌. సరదా సంభాషణలు, మాటల చమక్కులు, జోకులతో ఆ వేడుకను రక్తి కట్టిస్తోందా జంట. ప్రేక్షకుల ఉత్సాహం చూసి రణ్‌వీర్‌ కాస్త చొరవ తీసుకున్నాడు సోనాక్షీ దగ్గర. దానికి ఆమేమీ ఇబ్బంది పడలేదు కానీ నటుల గ్యాలరీలో కూర్చున్న అనుష్కాకు మాత్రం ఇబ్బంది అనిపించింది. లేచి గ్రీన్‌ రూమ్‌లోకి వెళ్లి వేదిక మీదున్న  రణ్‌వీర్‌ను పిలిపించింది.. ‘సోనాక్షీతో నీ వేషాలేంటీ? హద్దులో ఉండి హోస్ట్‌ చేయలేవా?’ అంటూ గట్టిగా అరిచింది అతని మీద అక్కడున్న అందరి ముందూ.  చిన్నబుచ్చుకున్నాడు.. ఆవేశంతో ముక్కుపుటాలదరించాడు.. అవమానంతో ఆమెతో మాట్లాడ్డం మానేశాడు. ఆ మానేయడం కొన్నాళ్లపాటు సాగింది. దాంతో ఆ స్నేహం.. ప్రేమ బ్రేక్‌ అయిపోయాయి. 

అవును వాళ్లిద్దరూ ఇష్టపడ్డారు...
రణ్‌వీర్‌ తొలి చిత్రం బ్యాండ్‌ బాజా బారాత్‌. అందులో కథానాయిక అనుష్కా. ఆ  సెట్స్‌ మీదే  వాళ్ల ప్రేమ మొదలైంది. నవ్వుతూ.. తుళ్లుతూ తన చుట్టూ వాతావరణాన్ని వైబ్రెంట్‌గా మార్చే రణ్‌వీర్‌.. మొదటి పరిచయంలోనే తెగ నచ్చేశాడు అనుష్కాకు. ఆమె స్వచ్ఛమైన నవ్వు.. ముక్కుసూటి తనం అతనికీ ఇష్టమయ్యాయి. ఊసులతో కాలక్షేపమే కాదు  ‘ఈ ప్రేమ.. మనకు బలమవ్వాలే తప్ప బలహీనతగా మారకూడదు’ అంటూ బాసలూ చేసుకొని కెరీర్‌ వైపు కార్యోన్ముఖులూ అయ్యారు.   

ఆ జంట లవ్‌స్టోరీ స్టార్ట్‌ అయ్యేనాటికి అనుష్కా బాలీవుడ్‌లో నిలదొక్కుకుంది.. రణ్‌వీర్‌ది ఇంకా స్ట్రగ్లింగే! అయినా ఒకరినొకరు అర్థం చేసుకుంటూ.. సపోర్ట్‌ ఇచ్చుకుంటూ ప్రేమను కాపాడుకోసాగారు. కాగితం మీద రాసుకున్నంత.. గ్రాఫ్‌ గీసుకున్నంత సాఫీగా ఉండదు కదా ప్రాక్టికాలిటీ! అది ఆ ఇద్దరికీ ఇంకో సినిమా చూపించింది. వాళ్ల నిలకడ, సహనం, భద్రతకు పరీక్ష పెట్టింది.  ముందు చెప్పుకున్న సంఘటనలే దానికి ఉదాహరణలు. ఇద్దరూ ఓడిపోయారు. ఒకే లక్షణంతో. దాన్ని అందరికీ అర్థమయ్యే ‘అభద్రత’ అనుకోవచ్చు.. ప్రేమ భాషలో ‘పొసెసివ్‌నెస్‌’గానూ చెప్పుకోవచ్చు. 

ఆ ఇద్దరి మధ్య కొనసాగిన మౌనమే బ్రేకప్‌గా స్థిరపడిపోయింది. ఎవరి కెరీర్‌ గొడవల్లో  వాళ్లు పడి  ఆ ‘సైలెన్స్‌’ డ్యూరేషన్‌ను పొడిగించారు. తర్వాత రణ్‌వీర్‌ ఇంకో తోడును వెదుక్కున్నాడు.. అనుష్కాకూ ఇంకో చెలికాడితో జత కుదిరింది. 

అయితే రణ్‌వీర్‌ చాలా సందర్భాల్లో అనుష్కాను మిస్‌ అయినట్టు ఒప్పకున్నాడు. 2013లో ఓ ప్రధాన పత్రికకు ఇచ్చిన ఇంటర్వ్యూలో అతను  ‘యెస్‌ ఐ మిస్‌ హర్‌. అనుష్కాను  చాలా మంది అపార్థం చేసుకుంటారు కానీ తనలాంటి ఆనెస్ట్‌ పర్సన్‌ని నేనెక్కడా చూడలేదు. మనసులో ఉన్నదే మాటల్లో చెబుతుంది. చేతల్లో చూపిస్తుంది.  నా గురించి నెగెటివ్‌గా రాసినా ఆవేశపడను కానీ.. అనుష్కా గురించి ఒక్క నెగటివ్‌ ఆర్టికల్‌ చదివినా కోపంతో రగిలిపోతాను. ఆమె అంటే నాకు చాలా అడ్మిరేషన్‌. షి ఈజ్‌ వన్‌ ఆఫ్‌ ది ప్యూరెస్ట్‌ అండ్‌ ఆనెస్ట్‌ పీపుల్‌’ అని చెప్పాడు. ఇప్పటికీ రణ్‌వీర్‌.. ఆమె అంటే అంతే గౌరవంతో ఉన్నాడు. అనుష్కా కూడా స్నేహభావంతోనే ఉంది. ఎక్కడ ఎదురుపడ్డా సాదరంగా పలకరిస్తుంది. 
∙ఎస్సార్‌

Read latest Movies News and Telugu News
Follow us on FaceBook, Twitter, Instagram, YouTube
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి
మరిన్ని వార్తలు