ట్రోలింగ్‌: నీకు 60 ఏళ్లా? వ్యాక్సిన్‌ తీసుకున్నావ్‌..

6 Mar, 2021 18:40 IST|Sakshi

దేశ వ్యాప్తంగా కరోనా వ్యాక్సినేషన్‌ కార్యక్రమం వేగవంతంగా కొనసాగుతోంది. మొదటి విడతలో కరోనా వారియర్లకు మాత్రమే వ్యాక్సిన్ అందించారు. మార్చి 1 నుంచి ప్రారంభమైన రెండో విడతలో భాగంగా 60 ఏళ్లకు పైబడిన వారందరి, 45-59 ఏళ్ల వారిలో దీర్ఘకాలిక వ్యాధిగ్రస్తులకు వ్యాక్సినేషన్ అందిస్తున్నారు. దీంతో సాధారణ ప్రజలతోపాటు సెలబ్రిటీలు కూడా వ్యాక్సీన్ వేయించుకుంటున్నారు. ఈ క్రమంలో బాలీవుడ్‌ స్టార్‌ హీరో సైఫ్‌ అలీ ఖాన్‌ వ్యాక్సిన్‌ మొదటి డోస్‌ వేసుకున్నారు. ఇటీవల ముంబైలోని బాంద్రాలో వ్యాక్సిన్‌ తీసుకొని బయటకు వస్తుండగా కెమెరాల కంటికి చిక్కారు. 

అయితే సైఫ్‌ వ్యాక్సిన్‌ వేసుకోవడంపై పలువురు అభ్యంతరం వ్యక్తం చేస్తున్నారు. సోషల్‌ మీడియా వేదికగా నెటిజన్లు విమర్శలు గుప్పిస్తున్నారు. సైఫ్‌కు 60 ఏళ్లు పూర్తి చేసుకున్నాడా అని ప్రశ్నిస్తున్నారు. కాగా సైఫ్‌ వ్యాక్సినేషన్‌పై ఆయన అభిమానులు మాత్రంం సానుకూలంగా స్పందిస్తున్నారు. 60 ఏళ్లు పైబడిన వ్యక్తులతోపాటు 45 నుంచి 59 ఏళ్ల మధ్య గల దీర్ఘకాలిక వ్యాధిగ్రస్థులకు వ్యాక్సిన్​ తీసుకోవచ్చని కేంద్రం స్పష్టం చేసిందని పేర్కొంటున్నారు. మరి సైఫ్‌కు ఏమైనా ఆరోగ్య సమస్యలు ఉండవచ్చని, ఆ కారణంతో వ్యాక్సిన్‌ తీసుకున్నారేమోనని ఆయనకు అండగా నిలుస్తున్నారు. ఇదిలా ఉండగా రెండో విడతలో భాగంగా ప్రధాని నరేంద్ర మోదీ, రామ్‌నాథ్‌ కోవింద్‌, భారత క్రికెట్ కోచ్ రవిశాస్త్రి, విలక్షణ నటుడు కమల్ హాసన్, నటి రాధిక, చిత్రనిర్మాత రాకేశ్ రోషన్, ప్రముఖ నటుడు సతీష్ షా వంటి ప్రముఖులు వ్యాక్సిన్‌ వేయించుకున్నారు.

చదవండి: తైమూర్‌కు తమ్ముడొచ్చాడు

వాళ్లను వదిలేయలేదు.. ముగ్గురూ సమానమే: నటి

మరిన్ని వార్తలు