‘రాధే’ మూవీ టీంకు భారీ షాక్‌, సల్మాన్‌ ఫైర్‌

17 May, 2021 16:21 IST|Sakshi

బిగ్‌ స్క్రీన్‌పై విడుదలవ్వాల్సిన పెద్ద సినిమాలు సైతం కరోనా దెబ్బకు ఓటీటీ బాట పడుతున్నాయి. అయినప్పటికీ ఈ చిత్రాలను పైరసీ భూతం వదలడం లేదు. ఎక్కడైనా సరే పెద్ద సినిమాల దర్శక నిర్మాతలకు ఈ పైరసీ పెద్ద తలనొప్పిగా మారింది. తాజాగా విడుదలైన బాలీవుడ్‌ భాయిజాన్‌ సల్మాన్‌ ఖాన్‌ ‘రాధే’ మూవీకి కూడా ఈ సమస్య తప్పలేదు. గతేడాది నుంచి థియేటర్లలోకి ఎప్పుడెప్పుడు వస్తుందా అని ఎదురు చూస్తున్న ‘రాధే’ మూవీని సెకండ్‌ వేవ్‌ మరింత తీవ్రంగా ఉండటంతో ఓటీటీలోనే విడుదల చేయాల్సి వచ్చింది. 

ప్రభుదేవా దర్శకత్వం వహించిన ఈ చిత్రం గురువారం జీప్లెక్స్‌లో పే పర్‌ వ్యూ విధానంలో విడుదల అయ్యింది. అయితే విడుదలైన గంటల వ్యవధిలోనే ఈ సినిమా ఆన్‌లైన్‌లో లీకైయింది. మరోవైపు ఓటీటీ యాప్‌లు డౌన్‌ అయ్యి సర్వర్లు నిలిచిపోయిన సంగతి తెలిసిందే. దీంతో చాలా మంది ఆన్‌లైన్‌లో వచ్చిన పైరసీని ఆశ్రయించారు. అది తెలిసి జీ5 నిర్వహాకులు సైబర్‌ సెల్‌లో కేసు నమోదు చేశారు. అంతేగాక సల్మాన్‌ సైతం పైరసీ వీరులపై మండిపడుతూ.. సోషల్‌ మీడియా వేదికగా వారికి గట్టి వార్నింగ్‌ ఇచ్చాడు.   

‘కేవలం 249 రూపాయలకే మా సినిమా రాధేను ఓటీటీలో అందుబాటులో ఉంచాం. అయినప్పటికీ సినిమాను మీరు పైరసీ చేయడం చట్టరిత్యా నేరం. దీన్ని తీవ్రమైన నేరంగా పరిగణిస్తూ ఈ అక్రమ సైట్ల నిర్వహకులతో పాటు, వాటిని వినియోగించిన వారిపై సైతం సైబర్‌ సెల్‌ చర్యలు తీసుకుంటుంది. సైబర్‌ సెల్‌తో మీకు ఇబ్బందులు తప్పవు. పైరసీని ఎవరూ ప్రోత్సహించకండి. దయచేసి అర్థం చేసుకోండి’ అంటూ సల్మాన్‌ తన ట్వీట్‌లో రాసుకొచ్చాడు. కాగా సినిమాకు విడుదల ముందే సల్మాన్‌ మూవీని ఎలాంటి పైరసీలకు యత్నించకుండా సరైన వేదికలపైనే మూవీని ఆస్వాధించాలని ప్రేక్షకులకు విజ్ఞప్తి చేశాడు. సల్మాన్ సరసన దిశా పటానీ ‘రాధే’లో సందడి చేసింది. 

>
మరిన్ని వార్తలు